టి20 ప్రపంచకప్ ట్రోఫీతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా (ఫైల్)
ఐపీఎల్ వాయిదా ప్రభావం కచ్చితంగా టి20 ప్రపంచకప్ నిర్వహణపై కూడా ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్‌లలో భారత్‌లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో విదేశీ క్రికెటర్లు ఇక్కడికి రావడానికి వెనుకాడవచ్చు. 16 జట్లు టి20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నాయి. ప్రతీ దేశం భారత్‌కు వెళ్లే విషయంలో తమవారికి ఆంక్షలు పెడుతోంది. ఇప్పటికే పలు దేశాలు భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. టోర్నీకి మరో ఆరు నెలలు ఉంది కాబట్టి పరిస్థితి మెరుగుపడవచ్చని ఆశిస్తున్నా... క్రికెటర్లలో ఆందోళన పూర్తిగా తొలగిపోదు. నిజానికి బయటి పరిస్థితుల కారణంగానే ఐపీఎల్ ఆడుతున్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. తమవారి క్షేమం గురించి ఆలోచించాల్సి రావడం వారిలో మరింత ఆందోళనను పెంచింది. చివరకు అదే ఐపీఎల్ వాయిదాకు కారణమైంది.
వేళ్ల మీద లెక్కించదగ్గ కేసులు ఉన్నా కూడా 2020లో ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదా పడిన నేపథ్యంలో రోజుకు దాదాపు 3 లక్షల కేసులు నమోదవుతున్న భారత్‌లో వరల్డ్‌కప్ అంటే సహజంగానే జట్లు వెనకడుగు వేయవచ్చు. భారత్‌లోనే సాధ్యం కాకపోతే యూఏఈని ప్రత్యామ్నాయ వేదికగా ఐసీసీ చూస్తోంది. అయితే మన దేశంలో పరిస్థితులు ఇంత వేగంగా దిగజారతాయని ఐసీసీ కూడా ఊహించలేదు. యూఏఈలో జరిగినా నిర్వహణ బాధ్యతలు బీసీసీఐనే చూస్తుంది. అంటే ఒకవేళ అభిమానులను మైదానంలోకి అనుమతిస్తే టికెట్ ఆదాయం మన బోర్డుకే చెందుతుంది. త్వరలో జరిగే ఐసీసీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment