welspun corp
-
రాష్ట్రంలో ‘సింటెక్స్’ పెట్టుబడి రూ.350 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వెల్స్పన్ గ్రూపు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్న ‘సింటెక్స్’ హైదరాబాద్‌లో రూ.350 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటో కాంపొనెంట్స్, ఇతర పరికరాలను తయారుచేసే ఈ యూనిట్ ద్వారా వేయి మందికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వెల్స్పన్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న చందన్వెల్లిలోనే సింటెక్స్ తయారీ యూనిట్ ఏర్పాటవుతుంది. ఈ నెల 28న జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావుతో పాటు వెల్స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకా హాజరవుతారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో భారీగా పెట్టుబడులతో కార్యకలాపాలు నిర్వహిసున్న వెల్స్పన్ గ్రూప్ రాష్ట్రంలో మరింత విస్తరించనుండటం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో అందుబాటులోని మౌలిక వసతుల వలన అనేక నూతన పెట్టుబడులు రాష్ట్రానికి తరలివస్తున్నాయని కేటీఆర్ అన్నారు. -
జీరో నుంచి మొదలుపెట్టి.. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా దీపాలీ..
‘జీరో’ నుంచి ప్రయాణం ప్రారంభించి ఒక్కో పాఠం నేర్చుకుంటూ తమ కంపెనీ ‘వెల్స్పన్’ను ప్రపంచంలోని అతి పెద్ద టెక్ట్స్‌టెల్ కంపెనీల పక్కన నిలబెట్టింది దీపాలీ గోయెంకా... రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన దీపాలీకి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. ఇంటికే పరిమితం కాకుండా, ఏదైనా చేయాలనిపించేది. ముప్ఫైసంవత్సరాల వయసులో భర్త చేసే టెక్ట్స్‌టైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.‘నా భార్యగా ఇక్కడ నీకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం అంటూ ఏవీ ఉండవు’ అని చెప్పాడు ఆమె భర్త ‘వెల్స్పన్’ చైర్మన్ బీకే గోయెంకా. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) తొలిరోజుల్లో ‘బాస్ భార్య’గానే గుర్తింపు పొందిన దీపాలీ ఆ తరువాత కాలంలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. నిరుపమానమైన నాయకత్వానికి ప్రతీకగా ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. సైకాలజీ చదువుకున్న దీపాలీకి వ్యాపార వ్యవహారాలలో ఎలాంటి అనుభవం లేదు. ఏమీ తెలియని శూన్యం నుంచి అన్ని తెలుసుకోవాలనే తపన వరకు ఆమె ప్రయాణం కొనసాగింది. నష్టాలు ఎక్కడా జరుగుతున్నాయి? వాటిని నివారించడం ఎలా? ఇలా ఎన్నో విషయాలను త్వరగా తెలుసుకుంది. ఆఫీసుకు వెళ్లామా, వచ్చామా...అనే తీరులో కాకుండా ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన పెంచుకుంది. ఒకానొక కాలంలో విదేశీ ఒప్పందాలు రద్దు అయిపోయి కంపెనీ సంక్షోభపుటంచుల్లోకి వెళ్లింది. ఇలాంటి పరిస్థితులలో దీపాలీ ట్రబుల్ షూటర్‌గా మారి కంపెనీని మళ్లీ విజయపథంలోకి తీసుకువచ్చింది. (వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్థి తెలిస్తే..?) ఇంతలోనే కోవిడ్ రూపంలో మరో సంక్షోభం ఎదురైంది. దాన్ని కూడా తన నాయకత్వ లక్షణాలతో విజయవంతంగా అధిగమించింది.‘ఏ సంక్షోభాన్నీ వృథాగా పోనివ్వకూడదు. దానినుంచి నేర్చుకునే విలువైన పాఠాలు ఎన్నో ఉంటాయి. మనల్ని మనం పునఃపరిశీలన చేసుకోవడానికి, మెరుగు పెట్టుకోవడానికి సంక్షోభాలు ఉపయోగపడతాయి’ అంటుంది దీపాలీ. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన ఉత్పత్తుల్లో 94 శాతం బయటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్‌తో పాటు ఇండియన్ మార్కెట్‌పై కూడా దీపాలీ దృష్టి సారించింది. ‘వ్యాపారవేత్త నిలువ నీరులా ఒకచోట ఉండిపోకూడదు. ప్రవాహమైపోవాలి. ప్రతి అడుగులో కొత్త విషయాలు తెలుసుకోవాలి. కొత్తగా ఆలోచించడం అనేది వ్యాపారానికి ప్రాణవాయువులాంటిది’ అనేది తాను నమ్మిన సిద్ధాంతం. ఇప్పుడు కంపెనీ చేతిలో సరికొత్త ఆవిష్కరణలకు సంబంధించి 35 పేటెంట్స్ ఉన్నాయి.‘అందరికీ అన్నీ తెలియాలి అని ఏమీ లేదు. తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న శక్తి... ప్రశ్న. ఒక్క ప్రశ్నతో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మన అజ్ఞానం బయటపడుతుందేమో అని సంశయిస్తే అక్కడే ఉండిపోతాం. నాకు ఈ విషయం గురించి పెద్దగా తెలియదు. దయచేసి చెబుతారా? అని అడిగేదాన్ని. మనం తెలివి ఉన్న వ్యక్తి అయినంత మాత్రాన సరిపోదు. ఆ తెలివితో కంపెనీ ఎంత ముందుకు వెళ్లిందనేది ముఖ్యం. నేర్చుకోవడం అనే ప్రక్రియకు కాలపరిధి లేదు. అది నిత్యం జరుగుతూనే ఉండాలి’ అంటుంది దీపాలీ. ఈఎస్జీ–ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ తమ వ్యాపారానికి కీలకం అనేది దీపాలీ చెప్పేమాట. కంపెనీ ప్రాడక్ట్స్‌కు సంబంధించి తయారీ ప్రక్రియలో రీసైకిల్ వాటర్‌ను ఉపయోగించడం కూడా ఇందులో భాగమే. మరోవైపు రైతులతో కలిసి పర్యావరణానికి సంబంధించిన విషయాలపై పనిచేస్తోంది.దీపాలీ ‘వెల్స్పన్’లోకి అడుగు పెట్టినప్పుడు కేవలం ఏడు శాతం మంది మహిళలే ఉండేవారు. ఇప్పుడు వారి ప్రాతినిధ్యం ముప్ఫై శాతానికి పెరిగింది.ఈతరం వ్యాపారవేత్తలకు దీపాలీ ఇచ్చే సలహా ఇది...‘వ్యాపారికి తన వ్యాపారం మాత్రమే ప్రపంచం కాకూడదు. తన మానసిక ఆరోగ్యం, తినే తిండి, వ్యాయామాలపై కూడా దృష్టి పెట్టాలి. మనం మానసికంగా చురుగ్గా ఉంటేనే ఉత్తమమైన ఆలోచనలు వస్తాయి’సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకున్న దీపాలీ గోయెంకాలో మరో కోణం దాతృత్వం. -
సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు
వెల్స్పన్ ఇండియా సీఈవో సోషల్ మీడియా స్టార్ దిపాలి గోయెంకా ఎన్డీటీవీ స్వత్రంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సెబీ మాజీ ఛైర్మన్ యూకే సిన్హాతో పాటు మార్చి 27, 2023 నుండి రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. నాన్-ఎగ్జిక్యూటివ్, స్వతంత్ర మహిళా డైరెక్టర్‌గా దిపాలి ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. దీంతో ఫోర్బ్స్ ఆసియా అండ్ ఇండియాలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందిన దిపాలి గోయెంకా ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఎవరీ దిపాలి గోయెంకా ? ప్రపంచంలోని అతిపెద్ద గృహ వస్త్ర కంపెనీలలో ఒకటైన వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ సీఎండీ టెక్స్టైల్ మాగ్నెట్ దిపాలి గోయెంకా సైకాలజీలో గ్రాడ్యుయేట్, హార్వర్డ్ పూర్వ విద్యార్థి. దిపాలి గోయెంకా భర్త బీకే గోయెంకా వెల్స్పన్ గ్రూప్ చైర్మన్. 18 సంవత్సరాల వయస్సులో బీకే గోయెంకాను వివాహం చేసుకున్నారు దిపాలి. బీకే గోయెంకా ఇటీవల ముంబైలో రూ.240 కోట్లతో ఒక లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. రతన్ టాటా ఇంటి విలువ రూ.150 కోట్లు కావడంతో ఆ ఇంటి విలువ రతన్ టాటా ఇంటి కంటే ఖరీదైన ఇల్లుగా నిలిచింది. రూ.19 వేల కోట్ల కంపెనీకి సీఎండీగా రూ. 19000 కోట్ల కంపెనీకి సారధి, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలి గోయెంకా సోషల్ మీడియా స్టార్ కూడా. ఆమె ట్విటర్, ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 191కే ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె స్టార్ రేంజ్‌ను అర్థం చేసుకోవచ్చు. వెల్స్పన్ గ్రూప్‌లో 25వేల ఉద్యోగులతో 2.3 బిలియన్ల డాలర్ల ఆదాయంతో టాప్ టెక్స్టైల్ కంపెనీగా దూసుకుపోతోంది. ఇన్నోవేషన్, బ్రాండ్స్ అండ్ సస్టైనబిలిటీపై దృష్టి సారించి వెల్స్పన్ హోమ్ టెక్స్టైల్ వ్యాపారాన్ని బిలియన్ డాలర్లతో ప్రపంచస్థాయికి చేర్చడంలో ఆమెది కీలక పాత్ర. అసోచామ్ ఉమెన్స్ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన దిపాలీ ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఉన్నారు. చిన్నతనంలోనే పెళ్లి సాంప్రదాయ మార్వాడీ నేపథ్యం నుండి వచ్చిన తనకు సాధారణంగానే చిన్న వయస్సులో పెళ్లి అయిందని, అయినా మరింత నేర్చుకోవాలనే పట్టుదలతో దేన్నీ ఆపలేదని చెప్పారు. తన కుమార్తెలకు 10, 7 ఏళ్లు నిండిన తర్వాత తిరిగి కరియర్ మీద దృష్టిపెట్టినట్టు స్వయంగా దిపాలి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. డిజైన్ స్టూడియోతో ప్రారంభించి, 2003లో, దిపాలి గోయెంకా స్పేసెస్, ప్రీమియం బెడ్ అండ్ బాత్ బ్రాండ్‌ను ప్రారంభించారు. తనకెదురైన ప్రతీ చాలెంజ్‌ను ఒక అవకాశంగా తీసుకొని ఎదిగారు. సీఈవో విత్ సోల్ 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ఆమె వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 2016, ఆగస్టు ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. కంపెనీ సరఫరా చేసిన ప్రీమియం ఈజిప్షియన్ కాటన్ షీట్లు చౌకగా ఉన్నాయనే ఆరోపణలతో అమెరికన్ రిటైలర్ టార్గెట్ వెల్స్పన్ ఇండియాతో అన్ని డీల్స్‌ను ముగించింది. అపుడు వ్యాపారాన్ని తిరిగి గాడిలో పెట్టేలా సాహసంగా ముందుకు సాగారు. ప్రస్తుతం వెల్స్పన్ ఇండియా అమెరికాకు బెడ్ అండ్ బాత్, రగ్గు ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారు. కస్టమర్-ఫస్ట్ అప్రోచ్ సూత్రాన్ని ఫాలో అయ్యే దిపాలి కూడా దాతృత్వంలో కూడా ముందే ఉన్నారు. అందుకే తన ప్రొఫైల్ బయోలో సీఈవో విత్ సోల్ రాసుకున్నారామె. -
దేశంలోనే ఖరీదైన పెంట్ హౌస్
ముంబై: దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్‌ను వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా ఇటీవలే కొనుగోలు చేశారు. ముంబైలోని వర్లీ ప్రాంతం అన్నీబీసెంట్ రోడ్డులో ఉన్న లగ్జరీ టవర్లలో త్రీసిక్స్టీ వెస్ట్ ఒకటి. ఇందులోని పెంట్‌హౌస్ ఖరీదు రూ.240 కోట్లు. టవర్ 63, 64, 65 ఫోర్లలోని 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పెంట్ హౌస్ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలను గత బుధవారం బీకే గోయెంకా పూర్తి చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంటని పేర్కొంది. దీనిని ఆనుకునే ఉన్న మరో పెంట్‌హౌస్‌ను కూడా నిర్మాణ సంస్థ యజమాని వికాస్ ఒబెరాయ్ రూ.240 కోట్లు పెట్టి కొన్నట్లు ఆ కథనంలో వివరించింది. -
విస్తరణ బాటలో టెక్స్టైల్స్ దిగ్గజం వెల్స్పన్ ఇండియా
న్యూఢిల్లీ: హోమ్ టెక్స్టైల్స్ దిగ్గజం వెల్స్పన్ ఇండియా విస్తరణ బాట పట్టింది. రానున్న రెండేళ్లలో హోమ్ టెక్స్టైల్స్, ఫ్లోరింగ్ బిజినెస్‌ల విస్తరణకు రూ. 800 కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు కంపెనీ తాజాగా తెలియజేసింది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల(2022–23)లో హోమ్ టెక్స్టైల్స్ విభాగంపై రూ. 656 కోట్లకుపైగా పెట్టుబడులు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. వీటిలో భాగంగా రుమాళ్ల(టవల్స్) తయారీ సామర్థ్యాన్ని 20 శాతంమేర పెంచాలని చూస్తున్నట్లు తెలియజేసింది. విదేశీ కస్టమర్ల నుంచి పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా ఇందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. గుజరాత్, కచ్‌లోని అంజార్‌లోగల తయారీ ప్లాంటు సామర్థ్యాన్ని ప్రస్తుత 85,400 మెట్రిక్ టన్నుల నుంచి వార్షికంగా 1,02,000 ఎంటీకి చేర్చేందుకు వారాంతాన సమావేశమైన బోర్డు అనుమతించినట్లు వెల్స్పన్ ఇండియా వివరించింది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా టవల్ వస్త్రాలలో 40 మగ్గాల(లూమ్స్)కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించింది. వల్సాద్‌పైనా దష్టి గుజరాత్, వపీలోని వల్సాద్ ప్లాంటులో ఆటోమేషన్ ఏర్పాటుకు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్స్పన్ ఇండియా పేర్కొంది. తద్వారా తక్కువ వ్యయాలతో ఉత్పత్తిలో వేగవంత టర్న్‌అరౌండ్‌ను సాధించాలని చూస్తున్నట్లు తెలియజేసింది. వపీలో 80 శాతం రగ్గుల సామర్థ్య పెంపును గత ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించినట్లు తెలియజేసింది. విస్తరణ ఫలితాలు దశలవారీగా వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్) నుంచి కనిపించనున్నట్లు వివరించింది. విస్తరణతో రెండో ఏడాది నుంచీ రూ. 1,207 కోట్ల ఆదాయానికి అవకాశమున్నట్లు అంచనా వేసింది. ఈ బాటలో రెండేళ్లకుగాను సొంత అనుబంధ సంస్థ వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్‌లో దాదాపు రూ. 144 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. -
జోష్‌లో వెల్స్పన్ కార్ప్- జీఎంఎం ఫాడ్లర్
ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం ఆటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. కాగా.. దేశ, విదేశాల నుంచి భారీగా ఆర్డర్లను పొందినట్లు వెల్లడించడంతో సా పైప్స్ తయారీ దిగ్గజం వెల్స్పన్ కార్ప్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క రెండు వారాల పతన బాటనుంచి మంగళవారం బౌన్స్‌బ్యాక్ సాధించిన ఇంజినీరింగ్ కంపెనీ జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. వెల్స్పన్ కార్ప్ దేశ, విదేశాల నుంచి ఆయిల్, గ్యాస్ రంగ దిగ్గజాల నుంచి రూ. 1,400 కోట్ల విలువైన ఆర్డర్లను పొందినట్లు వెల్స్పన్ కార్ప్ తాజాగా వెల్లడించింది. 147 కేఎంటీకి సమానమైన ఈ ఆర్డర్లలో భాగంగా పైపులను దేశీయంగా రూపొందించనున్నట్లు తెలియజేసింది. తాజా ఆర్డర్లతో కలిపి మొత్తం ఆర్డర్‌బుక్ 755 కేంఎటీకి చేరినట్లు పేర్కొంది. వీటి విలువ సుమారు రూ. 6,300 కోట్లుగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో వెల్స్పన్ కార్ప్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో ప్రస్తుతం రూ. 5.40 ఎగసి రూ. 114 సమీపంలో ఫ్రీజయ్యింది. జీఎంఎం ఫాడ్లర్ ముందు రోజు రెండు వారాల పతన బాటను వీడిన జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ నెలకొంది. ప్లూటస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ 1.65 లక్షల షేర్లను తాజాగా కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ డేటా వెల్లడించింది. దీంతో కొనేవాళ్లు అధికంకాగా... అమ్మేవాళ్లు కరువుకావడంతో ఈ షేరు వరుసగా రెండో రోజు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 190 జమ చేసుకుని రూ. 3,984 సమీపంలో ఫ్రీజయ్యింది. ప్రమోటర్లు మార్కెట్ ధరతో పోలిస్తే భారీ డిస్కౌంట్లో 17.6 శాతం వాటాను విక్రయానికి పెట్టిన నేపథ్యంలో ఈ షేరు రెండు వారాలుగా పతన బాటలో సాగుతూ వచ్చింది. ఓఎఫ్ఎస్ ద్వారా షేరుకి రూ. 3,500 ధరలో ప్రమోటర్లు వాటా విక్రయానికి నిర్ణయించిన విషయం విదితమే. -
బాస్ అంటే ఇలా ఉండాలి
-
సీఈవో డ్యాన్స్: ‘బాస్ అంటే ఇలా ఉండాలి’
ఆఫీసులో బాసు వస్తున్నాడంటే చాలు.. గజగజ వణికిపోతుంటారు కొంతమంది. తన వంటి పనిమంతుడు ప్రపంచంలోనే ఎవరూ లేరన్నట్లుగా కంప్యూటర్ ముందు ఫోజులు కొడుతుంటారు మరికొంతమంది. కానీ ఈ లేడీ బాస్ వస్తుందంటే అక్కడ పనిచేసే ఉద్యోగులు సంతోషంగా చిరునవ్వుతో స్వాగతం పలుకుతారు. ఉత్సాహంగా పని చేస్తారు. ఎందుకో మీరే చదివేయండి.. వెల్స్పన్ ఇండియా కంపెనీ సీఈవో దీపాళి గోయెంకా ఆఫీసులోకి రాగానే సరాసరి తన చాంబర్లోకి వెళ్లలేదు. ఉద్యోగుల క్యాబిన్ దగ్గర ఆగిపోయారు. వారిని నవ్వుతూ పలకరించడమే కాదు.. ‘ముక్కాలా.. ముఖాబులా’ అంటూ డ్యాన్స్ చేసి ఉద్యోగుల్లో జోష్ నింపారు. దీంతో మిగతా వారు సైతం ఆనందంతో ఆమెతో కాలు కదుపుతూ రిలీఫ్ అయ్యారు. ఈ వీడియోను ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయంకా మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (లాస్ట్ స్టెప్పు ఉంది చూడు.. అది పీక్స్ అసలు) ‘ఆఫీసులో సీఈవో డ్యాన్స్ చేయడం అనేది చాలా అరుదు’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు సీఈవో గోయెంకా కృతజ్ఞతలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు. ‘మీ ఆఫీసు కూడా ఇలా సంతోషంగా ఉంటే చూడాలనుంద’ని పేర్కొన్నారు. ఇక ఈ లేడీ బాస్‌ను కొందరు మెచ్చుకుంటుంటే మరికొందరు మాత్రం మాకు ఇలాంటి బాస్ ఉంటే బాగుండునని ఈర్ష్య పడుతున్నారు. ఇక ఈ వీడియోను గోయెంకా తిరిగి షేర్ చేస్తూ పారిశ్రామిక దిగ్గజాలైన ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీ, కిరణ్ మజుందార్ షాలను ట్యాగ్ చేశారు. ‘నా ఆఫీసులో ఇంత స్వేచ్ఛ ఉంటుంది. మరి మీ ఆఫీసులో?’ అంటూ సరదాగా ప్రశ్నించారు. మరి ఈ బిజినెస్ బాస్‌లు ఏమని స్పందిస్తారో చూడాలి! -
సెన్సెక్స్ 115 పాయింట్లు ప్లస్
ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు నేపథ్యంలో మార్కెట్లు యథాప్రకారం ఒడిదొడుకులకు లోనయ్యాయి. అయితే రోజులో అత్యధిక సమయం సానుకూలంగానే కదిలాయి. ఇందుకు ఆసియా, యూరప్ మార్కెట్ల లాభాలు ప్రభావం చూపాయి. వెరసి సెన్సెక్స్ 115 పాయింట్లు లాభపడి 20,535 వద్ద నిలవగా, 35 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 6,092 వద్ద స్థిరపడింది. అమెరికాలో ఉద్యోగ గణాంకాలు, వినియోగదారుల విశ్వాస సూచీ బలపడటంతో సెంటిమెంట్ మెరుగుపడిందని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం(29న) దేశీయ జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. మరోవైపు జర్మనీకి సంబంధించిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత వంటి గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలోనూ యూరప్ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతుండటం గమనార్హం! లాభాల్లో క్యాపిటల్ గూడ్స్ ఇటీవల వెలుగులోకి వచ్చిన క్యాపిటల్ గూడ్స్ రంగం మరోసారి 2% ఎగసింది. అమెరికా తదితర దేశాలతో ఇరాన్ అణుఒప్పందం కుదుర్చుకున్నాక ఈ షేర్లు జోరు చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సుజ్లాన్, వెల్స్పన్ కార్ప్, కార్బొరాండమ్, సద్భావ్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్పోర్ట్, క్రాంప్టన్ గ్రీవ్స్, సీమెన్స్, ఏబీబీ, భెల్, పుంజ్ లాయిడ్, ఎల్అండ్టీ 9-2% మధ్య దూసుకెళ్లాయి. ఇక సెన్సెక్స్‌లో హిందాల్కో, ఎంఅండ్ఎం, కోల్ ఇండియా, జిందాల్, టాటా స్టీల్, ఆర్ఐఎల్, హెచ్‌యూఎల్ 2.4-1% మధ్య లాభపడ్డాయి. ఎఫ్ఐఐలు రూ. 103 కోట్లు, దేశీయ ఫండ్స్ రూ. 331 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. చిన్న షేర్లు ఓకే మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు 1% స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,442 లాభపడగా, 1,032 నష్టపోయాయి. మిడ్ క్యాప్స్‌లో వోల్టాస్ 12% జంప్‌చేయగా, పెనిన్సులార్, కోరమాండల్ ఇంటర్నేషనల్, అదానీ ఎంటర్ప్రైజెస్, డిష్ టీవీ, టాటా ఎలక్సీ, జేపీ అసోసియేట్స్, బాంబే డయింగ్, బ్లూస్టార్ 10-6% మధ్య పురోగమించాయి.