
బాపట్ల: పరీక్షలు సరిగ్గా రాయలేనేమోననే బెంగతో మానసిక ఒత్తిడికి గురైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బుధవారం సాయంత్రం మార్టూరులో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బలరాం కాలనీకి చెందిన తిరుమలశెట్టి నాగేశ్వరరావు కుమార్తె ప్రవల్లిక (16) చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది.
త్వరలో జరగబోతున్న పరీక్షలు సరిగా రాయలేనేమోనని తరచూ స్నేహితులతో చెప్పే ప్రవల్లిక మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరెతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బైక్.. క్షణంలో ఇద్దరూ..