యాభై ఏళ్ల క్రితం తూర్పు పాకిస్తాన్ ప్రజలపై పశ్చిమ పాకిస్తాన్ పాలకుల అణచివేత, భయంకరమైన హింసాకాండ అంతర్యుద్ధ పరిస్థితులను సృష్టించాయి. కోటీ 20 లక్షల మంది శరణార్థులు తూర్పు పాకిస్తాన్ నుంచి భారత్‌కు శరణార్థులై వచ్చారు. ఈ మానవతావాద సంక్షోభ ఫలితంగా ఇరుదేశాల మధ్య యుద్ధం అనివార్యమని తేలి పోయింది. ఊహించినట్లే 1971 డిసెంబర్ 3న భారత్ భూభాగంపై పాక్ దాడి మొదలెట్టగా భారత్ ప్రతిదాడులకు దిగింది. డిసెంబర్ 16న యుద్ధం ముగిసింది. అటు పాక్ దాడినీ, ఇటు అమెరికా సెవెన్త్ ఫ్లీట్ కదలికలను ఎదుర్కొంటూ భారత్ చివరకు అద్భుత విజయం సాధించింది. బంగ్లాదేశ్ ముక్తివాహిని సైన్యానికి చివరివరకు భారత్ దన్నుగా నిలిచింది. అవి బంగ్లాదేశ్ చరిత్రను మలిచిన అపరూప క్షణాలు...
మన పొరుగు దేశం పాకిస్తాన్‌ని రెండుగా చీల్చి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారి తీసిన ఆ గొప్పఘటనకు నేటితో 50 ఏళ్లు. కానీ 1971 యుద్ధంలో భారతీయ నౌకాదళం అత్యంత కీలకపాత్ర పోషించిన ఘట్టాలు 88 సంవత్సరాల అడ్మిరల్ లక్ష్మీనారాయణన్ రామదాస్ (రిటైర్డ్) మనస్సులో ఇప్పటికీ తాజాగానే మెదలాడుతున్నాయి. సంపాదకురాలు, రచయిత్రి మన్రాజ్ గ్రేవల్ శర్మతో ఆయన పంచుకున్న
ఆనాటి సంగతులు...
1971 ఏప్రిల్‌లో నాటి భారత నౌకా దళాధిపతి ఎస్‌ఎమ్ నందా... మందుగుండుతో సిద్ధంగా ఉంచాలని వెస్టర్న్ ఫ్లీట్‌కి తెలిపినప్పుడు ముంచుకొస్తున్న ప్రమాదం గురించిన తొలి సంకేతం వెలువడింది. కోటీ 20 లక్షలమంది బెంగాలీ శరణార్థులు సరిహద్దు దాటి భారత్ వచ్చినప్పుడు దేశం మానవాతావాద సంక్షోభాన్ని ఎదుర్కొంది అని ఆనాటికి అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ బీస్ కమాండర్‌గా ఉన్న రామదాస్ అభిప్రాయపడ్డారు. యుద్ధం తప్ప ఈ సంక్షోభాన్ని మరేదీ పరిష్కరించలేదని వెస్టర్న్ ఫ్లీట్ కమాండర్ రియర్ అడ్మిరల్ కురువిల్లా ప్రకటించినప్పుడు పాకిస్తాన్‌తో ఘర్షణ తప్పదనిపించింది. ఆ తర్వాత కొద్దికాలానికే ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్ర, ఐఎన్‌ఎస్ బియాస్ యుద్ధ నౌకలు హిందూ మహాసముద్రంలో ఉన్న భారత నేవీ మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎస్‌ఎస్ విక్రాంత్‌కు ఉపరితలం నుంచి, గగనతలం నుంచి రక్షణ కల్పిస్తూ దాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాయి. అప్పటినుంచి ఇవి విశాఖపట్నం, పరాదీప్, అండమాన్, మద్రాస్ మధ్య నిత్యం సంచరిస్తూ తామున్న స్థానాన్ని శత్రువు అంచనా వేసుకునే అవకాశాన్ని ఇచ్చినట్లే ఇచ్చి తప్పించుకుంటూ దాగుడుమూతలాడుతూ వచ్చాయి.
ఈ దాగుడుమూతల్లో ఒక్క క్షణం కూడా ఏమారని పరిస్థితి ఉండేది. అలాంటి ప్రయణంలో ఐఎన్‌ఎస్ బియాస్ ప్రధానాయుధమైన ఎఫ్‌పీఎస్ 5 ఆయుధ నియంత్రణ వ్యవస్థ ఉన్నట్లుండి పనిచేయకుండా నిలిచిపోయింది. అడ్మిరల్ రామ్‌దాస్‌కీ ఏం చేయాలో పాలుపోలేదు. దాని విడిభాగాలు బ్రిటన్ నుంచి తెప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడే ఆయన కింది అధికారులు యురేకా అని అరిచేటటువంటి ఆవిష్కరణ చేశారు. దివంగత ఎస్‌ఎన్ సింగ్, ఎలెక్ట్రికల్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కమాండర్ ఆర్‌వీ సింగ్ పాడైపోయిన సెన్సర్ స్థానంలో గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ పాకెట్‌లోని జిగినీ కాగితాన్ని చుట్టడం ద్వారా అద్బుత పరిష్కారాన్ని కనుగొన్నారు. మాకెంత సంతోషమేసిందంటే ఆ యుద్ధం పొడవునా, ఆ తర్వాత కూడా ఈ మ్యాజిక్ బ్రహ్మాండంగా పనిచేసింది.
1971 డిసెంబర్ 3న యుద్ధం మొదలైనప్పుడు ఐఎన్‌ఎస్ బియాస్ అండమాన్‌లో ఉండేది. మరుసటి దినం ఐఎన్‌ఎస్ విక్రాంత్ పైలట్లు తమ తొలి గగనతల దాడిని చేపట్టారు. దాంతో తన యుద్ధనౌకను యాక్షన్ స్టేషన్లకు మళ్లించాలని రామ్‌దాస్ అధికారులను ఆదేశించారు. ఆయన ఊహించినట్లే తూర్పు పాకిస్తాన్‌ను దిగ్బంధం చేయడంలో ఐఎన్‌ఎస్ బియాస్ కీలకపాత్రను పోషించింది. కాక్స్ బజార్‌పై బాంబుదాడులు చేయడం, గన్ బోట్లను అడ్డుకోవడం, విదేశీ వాణిజ్య నౌకల ముసుగులోని పాకిస్తాన్ యుద్ధనౌకలను ఎదుర్కోవడం, జలాంతర్గామి వ్యతిరేక ఆపరేషన్లను నిర్వహించడం ఐఎన్‌ఎస్ బియాస్ సైనిక చర్యలో కొన్ని ముఖ్య అంశాలు.
పాకిస్తాన్‌కి చెందిన కాక్స్ బజార్ విమానాశ్రయంపై చేసిన బాంబుదాడి గొప్పగా విజయవంతమైంది. యుద్ధానంతరం, ముక్తివాహినిలో చేరిన కొంతమంది నావికులు చిట్టగాంగ్ సమీపంలో ఐఎన్‌ఎస్ బియాస్‌లోకి అడుగుపెట్టి ఆ దాడిలో జరిగిన నష్టం గురించి మాట్లాడారు. ఆ సమయంలో నావికులు 24 గంటలూ కళ్లలో వత్తులు వేసుకుని పరిసరాలను గమనిస్తుండేవారు. ఒకరోజు గన్నరీ విభాగ అధికారి, దివంగత లెఫ్టినెంట్ జాన్ డిసిల్వా పెరిస్కోప్ లాంటి ఒక పరికరాన్ని గమనించారు. ఐఎన్‌ఎస్ బియాస్, ఐఎన్ కమోర్తా యుద్ధనౌకలు వెంటనే జలాంతర్గామి వ్యతిరేక ఆయుధాలతో దానిపై గురిపెట్టాయి. ఐఎన్‌ఎస్ విక్రాంత్ సురక్షిత స్థానానికి చేరుకునేంతవరకు ఆ డివైస్‌ని అవి అడ్డుకున్నాయి.
యుద్ధం మొదలైన తొమ్మిదో రోజున విదేశీ వాణిజ్య నౌకల ముసుగులో ఉన్న పాకిస్తానీ వాణిజ్య నౌక అన్వర్ బక్షిని ఐఎన్‌ఎస్ బియాస్ అడ్డుకుంది. ఆ నౌకను గమనించి, అనుపానులు శోధించేందుకు లెఫ్టినెంట్ కమాండర్ రాజ్ బజాజ్ నేతృత్వంలో కొందరు నావికుల బృందాన్ని నియమించారు. సరిగ్గా ఆ సమయంలోనే పాకిస్తానీ నౌకలో ఒకరు ఆయుధాన్ని తీసుకోవడానికి ప్రయత్నించడం డి లాల్ అనే మన నావికుడి కంటపడింది. వెంటనే లాల్ ఆ వ్యక్తిపైకి గురిపెట్టి కాల్చాడు. దాంతో లాల్‌కి ‘డేంజర్ లాల్’ అని పేరొచ్చింది. తర్వాత ఆ నౌక డెక్ కింది భాగంలో పలువురు పాకిస్తానీ నావికులు ఉన్నట్లు మన నావికుల బృందం కనుగొంది. వారిని పట్టుకుని కలకత్తా తరలించి స్థానిక అధికారులకు అప్పగించారు. ఆ సమయంలోనే ఐఎన్‌ఎస్ బియాస్ కోసం మరో సాహస చర్య ఎదురుచూస్తోంది. విమాన వాహక నౌక యుఎస్‌ఎస్ ఎంటర్‌ప్రైజెస్, యూఎస్ సెవెన్త్ ఫ్లీట్‌కు చెందిన ఇతర విభాగాలు బంగాళాఖాతం వైపు పయనించడం మొదలెట్టాయి. ఆ అమెరికన్ సెవెన్త్ ఫ్లీట్ ప్రయాణాన్ని మందగింపజేయాలని ఐఎన్‌ఎస్ బియాస్‌ను ఆదేశించాము. దాంతో అది యుఎస్‌ఎస్ ఎంటర్‌ప్రైజెస్ వైపు శరవేగంతో పయనించసాగింది. ఆ సమయంలో మేము రేడియోను ఆపేశాం. రాడార్‌ని సైలెంటుగా ఉంచాం. కానీ ప్రతిదీ మేం వింటూ వచ్చాం. ఆకాశంలో పైలెట్ల మధ్య మాటల్ని కూడా మేం వినగలిగాం. యుఎస్ వాహకనౌక చాలా శక్తివంతమైనదే అయినప్పటికీ 230మంది నావికులు, 20మంది అధికారులతో కూడిన ఐఎన్‌ఎస్ బియాస్ ఎంతో స్ఫూర్తిని కలిగి ఉండేది. ఐఎన్‌ఎస్ బియాస్ తన ప్రయాణ క్రమంలో యుఎస్‌ఎస్ ఎంటర్‌ప్రైజెస్ యుద్ధనౌకను సమీపిస్తున్న సమయంలోనే... ఢాకా పతనమైందని, యుద్ధం ముగి సిందని శుభవార్త వచ్చింది.
ముంబైలోని కొలాబాలో ఉన్న నా సహచరి లలితది మరొక సాహసగాథ. నాతో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా ఆరునెలలు గడిపారామె. అప్పట్లో మొబైల్స్ లేవు. ఫోన్లు లేవు. ఉత్తరాలు లేవు. తోటి నావికుల భార్యలకు ధైర్యం చెప్పడానికి ప్రతిరోజూ ఆమె వారిని కలిసి వచ్చేవారు. భర్తలు ఎక్కడ ఉన్నారో కూడా తెలీని కాలంలో ఈ మహిళలు ఒకరికొకరు తోడై దృఢంగా నిలిచారు. యాబై ఏళ్ల తర్వాత ఇప్పుడు నేను శాంతికాముకుడినయ్యాను. ‘‘యుద్ధాలు దేన్నీ పరిష్కరించవు. పొరుగుదేశాలతో కలిసి బతకడం ఎలా అనే పనిని మనం మరింత మెరుగ్గా చేస్తే బాగుంటుంది.’’
ప్రారంభం నుంచి ముగింపు దాకా...
1971లో భారత, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ ఫలితంగా పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ ప్రజా రిపబ్లిక్‌గా తనను తాను ప్రకటించుకుంది. షేక్ ముజిబుర్ రహమాన్ బంగ్లాదేశ్ తొలి ప్రధాని అయ్యారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం ప్రారంభమై ముగిసేంతవరకు అంటే డిసెంబర్ 3 నుంచి 16 దాకా జరిగిన రోజువారీ ఘటనల వివరాలు...
డిసెంబర్ 3: పాక్ వాయుసేన పశ్చిమ రంగంలో భారత వైమానిక కేంద్రాలపై దాడి మొదలెట్టింది. అమృత్‌సర్, పఠాన్ కోట్, శ్రీనగర్, అవింతిపుర, అంబాలా, సిర్సా, హల్వారా, ఆగ్రాపై ఏకకాలంలో దాడి తలపెట్టింది.
డిసెంబర్ 3–6: పశ్చిమ, తూర్పు రంగాల్లో పాక్ వైమానిక స్థావరాలపై దాడి చేయడం ద్వారా భారత వాయుసేన ఎదురుదెబ్బ తీసింది. ఈ సమయంలోనే పాకిస్తాన్ పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో భారత భూతల స్థావరాలపై దాడి మొదలెట్టింది.
డిసెంబర్ 4: రాజస్థాన్‌లోని లోంగెవాలా ప్రాంతంలో యుద్ధం మొదలైంది. జైసల్మేర్ వైపు పురోగమించాలని పాక్ తలపెట్టిన ప్రయత్నాన్ని భారత్ వమ్ము చేసింది.
డిసెంబర్ 5: తూర్పుపాకిస్తాన్‌లోని ఘజియాపూర్‌లో, పాకిస్తాన్ పంజాబ్‌కి చెందిన పశ్చిమ రంగంలోని బసంతార్‌లో యుద్ధం మొదలైంది. అలాగే పంజాబ్ జిల్లా గుర్దాస్‌పూర్ లోని డేరాబాబా నానక్ ప్రాంతంలో యుద్ధం జరిగింది.
డిసెంబర్ 6: భారత్ లాంఛనప్రాయంగా బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. జెస్సోర్ నగరం విముక్తయింది.
డిసెంబర్ 7: బంగ్లాదేశ్‌లోని సిల్హెట్, మౌలోవి బజార్ ప్రాంతంలో యుద్ధం మొదలైంది,
డిసెంబర్ 8: పాకిస్తాన్ రేవు పట్టణం కరాచీలో భారత నౌకాదళం దాడులు మొదలెట్టింది.
డిసెంబర్ 9: భారత సైన్యం బంగ్లాదేశ్‌లోని కౌస్టియాలో యుద్ధానికి దిగింది. చాంద్‌పూర్, దౌడ్‌కండి విముక్తి పొందాయి. భారత సైనిక దళాలను హెలికాప్టర్ బ్రిడ్జ్ ద్వారా మేఘ్నా నదిని దాటించారు. ఇక ఢాకా పతనం క్షణాలమాటే అయింది.
డిసెంబర్ 10: బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ వైమానిక స్థావరంపై భారత వాయుసేన విమానాలు దాడి చేశాయి.
డిసెంబర్ 11: బంగ్లాదేశ్‌లోని పాక్ సైనికులు తిరోగమించకుండా పారాచూట్ బెటాలియన్‌ని విమానాల ద్వారా తరలించారు.
డిసెంబర్ 12–16: భారతసైన్యం మరింతగా పురోగమించి ఢాకాలో అడుగుపెట్టింది. పాకిస్తాన్ ఈస్టర్న్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ లొంగుబాటుపత్రంపై సంతకం చేశారు. భారత ఈస్టర్న్ కమాండర్ జగ్జిత్ సింగ్ అరోరా ముందు లొంగిపోయారు. దీంతో బంగ్లాదేశ్‌లోని 93 వేలమంది పాకిస్తానీ బలగాలు ఆయుధాలను కిందికి దించేశాయి. (‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment