న్యూఢిల్లీ: హోమ్ టెక్స్‌టైల్స్ దిగ్గజం వెల్‌స్పన్ ఇండియా విస్తరణ బాట పట్టింది. రానున్న రెండేళ్లలో హోమ్ టెక్స్‌టైల్స్, ఫ్లోరింగ్ బిజినెస్‌ల విస్తరణకు రూ. 800 కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు కంపెనీ తాజాగా తెలియజేసింది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల(2022–23)లో హోమ్ టెక్స్‌టైల్స్ విభాగంపై రూ. 656 కోట్లకుపైగా పెట్టుబడులు వెచ్చించనున్నట్లు వెల్లడించింది.
వీటిలో భాగంగా రుమాళ్ల(టవల్స్) తయారీ సామర్థ్యాన్ని 20 శాతంమేర పెంచాలని చూస్తున్నట్లు తెలియజేసింది. విదేశీ కస్టమర్ల నుంచి పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా ఇందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. గుజరాత్, కచ్‌లోని అంజార్‌లోగల తయారీ ప్లాంటు సామర్థ్యాన్ని ప్రస్తుత 85,400 మెట్రిక్ టన్నుల నుంచి వార్షికంగా 1,02,000 ఎంటీకి చేర్చేందుకు వారాంతాన సమావేశమైన బోర్డు అనుమతించినట్లు వెల్‌స్పన్ ఇండియా వివరించింది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా టవల్ వస్త్రాలలో 40 మగ్గాల(లూమ్స్)కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
వల్సాద్‌పైనా దష్టి
గుజరాత్, వపీలోని వల్సాద్ ప్లాంటులో ఆటోమేషన్ ఏర్పాటుకు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్‌స్పన్ ఇండియా పేర్కొంది. తద్వారా తక్కువ వ్యయాలతో ఉత్పత్తిలో వేగవంత టర్న్‌అరౌండ్‌ను సాధించాలని చూస్తున్నట్లు తెలియజేసింది. వపీలో 80 శాతం రగ్గుల సామర్థ్య పెంపును గత ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించినట్లు తెలియజేసింది.
విస్తరణ ఫలితాలు దశలవారీగా వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్) నుంచి కనిపించనున్నట్లు వివరించింది. విస్తరణతో రెండో ఏడాది నుంచీ రూ. 1,207 కోట్ల ఆదాయానికి అవకాశమున్నట్లు అంచనా వేసింది. ఈ బాటలో రెండేళ్లకుగాను సొంత అనుబంధ సంస్థ వెల్‌స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్‌లో దాదాపు రూ. 144 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment