హిందువులపై దాడులు సహించం
కోహీర్: హిందువులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు స్పష్టం చేశారు. బుధవారం కోహీర్ మండలం కవేలి గిరిజా సంగమేశ్వర స్వామి ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన హిందూ మత సంస్థల నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హిందూ సంస్కృతి మహోన్నతమైందన్నారు. అనేక శతాబ్దాలుగా దాడులు, అవమానాలను భరిస్తూ వచ్చిందన్నారు. సహనానికి మారుపేరైన హిందువులపై ఇంకా ఇతర మతస్థులు దాడులకు పాల్పడడం దారుణమన్నారు.
మండలంలోని గురుజువాడ గ్రామంలో ప్రచారం చేస్తున్న కార్యకర్తలపై ఇతర మతస్థులు దాడి చేసి గాయపరచడం సహించరాని విషయమన్నారు. నిందితులపై చర్య తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అవమానానికి గురైన చోటి నుంచి రథయాత్రను తిరిగి ప్రారంభించడానికి ఆవకాశం ఇవ్వడం లేదన్నారు. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
దాడి చేసి గాయపరిచిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో వీహెచ్పీ రాష్ట్ర నాయకులు హేమంత్ సంగ్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బల్వంత్ రావు, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు పన్యాల ప్రభాకర్, బజరంగ్ దళ్ విభాగ్ ప్రముఖ్ సుభాష్, ఓంకార్ ఎకాల్ విద్యాలయ ప్రముఖ్ శంకర్, నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లికార్జున్ పాటిల్, నాయకులు సుధీర్ బండారీ, శివకుమార్, విశ్వనాథ్, మొగులయ్య, సిద్ధేశ్వర్, నరేష్ పాల్గొన్నారు.