ఆత్మహత్య చేసుకున్న శాంతి
శృంగవరపుకోట: కడుపునొప్పి తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్.కోట ఎస్సై అబ్దుల్ మారూఫ్ అందించిన వివరాలిలా ఉన్నాయి. వేపాడ మండల కేంద్రానికి చెందిన ఏడువాక శాంతి (21) డిగ్రీ పూర్తి చేసి విశాఖలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. రెండు నెలల కిందట వేపాడ వచ్చి అప్పటి నుంచి తల్లిదండ్రుల వేద్ద ఉంటోంది. గతంలో ఎస్.కోటలో ఓ జ్యుయలరీ దుకాణంలో తీసుకున్న బంగారానికి సంబంధించి వాయిదా సొమ్మును ఎస్.కోటలోని బాలాజీ సెల్‌షాప్‌లో పనిచేస్తున్న లక్కవరపుకోట మండలం చందులూరుకు చెందిన రామకృష్ణ ద్వారా చెల్లిస్తోంది.
ఈక్రమంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో శాంతి బాలాజీ సెల్‌షాప్‌లో ఉన్న రామకృష్ణకి ఫోన్ చేసి డబ్బులు తెచ్చాను.. తీసుకెళ్లమని ఫోన్‌లో చెప్పి ఏడ్చింది. దీంతో రామకృష్ణ ఆందోళన చెందిన ఎక్కడ ఉన్నావని అడిగితే దార గంగమ్మ ఆలయం దగ్గర ఉన్నానని బదులిచ్చింది. వెంటనే రామకృష్ణ ఆలయం వద్దకు వెళ్లేసరికి శాంతి అపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో రామకృష్ణ 108కు ఫోన్ చేయగా, సిబ్బంది వచ్చి విజయనగరం కేంద్రాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఇదిలా ఉంటే శాంతి కొన్నాళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోందని.. నొప్పి తాళలేకే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. క్రిమిసంహారక మందు తాగడం వల్లే శాంతి చనిపోయిందని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టరుల తెలిపారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment