హైబ్రిడ్ విధానంలో టోర్నమెంట్ నిర్వహణ
పాక్ మ్యాచ్‌లు నేపాల్ లేదా శ్రీలంకలో
మహిళల విభాగంలో తొలిసారిగా భారత్ అంధుల టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జరిగే ఈ టోర్నీని నిర్వహించనున్నారు. అయితే, పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.
భారత్‌లో ఆడేందుకు మహిళల పాకిస్తాన్ అంధుల జట్టుకు ఏమైనా వీసా సమస్యలు వస్తే... నేపాల్ లేదంటే శ్రీలంకలో వారి మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మేరకు ప్రపంచ అంధుల క్రికెట్ మండలి (డబ్ల్యూబీసీసీ) తమ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో నిర్ణయించింది.
ముల్తాన్‌లో సమావేశం
ముల్తాన్‌లో జరిగిన ఈ ఏజీఎంలో 11 సభ్య దేశాల ప్రతినిధులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ బోర్డుల ప్రతినిధులు వర్చువల్ (ఆన్‌లైన్)గా పాల్గొన్నారు. పురుషుల విభాగంలో అంధుల టీ20 ప్రపంచకప్‌ను 2027లో నిర్వహించనున్నారు.
ఇక వేదిక, తేదీలను వచ్చే ఏడాది జరిగే ఏజీఎమ్‌లో ఖరారు చేస్తారు. గతేడాదే ఆతిథ్య హక్కుల్ని భారత్‌కు కట్టబెట్టారని భారత అంధుల క్రికెట్ సంఘం (సీఏబీఐ) అధ్యక్షుడు జీకే మహంతేశ్ తెలిపారు.
ఖర్చులన్నీ భారత బోర్డు భరిస్తుంది
అయితే, తటస్థ వేదికపై పాక్ ఆడితే ఇందుకు సంబంధించిన ఖర్చులన్నీ భారత బోర్డు భరిస్తుందని ఆయన వెల్లడించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు సీఏబీఐ అనుబంధ సంఘం కాదు. ఇది పూర్తిగా ప్రపంచ అంధుల క్రికెట్ మండలి (డబ్ల్యూబీసీసీ) గొడుగుకింద పనిచేస్తుంది.
ప్రపంచం చాంపియన్‌గా తొలిసారి పాక్
ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై పురుషుల అంధుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2024 టైటిల్‌ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా డిఫెండింగ్ చాంపియన్ భారత్ పాక్ పర్యటనకు వెళ్లలేదు. పాకిస్తాన్‌కు ఇది సానుకూలాంశంగా మారింది. ఈ క్రమంలో ముల్తాన్‌లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి పాక్ కొత్త చాంపియన్‌గా అవతరించింది.
ఇప్పటికి నాలుగు సార్లు ఈ టోర్నీని నిర్వహించగా మూడుసార్లు భారత్ ట్రోఫీని గెలుచుకుంది. తొలి రెండు ప్రయత్నాల్లో ఫైనల్లో పాక్‌ను, ఆఖరిగా బంగ్లాను ఓడించి విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment