
న్యూఢిల్లీ: మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీ యూఏఈ వేదికపై జరగనుండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. మిగతా జట్లకంటే షార్జా, దుబాయ్ వేదికలు భారత్‌కు సానుకూలమని ఆమె విశ్లేషించింది. అక్కడి స్థానిక వాతావరణ, పిచ్ పరిస్థితులు అందరికంటే భారత్‌కే ఎక్కువగా లాభిస్తాయని ఆమె చెప్పింది. ‘యూఏఈలోని పరిస్థితులు కాస్తా భిన్నంగా ఉండొచ్చేమో కానీ భారత్‌కు దగ్గరగానే ఉంటాయి.
ఇది మెగా ఈవెంట్‌లో మన జట్టుకు బాగా ఉపకరించే అంశం. ఈ సానుకూలతతో జట్టు అక్కడి వాతావరణానికి ఇట్టే అలవాటు పడుతుంది’ అని మిథాలీ వివరించింది. అయితే జరగబోయేది మెగా ఈవెంట్ అన్న సంగతి మరవొద్దని ప్రతీ జట్టు ప్రపంచకప్ కోసం సన్నద్ధమయ్యే వస్తుందని తమ జట్టు వర్గాలను అప్రమత్తం చేసింది. ‘మెగా ఈవెంట్‌లో పాల్గొనే ప్రతి జట్టు అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని తెలిపింది.
ఐసీసీ ప్రపంచకప్ టోరీ్నలో ఫైనల్ చేరిన సీనియర్ మహిళల జట్టు ఇంత వరకు టైటిల్‌ను మాత్రం గెలవలేకపోయింది. అండర్–19 ప్రపంచకప్‌లో మాత్రం యువ మహిళల జట్టు గతేడాది ఆరంభమైన తొలి మెగా ఈవెంట్‌ను గెలిచింది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు రాణించాలని, కప్‌తో తిరిగి రావాలని బలంగా కోరుకుంటున్నట్లు మాజీ కెపె్టన్ చెప్పింది. వచ్చే నెల 3 నుంచి యూఏఈలో అమ్మాయిల టి20 ప్రపంచకప్ మొదలవుతుంది. దుబాయ్ వేదికగా 4వ తేదీన భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది.