NZ Vs BAN: చర్రిత సృష్టించిన రచిన్‌ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా | Rachin Ravindra Becomes First Player In The World Creates History To Score A Century On Debut, More Details Inside | Sakshi
Sakshi News home page

NZ vs BAN: చర్రిత సృష్టించిన రచిన్‌ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Published Tue, Feb 25 2025 9:10 AM | Last Updated on Tue, Feb 25 2025 10:22 AM

Rachin Ravindra Creates History, Becomes First Player In The World

ఇటీవలే ముక్కోణపు వన్డే సిరీస్‌లో గాయపడిన‌ న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర అద్బుత‌మైన క‌మ్‌బ్యాక్ ఇచ్చాడు. గాయం నుంచి కోలుకుని  తిరిగి వ‌చ్చిన తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీతో మెరిశాడు. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భాగంగా రావ‌ల్పిండి వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ర‌వీంద్ర శ‌త‌కంతో చెల‌రేగాడు. 237 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో 15 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయిన కివీస్‌ను ర‌వీంద్ర త‌న అద్బుత‌మైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.

డెవాన్ కాన్వే, టామ్ లాథ‌మ్‌తో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో 95 బంతుల్లో తన నాలుగో వ‌న్డే సెంచరీ మార్క్‌ను రవీంద్ర అందుకున్నాడు. ఓవరాల్‌గా 105 బంతులు ఎదుర్కొన్న రచిన్‌.. 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 112 పరుగులు చేసి ఔటయ్యాడు.

అత‌డి సూప‌ర్ సెంచ‌రీ ఫ‌లితంగా కివీస్ ల‌క్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 46.1 ఓవ‌ర్ల‌లో అందుకుంది. దీంతో త‌మ సెమీస్ బెర్త్‌ను న్యూజిలాండ్ ఖారారు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో శ‌త‌కొట్టిన ర‌వీంద్ర ప‌లు అరుదైన ఘ‌న‌త‌ల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

ర‌వీంద్ర సాధించిన రికార్డులు ఇవే..
వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్‌గా ర‌చిన్ ర‌వీంద్ర రికార్డుల‌కెక్కాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన రచిన్.. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ బంగ్లాదేశ్‌తో ఆడిన మొద‌టి మ్యాచ్‌లోనే శ‌తకంతో మెరిశాడు.

త‌ద్వారా ఈ అరుదైన ఫీట్‌ను ర‌చిన్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు 19 మంది త‌మ డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచ‌రీ చేయ‌గా.. ఛాంపియన్స్ ట్రోఫీలో 15 మంది ఆటగాళ్లు తమ ఫస్ట్ మ్యాచ్‌లోనే శ‌తక్కొట్టారు.

కానీ ఈ రెండు ఈవెంట్ల‌లోనే అరంగేట్ర మ్యాచ్‌ల్లో సెంచ‌రీలు సాధించిన తొలి ప్లేయ‌ర్ ర‌వీంద్రే కావ‌డం విశేషం. రవీంద్ర తన కెరీర్‌లో నాలుగు వ‌న్డే సెంచరీలు నమోదు చేయగా.. ఆ నాలుగు కూడా ఐసీసీ వేదికలపైనే కావడం విశేషం. దీంతతో ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన కివీస్‌ బ్యాటర్‌గా కూడా రచిన్‌ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ కేన్‌ విలియమ్సన్‌(3) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో విలియమ్సన్‌ రికార్డును రచిన్‌ బ్రేక్‌ చేశాడు.
చదవండి: Champions Trophy 2025: పాకిస్తాన్‌కు భారీ షాక్‌.. టోర్నీ నుంచి ఔట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement