T20 World Cup Tournament
-
యూఏఈలో ఆడటం సానుకూలాంశం
న్యూఢిల్లీ: మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీ యూఏఈ వేదికపై జరగనుండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. మిగతా జట్లకంటే షార్జా, దుబాయ్ వేదికలు భారత్‌కు సానుకూలమని ఆమె విశ్లేషించింది. అక్కడి స్థానిక వాతావరణ, పిచ్ పరిస్థితులు అందరికంటే భారత్‌కే ఎక్కువగా లాభిస్తాయని ఆమె చెప్పింది. ‘యూఏఈలోని పరిస్థితులు కాస్తా భిన్నంగా ఉండొచ్చేమో కానీ భారత్‌కు దగ్గరగానే ఉంటాయి. ఇది మెగా ఈవెంట్లో మన జట్టుకు బాగా ఉపకరించే అంశం. ఈ సానుకూలతతో జట్టు అక్కడి వాతావరణానికి ఇట్టే అలవాటు పడుతుంది’ అని మిథాలీ వివరించింది. అయితే జరగబోయేది మెగా ఈవెంట్ అన్న సంగతి మరవొద్దని ప్రతీ జట్టు ప్రపంచకప్ కోసం సన్నద్ధమయ్యే వస్తుందని తమ జట్టు వర్గాలను అప్రమత్తం చేసింది. ‘మెగా ఈవెంట్లో పాల్గొనే ప్రతి జట్టు అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని తెలిపింది. ఐసీసీ ప్రపంచకప్ టోరీ్నలో ఫైనల్ చేరిన సీనియర్ మహిళల జట్టు ఇంత వరకు టైటిల్‌ను మాత్రం గెలవలేకపోయింది. అండర్–19 ప్రపంచకప్‌లో మాత్రం యువ మహిళల జట్టు గతేడాది ఆరంభమైన తొలి మెగా ఈవెంట్‌ను గెలిచింది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు రాణించాలని, కప్‌తో తిరిగి రావాలని బలంగా కోరుకుంటున్నట్లు మాజీ కెపె్టన్ చెప్పింది. వచ్చే నెల 3 నుంచి యూఏఈలో అమ్మాయిల టి20 ప్రపంచకప్ మొదలవుతుంది. దుబాయ్ వేదికగా 4వ తేదీన భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. -
అరుదైన రికార్డు నెలకొల్పనున్న రోహిత్ శర్మ
వచ్చే నెలలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్-2022లో పాల్గొనడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును నెలకొల్పనున్నాడు. 2007 నుంచి 2022 వరకు అన్ని పొట్టి ప్రపంచ కప్‌లలో ఆడిన/ఆడనున్న ఆటగాడిగా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించనున్నాడు. రోహిత్‌తో పాటు ఈ రికార్డును బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా షేర్ చేసుకోనున్నాడు. షకీబ్ కూడా రోహిత్ లాగే అన్ని టీ20 ప్రపంచ కప్‌లలో ఆడాడు/ఆడనున్నాడు. Rohit Sharma and Shakib Al Hasan are the only two players to participate in each and every T20 World Cup from 2007 to 2022. — Mufaddal Vohra (@mufaddal_vohra) September 16, 2022 ఈ ఇద్దరే కాకుండా మరో ఆరుగురు 2007 నుంచి 2021 వరకు వరుసగా ఏడు ఎడిషన్లలో ఆడారు. విండీస్ ఆటగాళ్లు క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, పాకిస్తాన్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌లు 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021 టీ20 ప్రపంచ కప్‌లలో పాల్గొన్నారు. అయితే వీరంతా రిటైర్మెంట్ లేదా వయసు పైబడిన కారణం చేత 2022 వరల్డ్ కప్‌లో ఆడటం లేదు. రోహిత్, షకీబ్‌లు ఇద్దరు ఆక్టోబర్ 16 నుంచి ప్రారంభంకానున్న 8వ ఎడిషన్ ప్రపంచ కప్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లకు నాయకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు జరిగిన ఏడు పొట్టి ప్రపంచకప్‌లలో వెస్టిండీస్ జట్టు అత్యధికంగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. విండీస్ టీమ్ శ్రీలంకలో జరిగిన 2012 వరల్డ్ కప్, భారత్‌లో జరిగిన 2016 ప్రపంచ కప్‌లలో జగజ్జేతగా నిలిచింది. మిగిలిన ఐదు సందర్భాల్లో వివిధ జట్లు విజేతలుగా నిలిచాయి. సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొట్టతొలి పొట్టి ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్‌లో జరిగిన 2009 ఎడిషన్‌లో పాకిస్తాన్, విండీస్ వేదికగా జరిగిన 2010 ఎడిషన్‌లో ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లో జరిగిన 2014 ఎడిషన్‌లో శ్రీలంక, యూఏఈ వేదికగా జరిగిన 2021 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్లుగా నిలిచాయి. -
యూఏఈలోనే టి20 ప్రపంచకప్: గంగూలీ
కరోనా నేపథ్యంలో టి20 ప్రపంచకప్ వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో భారత్‌లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్‌ను యూఏఈకి తరలిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘ప్రపంచకప్ వేదికను యూఏఈకి మారుస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి సమాచారం ఇచ్చాం. తుది షెడ్యూల్, ఇతరత్రా విషయాలన్నీ త్వరలోనే వెల్లడిస్తాం’ అని గంగూలీ చెప్పారు. -
భారత మహిళా క్రికెటర్లకు ‘ఆ మొత్తం’ అందనేలేదు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా గత సంవత్సరం జరిగిన టి20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఐదు లక్షల డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. అయితే 14 నెలలు పూర్తయినా... రన్నరప్ ప్రైజ్‌మనీ ఇప్పటికీ భారత మహిళా క్రికెటర్ల చేతికందనేలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రన్నరప్ ప్రైజ్‌మనీ మొత్తం 5 లక్షల డాలర్లను (రూ. 3 కోట్ల 64 లక్షలు) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గత సంవత్సరం ఏప్రిల్‌లోనే అందజేసినప్పటికీ బోర్డు మాత్రం అమ్మాయిలకు ఆ మొత్తాన్ని ఇప్పటిదాకా ఇవ్వనే లేదు. మహిళా క్రికెటర్లపై బోర్డు శీతకన్నుకు ఇదో నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. ఏదైనా ఐసీసీ టోర్నమెంట్ ముగిసిన ఏడు రోజుల్లోనే ఐసీసీ ప్రైజ్‌మనీ నిధుల్ని ఆయా దేశాల బోర్డులకు పంపిస్తుంది. అయితే సంబంధిత దేశాల బోర్డులే తమ జట్లకు పంపిణీ చేయాలి. నిధులందిన రెండు వారాల్లోపే అమ్మాయిలకు పంపిణీ చేయాల్సి ఉన్నా బీసీసీఐ మాత్రం ఖజానాలోనే అట్టిపెట్టుకుంది. క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టుకు గత సంవత్సరం ఏప్రిల్‌లో... ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టుకు గత ఏడాది మేలోనే ప్రైజ్‌మనీని పంపిణీ చేశాయి. వారం రోజుల్లో ఇస్తాం: బీసీసీఐ బ్రిటన్ దినపత్రికలో వచ్చిన ఈ కథనం, దరిమిలా విమర్శలపై బోర్డు స్పందించింది. ఇంతవరకు అమ్మాయిలకు ప్రైజ్‌మనీ మొత్తాన్ని పంపిణీ చేయకపోవడం నిజమేనని అంగీకరించిన బోర్డు వారం రోజుల్లో దానిని మహిళా క్రికెటర్లకు ఇస్తామని తెలిపింది. ‘కరోనా కారణంగా ఈ ఒక్క ప్రైజ్‌మనీయే కాదు... పురుషుల, మహిళల కాంట్రాక్టు ఫీజులు, దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు, వార్షిక చెల్లింపులు అన్నీ ఆలస్యమే అవుతున్నాయి’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. -
యూఏఈలో టి20 ప్రపంచకప్!
ఐపీఎల్ వాయిదా ప్రభావం కచ్చితంగా టి20 ప్రపంచకప్ నిర్వహణపై కూడా ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో భారత్‌లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో విదేశీ క్రికెటర్లు ఇక్కడికి రావడానికి వెనుకాడవచ్చు. 16 జట్లు టి20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నాయి. ప్రతీ దేశం భారత్‌కు వెళ్లే విషయంలో తమవారికి ఆంక్షలు పెడుతోంది. ఇప్పటికే పలు దేశాలు భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. టోర్నీకి మరో ఆరు నెలలు ఉంది కాబట్టి పరిస్థితి మెరుగుపడవచ్చని ఆశిస్తున్నా... క్రికెటర్లలో ఆందోళన పూర్తిగా తొలగిపోదు. నిజానికి బయటి పరిస్థితుల కారణంగానే ఐపీఎల్ ఆడుతున్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. తమవారి క్షేమం గురించి ఆలోచించాల్సి రావడం వారిలో మరింత ఆందోళనను పెంచింది. చివరకు అదే ఐపీఎల్ వాయిదాకు కారణమైంది. వేళ్ల మీద లెక్కించదగ్గ కేసులు ఉన్నా కూడా 2020లో ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదా పడిన నేపథ్యంలో రోజుకు దాదాపు 3 లక్షల కేసులు నమోదవుతున్న భారత్‌లో వరల్డ్‌కప్ అంటే సహజంగానే జట్లు వెనకడుగు వేయవచ్చు. భారత్‌లోనే సాధ్యం కాకపోతే యూఏఈని ప్రత్యామ్నాయ వేదికగా ఐసీసీ చూస్తోంది. అయితే మన దేశంలో పరిస్థితులు ఇంత వేగంగా దిగజారతాయని ఐసీసీ కూడా ఊహించలేదు. యూఏఈలో జరిగినా నిర్వహణ బాధ్యతలు బీసీసీఐనే చూస్తుంది. అంటే ఒకవేళ అభిమానులను మైదానంలోకి అనుమతిస్తే టికెట్ ఆదాయం మన బోర్డుకే చెందుతుంది. త్వరలో జరిగే ఐసీసీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. -
తప్పనిసరైతేనే యూఏఈలో...
ముంబై: ఐదేళ్ల విరామం తర్వాత జరగనున్న టి20 ప్రపంచకప్ వేదిక మారనుందా? ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో భారత్‌లో జరగాల్సిన ఈ మెగా టోర్నీని మరో చోట నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోందా? తాజా పరిణామాల నేపథ్యంలో ఈ అంశం కొత్త చర్చకు దారి తీసింది. భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా పలు క్రికెట్ జట్లు ఇక్కడికి వచ్చి ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదని సమాచారం. దాంతో వేదిక మార్చడంపై చర్చ మొదలైంది. భారత్‌లో జరగకపోతే ప్రత్యామ్నాయ వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను బీసీసీఐ సిద్ధం చేసుకుంటోంది. అక్కడ జరిగినా నిర్వహణ మాత్రం బీసీసీఐదే. అయితే చివరి నిమిషం వరకు ఇక్కడే జరపాలని తాము ప్రయత్నిస్తామని, తప్పనిసరి అయితే మాత్రమే తరలిస్తామని టోర్నమెంట్ డైరెక్టర్ ధీరజ్ మల్హోత్రా వెల్లడించారు. వరల్డ్ కప్ కోసం తొమ్మిది వేదికల పేర్లను బోర్డు ఇప్పటికే ఐసీసీకి సమర్పించింది. కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్, ధర్మశాల, ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో టోర్నీ జరపాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించింది. ‘ప్రస్తుతానికి మాత్రం టోర్నీ వేదిక విషయంలో ఎలాంటి మార్పు లేదు. మేం భారత్‌లోనే నిర్వహిస్తాం. అయితే రాబోయే రోజుల్లో కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు ఇంకా దిగజారితే, తప్పనిసరి అయితే మాత్రం ఇక్కడి నుంచి తరలిస్తాం. మా దృష్టిలో యూఏఈనే సరైన వేదిక. ఈ విషయంలో ఐసీసీతో చర్చిస్తున్నాం. అయితే టోర్నీ కోసం మరో ఆరు నెలల సమయం ఉందనే విషయం మరచిపోవద్దు. ఆ లోపు పరిస్థితులు ఎంతో మెరుగు పడవచ్చు’ అని ధీరజ్ అభిప్రాయ పడ్డారు. సాధ్యం కాదా? కరోనా తీవ్రత పెరిగిన తర్వాత కూడా బీసీసీఐ యూఏఈలో గత ఏడాది ఐపీఎల్ నిర్వహించింది. ఈసారి బయో బబుల్‌ను ఏర్పాటు చేసి మరీ భారత్‌లో మరో ఐపీఎల్ నిర్వహిస్తోంది కూడా. మరి 16 దేశాల జట్లు పోటీ పడే టి20 ప్రపంచ కప్ నిర్వహణ కూడా ఇదే తరహాలో సాధ్యమేనా? బీసీసీఐ వద్ద కూడా దీనిపై స్పష్టమైన సమాధానం లేదు. ఐపీఎల్‌తో పోలిస్తే 16 జట్ల టోర్నీకి నిర్వహణా సమస్యలు చాలా ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు కారణం. ఇన్ని టీమ్‌లకు విడిగా బయో బబుల్‌లు ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. చిన్న పొరపాటు జరిగినా పరిస్థితులు తీవ్రంగా మారిపోతాయి. పైగా ఐపీఎల్లో ఒక్కో ఫ్రాంచైజీ అన్ని రకాలుగా తమ జట్టు బాధ్యతలు తీసుకుంటాయి. ఇక్కడ అన్నింటా బీసీసీఐదే పూర్తి బాధ్యత ఉంటుంది. పైగా ప్రపంచ కప్ కాబట్టి సహజంగానే అభిమానులతో ముడిపడిన సమస్య. జనం లేకుండా వరల్డ్ కప్‌లు జరపడం అర్థం లేనిదనేది సాధారణ అభిప్రాయం. విమానాల రాకపోకల సమస్యలతో పాటు ఇతర ఆంక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయో ఎవరికీ తెలీదు. ఇదే కారణంగా గతేడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదా వేశారు. అయితే తగినంత సమయం ఉండటం, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగి పరిస్థితులు మెరుగుపడాలని బీసీసీఐ కోరుకుంటోంది. ఈ క్రమంలో అవసరమైతే వేదికల సంఖ్యను తొమ్మిది నుంచి నాలుగు లేదా ఐదుకు తగ్గించాలని కూడా బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. 2016 టి20 ప్రపంచకప్ భారత్‌లో జరిగినప్పుడు 7 వేదికలను ఉపయోగించారు. -
ఆస్ట్రేలియాలో జరిగితే ఆ టికెట్లు చెల్లుతాయి: ఐసీసీ
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్–2020 టోర్నమెంటు 2021లో ఆస్ట్రేలియాలో జరిగితే ఇప్పటికే కొనుక్కున్న టికెట్లతో ఫ్యాన్స్ మ్యాచులు వీక్షించొచ్చని ఐసీసీ ప్రకటించింది. ఒకవేళ ఆస్ట్రేలియా 2022 టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తే, ఈ టికెట్ల డబ్బు వాపసు వస్తుందని పేర్కొంది. (విదేశాల్లో ఆడుకుంటాం.. అనుమతివ్వండి) కోవిడ్–19 వల్ల ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన పొట్టి ప్రపంచకప్‌ను వచ్చే ఏడాదికి ఐసీసీ సోమవారం వాయిదా వేసింది. 2021, 2022ల్లో వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లను నిర్వహిస్తామని తెలిపింది. (2021లో 20–20 ప్రపంచకప్) 2021 టీ20 ప్రపంచకప్‌ను భారత్ ఆతిథ్యం ఇవ్వాలి. కానీ దీనిపై ఐసీసీ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. -
సెమీస్‌లో భారత్
భువనేశ్వర్: మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన భారత్ అంధుల టి20 ప్రపంచకప్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలిచింది. 10 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ ఏడు విజయాలు సాధించి 21 పాయింట్లతో పాకిస్తాన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. లీగ్ దశలో టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఆరు వికెట్లకు 136 పరుగులు చేసింది. భారత్ కేవలం తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టపోయి 140 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. స్కోరు 136 వద్ద సమంగా ఉన్నపుడు బౌండరీతో భారత్ విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్ మూడో బంతికే ఓపెనర్ ఇక్బాల్ జాఫర్ పరుగులేమీ చేయకుండా అవుటవ్వగా... సుఖ్రామ్ (25 బంతుల్లో 56 నాటౌట్; 11 ఫోర్లు), కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి (28 బంతుల్లో 75 నాటౌట్; 14 ఫోర్లు) రెండో వికెట్‌కు అజేయంగా 140 పరుగులు జత చేశారు. బుధవారం విజయవాడలో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్ ఆడుతుంది.