న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్‌తో పాటు బీఎస్ఎఫ్ డిప్యూటీ స్పెషల్ డీజీ (పశ్చిమ) వైబీ ఖురానియాలను తొలగించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ)వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తొలగింపు నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని, ఆ ఇద్దరు అధికారులను వారి రాష్ట్రాల కేడర్‌లకు తిరిగి పంపిస్తున్నట్టు వెల్లడించింది.
కాగా నితిన్ అగర్వాల్ 1989 బ్యాచ్ కేరళ కేడర్ అధికారి కాగా.. ఖురానియా 1990 బ్యాచ్ ఒడిశా కేర్‌కు చెందినవారు. గతేడాది జూన్‌లో బీఎస్‌ఎఫ్ చీఫ్‌గా అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఖురానియా ప్రత్యేక డీజీగా(పశ్చిమ) పాకిస్థాన్ సరిహద్దు వెంబడి దళానికి నేతృత్వం వహిస్తున్నారు.
కాగా అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్‌లోకి నిరంతరం చొరబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అయితే ఉగ్రవాద ఘటనలకు సంబంధించి బలగాల చీఫ్‌లను తొలగించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా బీఎస్‌ఎఫ్‌లో దాదాపు 2.65 లక్షల మంది జవాన్లు ఉన్నారు. వీరు పశ్చిమ దిక్కున పాకిస్తాన్, తూర్పున బంగ్లాదేశ్‌తో భారత సరిహద్దులను కాపాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment