మాలతి మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు, తాగిన పురుగుల మందు డబ్బా ఇదే
కళ్లెదుటే కన్నవారు కాట్లాడుకుంటుంటే కలత చెందింది. తరచూ వారించడానికి ప్రయత్నించి విఫలమైంది. పలు మార్లు బెదిరించింది కూడా. అయినా వారిలో మార్పు రాలేదు. వారిని మందలించేందుకు వయసు సరిపోలేదు. వారితో వేగలేక ఇక వారికి దూరం కావాలనుకుంది. ఇక చావే శరణ్యమనుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదీ జియ్యమ్మవలస మండలం శిఖబడికి చెందిన చీపురుపల్లి మాలతి విషాదాంతం.
విజయనగరం, జియ్యమ్మవలస(కురుపాం): ఇంట్లో నిత్యం కలహాలు... ఎంతగా చెప్పినా వారు సర్దుకు పోకపోవడం ఓ విద్యార్థిని ప్రాణాలు బలిగొనేలా చేశాయి. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం శిఖబడిలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన వివరాలివి. గ్రామానికి చెందిన చీపురుపల్లి దుర్గారావు, గంగమ్మ దంపతులకు మాలతి(15), అనే కుమార్తె, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. ఆమె బొమ్మిక జగన్నాథపురం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు నిత్యం గొడవలు పడుతుండడంతో ఎన్నో మార్లు వారిని వారించడానికి యత్నించింది. కానీ వారు వినకపోవడంతో మాలతి గురువారం పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇది నాలుగోసారి...
ఆమె ఆత్మహత్యకు గతంలోనూ మూడుసార్లు యత్నించింది. ఇది నాలుగోసారని గ్రామస్తులు చెబుతున్నారు. రోజూ ఇంట్లో కలహాలు ఆమెలో కలతను రేపాయి. గురువారం ఉదయం కూడా గొడవ జరగ్గా తల్లి గంగమ్మను తండ్రి దుర్గారావు తీవ్రంగా కొట్టి బయటకు వెళ్లిపోయాడు. అది కళ్లారా చూసిన మాలతి మనస్తాపంతో దగ్గరలో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను చూసిన తల్లి ఇరుగుపొరుగువారికి చెప్పగా వారు వచ్చి 108కు సమాచారం అందించారు. ఆ సిబ్బంది వచ్చి పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్థారించారు.
చదువులో వెనుకబడినట్టు కేసు...
కాగా తల్లిదండ్రులు మాత్రం పోలీసులకు మాలతి చదువులో బాగా వెనుకబడిందనీ... అందుకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. గ్రామస్తులు కూడా ఆ విషయాన్ని బలపర్చడంతో వారు తెలిపిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ చిరంజీవులు తెలిపారు. ఎల్విన్‌పేట సీఐ ఎస్.రాము కూడా సంఘటనా స్థలానికి వచ్చి సమీక్షించారు.
చదువులో తెలివైనదే: ఉపాధ్యాయులు
బీజేపురం పాఠశాలను గురువారం తనిఖీ చేసిన డీఈవో అరుణకుమారి విద్యార్థి మృతిపై తరగతిలో వివరాలు సేకరించారు. అయితే ఆమె బాగా చదువుతుందని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా తెలిపారు. గత సంవత్సరం ప్రోగ్రెస్ రికార్డులు పరిశీలించగా మంచి మార్కులు వచ్చినట్లు ఉందని డీఈవో తెలిపారు. కాగా పరీక్షలకు ఇంకా చాలా సమయం ఉందనీ, బాగా చదువుతుందనీ, పరీక్షలకు భయపడేది కాదనీ ఉపాధ్యాయులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment