సెమీస్‌లో భారత్
భువనేశ్వర్: మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన భారత్ అంధుల టి20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలిచింది. 10 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ ఏడు విజయాలు సాధించి 21 పాయింట్లతో పాకిస్తాన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. లీగ్ దశలో టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఆరు వికెట్లకు 136 పరుగులు చేసింది.
భారత్ కేవలం తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టపోయి 140 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. స్కోరు 136 వద్ద సమంగా ఉన్నపుడు బౌండరీతో భారత్ విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్ మూడో బంతికే ఓపెనర్ ఇక్బాల్ జాఫర్ పరుగులేమీ చేయకుండా అవుటవ్వగా... సుఖ్‌రామ్ (25 బంతుల్లో 56 నాటౌట్; 11 ఫోర్లు), కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి (28 బంతుల్లో 75 నాటౌట్; 14 ఫోర్లు) రెండో వికెట్‌కు అజేయంగా 140 పరుగులు జత చేశారు. బుధవారం విజయవాడలో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్ ఆడుతుంది.