వచ్చే నెలలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్-2022లో పాల్గొనడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును నెలకొల్పనున్నాడు. 2007 నుంచి 2022 వరకు అన్ని పొట్టి ప్రపంచ కప్‌లలో ఆడిన/ఆడనున్న ఆటగాడిగా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించనున్నాడు. రోహిత్‌తో పాటు ఈ రికార్డును బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా షేర్ చేసుకోనున్నాడు. షకీబ్ కూడా రోహిత్ లాగే అన్ని టీ20 ప్రపంచ కప్‌లలో ఆడాడు/ఆడనున్నాడు.
Rohit Sharma and Shakib Al Hasan are the only two players to participate in each and every T20 World Cup from 2007 to 2022.
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 16, 2022
ఈ ఇద్దరే కాకుండా మరో ఆరుగురు 2007 నుంచి 2021 వరకు వరుసగా ఏడు ఎడిషన్లలో ఆడారు. విండీస్ ఆటగాళ్లు క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, పాకిస్తాన్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌లు 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021 టీ20 ప్రపంచ కప్‌లలో పాల్గొన్నారు. అయితే వీరంతా రిటైర్మెంట్ లేదా వయసు పైబడిన కారణం చేత 2022 వరల్డ్ కప్‌లో ఆడటం లేదు. రోహిత్, షకీబ్‌లు ఇద్దరు ఆక్టోబర్ 16 నుంచి ప్రారంభంకానున్న 8వ ఎడిషన్ ప్రపంచ కప్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లకు నాయకత్వం వహించనున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఇప్పటివరకు జరిగిన ఏడు పొట్టి ప్రపంచకప్‌లలో వెస్టిండీస్ జట్టు అత్యధికంగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. విండీస్ టీమ్ శ్రీలంకలో జరిగిన 2012 వరల్డ్ కప్, భారత్‌లో జరిగిన 2016 ప్రపంచ కప్‌లలో జగజ్జేతగా నిలిచింది. మిగిలిన ఐదు సందర్భాల్లో వివిధ జట్లు విజేతలుగా నిలిచాయి. సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొట్టతొలి పొట్టి ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్‌లో జరిగిన 2009 ఎడిషన్‌లో పాకిస్తాన్, విండీస్ వేదికగా జరిగిన 2010 ఎడిషన్‌లో ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లో జరిగిన 2014 ఎడిషన్‌లో శ్రీలంక, యూఏఈ వేదికగా జరిగిన 2021 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌లుగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment