టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
మెడపై మార్కుల ‘ఖడ్గం’
♦ సరిగ్గా స్కోర్ చేయడం లేదని విద్యార్థిని ఇంటికి పంపిన స్కూల్ యాజమాన్యం
♦ తానింతే.. చదవలేనని చెప్పినా
♦ వినని టీచర్లు, తల్లిదండ్రులు
♦ వారంపాటు పాఠశాలకు రావొద్దని హుకుం..
♦ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి
హైదరాబాద్: బట్టీ చదువులు.. మార్కుల ఒత్తిడి మరో విద్యార్థి ప్రాణం తీశాయి. ‘నేనింతే.. ఇంతకంటే చదవడం నా వల్ల కాదు’అని చెప్పినా అటు టీచర్లు.. ఇటు కన్న తల్లిదండ్రులు వినిపించుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదివి తీరాల్సిందేనని తల్లిదండ్రులు.. వారం పాటు స్కూల్‌కు రావొద్దని పాఠశాల యాజమాన్యం హుకుం జారీ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ టెన్త్ విద్యార్థి చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని గోల్నాక దుర్గానగర్‌కు చెందిన రతన్‌కుమార్, సబ్రీనా దంపతుల కుమారుడు నితిన్ జాన్సన్(15) నల్లకుంట సెయింట్ ఆన్స్ స్కూల్‌లో టెన్త్ చదువుతున్నాడు. ఇటీవల స్కూల్ టీచర్లు.. నితిన్ తండ్రి రతన్‌కుమార్‌ను పాఠశాలకు పిలిపించారు. తోటి విద్యార్థులతో పోలిస్తే.. నితిన్ చదువులో వెనుకబడ్డాడని చెప్పారు. ఇకపై పిల్లాడి చదువుపై శ్రద్ధ తీసుకుంటానని ఆయన చెప్పారు. అయినా నితిన్ చదువు మెరుగుపడలేదు. దీంతో పాఠశాల యాజమాన్యం బుధవారం మరోసారి తల్లిదండ్రులను స్కూల్‌కు పిలిపించింది.
విద్యార్థులంతా చదువులో ముందుకెళ్తుంటే నితిన్ వెనుకబడిపోతున్నాడని, ఓ వారం పాటు ఇంటి వద్దే ఉంచుకుని ట్యూషన్ చెప్పించి, సబ్జెక్టుల్లో మెరుగుపడిన తర్వాత పాఠశాలకు పంపించాలని చెప్పి నితిన్‌ను వారితో పాటే ఇంటికి పంపించారు. దీంతో బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు నితిన్‌ను మందలించి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు బస్తీలోనే స్నేహితులతో గడిపిన నితిన్ రాత్రి 8 గంటలకు తన గదిలోకి వెళ్లి తల్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన తండ్రి రతన్‌కుమార్ నితిన్ గది వద్దకు వెళ్లి చూడగా ప్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కిందికి దించేలోపే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నితిన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇంత పని చేస్తాడనుకోలేదు
నితిన్ చాలా చురుకైనవాడని, పదో తరగతి కాబట్టీ చదువుపై దృష్టి పెట్టాలని తాపత్రయపడ్డామే తప్ప ఇలా చేస్తాడనుకోలేదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. కొద్దిరోజుల క్రితం చదువుకోమంటే చస్తానని బెదిరించాడని, ఇంత చలాకీగా ఉండేవాడు చనిపోయేంత ధైర్యం ఎలా చేస్తాడని అనుకున్నామని బోరుమన్నారు. ఎదిగిన కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు తనతోనే ఉన్నాడని, స్కూల్‌లో జరిగిన విషయాన్ని తనతో చెప్పలేదని, సరదాగా ఉండేవాడని, ఇలా చనిపోతాడని మాత్రం అనుకోలేదని నితిన్ స్నేహితుడు శ్యామ్‌సన్ చెప్పాడు.
వేధింపులకు పాల్పడలేదు
నితిన్‌పై ఎలాంటి ఒత్తిడి, వేధింపులకు తాము పాల్పడలేదని పాఠశాల యాజమాన్యం తెలిపింది. టీసీ ఇచ్చామని, ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేశామని వస్తున్న వార్తల్లో నిజం లేదని సెయింట్ ఆన్స్ పాఠశాల డైరెక్టర్ సాల్మన్‌రాజు చెప్పారు. విద్యార్థి చదువుపై మాత్రమే తాము తల్లిదండ్రులకు చెప్పామన్నారు. అతను ఆత్మహత్య చేసుకోవడం తమను కూడా కలచివేసిందని చెప్పారు. కాగా, విద్యార్థుల మానసిక పరిస్థితులను తెలుసుకోకుండా చదువు చదువూ అంటూ ఒత్తిడి తెచ్చి ఆత్మహత్య చేసుకునేలా పాఠశాల యాజమాన్యం ప్రేరేపించిందంటూ తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవోఎఫ్‌ఐ నాయకులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు.