సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న వి.సరస్వతి
విజయనగరం, బొబ్బిలి రూరల్: తనకు పదోన్నతి వచ్చినా రిలీవింగ్ ఇవ్వకపోవడం, తనకు పోస్టింగ్ ఇస్తానన్న ప్రదేశానికి ఇవ్వకపోగా, తనకు ఇస్తామన్న ప్రదేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు వేరేవారిని సిఫార్సు చేస్తుండడంతో మనస్థాపం చెంది బొబ్బిలి ట్రజరీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వి.సరస్వతి సోమవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. గతంలో ‘బొబ్బిలికోటలో బేబీపంచాయతీ’ పేరిట సాక్షి కథనం ప్రచురించింది. స్థానిక ప్రజాప్రతినిధులు ఒకే పోస్టుకు అనేకమందికి సిఫార్సులు ఇవ్వడం, ప్రశ్నించిన వ్యక్తిపై దాడికిపాల్పడడం పాఠకులకు విధితమే. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేకెత్తింది. కాగా తాజాగా అదే సంఘటనలో బాధితురాలు మనస్థాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది.
బాధితురాలు సరస్వతి తెలిపిన వివరాల ప్రకారం తనకు ఎస్టీఓగా పదోన్నతి వచ్చిందని, సాలూరులో పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా స్థానిక మంత్రి, ఆయన సోదరులను కలిశామని, వారూ మాట ఇచ్చారని, అయితే గతంలో తనసోదరుడిపై కోటలో దాడిజరగడం, దానిపై సాక్షి దినపత్రికలో కథనం రావడంతో తమపై కక్షకట్టిన స్థానిక ప్రజాప్రతినిధులు వేరే వ్యక్తికి సాలూరులో పోస్టింగ్ ఇప్పించి, తనకు శ్రీకాకుళంలో పోస్టింగ్ ఇస్తామని ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సరస్వతి ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఆమె ప్రస్తుతం బొబ్బిలి సీహెచ్‌సీలో చికిత్స పొందుతోంది.