ప్రపంచకప్ టి20 ట్రోఫీతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా (ఫైల్)
ముంబై: ఐదేళ్ల విరామం తర్వాత జరగనున్న టి20 ప్రపంచకప్ వేదిక మారనుందా? ఈ ఏడాది అక్టోబర్–నవంబర్‌లలో భారత్‌లో జరగాల్సిన ఈ మెగా టోర్నీని మరో చోట నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోందా? తాజా పరిణామాల నేపథ్యంలో ఈ అంశం కొత్త చర్చకు దారి తీసింది. భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా పలు క్రికెట్ జట్లు ఇక్కడికి వచ్చి ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదని సమాచారం. దాంతో వేదిక మార్చడంపై చర్చ మొదలైంది. భారత్‌లో జరగకపోతే ప్రత్యామ్నాయ వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను బీసీసీఐ సిద్ధం చేసుకుంటోంది. అక్కడ జరిగినా నిర్వహణ మాత్రం బీసీసీఐదే.
అయితే చివరి నిమిషం వరకు ఇక్కడే జరపాలని తాము ప్రయత్నిస్తామని, తప్పనిసరి అయితే మాత్రమే తరలిస్తామని టోర్నమెంట్ డైరెక్టర్ ధీరజ్ మల్హోత్రా వెల్లడించారు. వరల్డ్ కప్ కోసం తొమ్మిది వేదికల పేర్లను బోర్డు ఇప్పటికే ఐసీసీకి సమర్పించింది. కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్, ధర్మశాల, ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో టోర్నీ జరపాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించింది. ‘ప్రస్తుతానికి మాత్రం టోర్నీ వేదిక విషయంలో ఎలాంటి మార్పు లేదు. మేం భారత్‌లోనే నిర్వహిస్తాం. అయితే రాబోయే రోజుల్లో కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు ఇంకా దిగజారితే, తప్పనిసరి అయితే మాత్రం ఇక్కడి నుంచి తరలిస్తాం. మా దృష్టిలో యూఏఈనే సరైన వేదిక. ఈ విషయంలో ఐసీసీతో చర్చిస్తున్నాం. అయితే టోర్నీ కోసం మరో ఆరు నెలల సమయం ఉందనే విషయం మరచిపోవద్దు. ఆ లోపు పరిస్థితులు ఎంతో మెరుగు పడవచ్చు’ అని ధీరజ్ అభిప్రాయ పడ్డారు.
సాధ్యం కాదా?
కరోనా తీవ్రత పెరిగిన తర్వాత కూడా బీసీసీఐ యూఏఈలో గత ఏడాది ఐపీఎల్ నిర్వహించింది. ఈసారి బయో బబుల్‌ను ఏర్పాటు చేసి మరీ భారత్‌లో మరో ఐపీఎల్ నిర్వహిస్తోంది కూడా. మరి 16 దేశాల జట్లు పోటీ పడే టి20 ప్రపంచ కప్ నిర్వహణ కూడా ఇదే తరహాలో సాధ్యమేనా? బీసీసీఐ వద్ద కూడా దీనిపై స్పష్టమైన సమాధానం లేదు. ఐపీఎల్‌తో పోలిస్తే 16 జట్ల టోర్నీకి నిర్వహణా సమస్యలు చాలా ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు కారణం. ఇన్ని టీమ్‌లకు విడిగా బయో బబుల్‌లు ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. చిన్న పొరపాటు జరిగినా పరిస్థితులు తీవ్రంగా మారిపోతాయి. పైగా ఐపీఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీ అన్ని రకాలుగా తమ జట్టు బాధ్యతలు తీసుకుంటాయి.
ఇక్కడ అన్నింటా బీసీసీఐదే పూర్తి బాధ్యత ఉంటుంది. పైగా ప్రపంచ కప్ కాబట్టి సహజంగానే అభిమానులతో ముడిపడిన సమస్య. జనం లేకుండా వరల్డ్ కప్‌లు జరపడం అర్థం లేనిదనేది సాధారణ అభిప్రాయం. విమానాల రాకపోకల సమస్యలతో పాటు ఇతర ఆంక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయో ఎవరికీ తెలీదు. ఇదే కారణంగా గతేడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదా వేశారు. అయితే తగినంత సమయం ఉండటం, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగి పరిస్థితులు మెరుగుపడాలని బీసీసీఐ కోరుకుంటోంది. ఈ క్రమంలో అవసరమైతే వేదికల సంఖ్యను తొమ్మిది నుంచి నాలుగు లేదా ఐదుకు తగ్గించాలని కూడా బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. 2016 టి20 ప్రపంచకప్ భారత్‌లో జరిగినప్పుడు 7 వేదికలను ఉపయోగించారు.
Comments
Please login to add a commentAdd a comment