salary package
-
వేతనాల్లో..ఐటీ కన్నా జీసీసీలే మిన్న!
విదేశీ కంపెనీలు భారత్‌లో పొలోమంటూ ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు).. అదిరిపోయే వేతన ప్యాకేజీలతో టెక్ సిబ్బందిని ఆకర్షిస్తున్నాయి. భారీ విస్తరణ బాట నేపథ్యంలో టెక్ నిపుణులకు జీసీసీల నుంచి డిమాండ్ పెరుగుతోంది. మరోపక్క, జీతాల విషయంలో జీసీసీలతో పోలిస్తే సంప్రదాయ ఐటీ సేవల కంపెనీలు వెనుకబడుతుండటం గమనార్హం.దేశంలో ప్రస్తుతం 1,600కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో 16.6 లక్షల మందికి పైగానే నిపుణులు పనిచేస్తున్నారు. ఐటీ కంపెనీల్లోని టెకీలతో పోలిస్తే అవే విధుల్లో పనిచేస్తున్న జీసీసీ ఉద్యోగులకు 12–20 శాతం మేర అధిక వేతనాలు లభిస్తున్నాయి. అంతేకాదు, టెక్నాలజీ యేతర కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణులతో పోల్చినా కూడా జీసీసీల్లోనే భారీ వేతన ప్యాకేజీలు దక్కుతుండం విశేషం. టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్–ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్క్ అడ్మిని్రస్టేషన్, డేటా మేనేజ్మెంట్–ఎనలిటిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ తదితర విభాగాల్లో ఎంట్రీ, మిడ్, సీనియర్ స్థాయిల్లో కూడా జీసీసీలు ప్యాకేజీల్లో ‘టాప్’లేపుతున్నాయి. మెరుగైన జీతాల నేపథ్యంలో జీసీసీల్లోకి వలసలు కూడా భారీగా పెరిగేందుకు దారితీస్తోంది. ఉదాహరణకు సాఫ్ట్వేర్ డెవలపర్, ఏఐ/ఎంఎల్ ఇంజినీర్స్ జాబ్స్నే తీసుకుంటే, జీసీసీల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగి వార్షిక వేతనం రూ.9.7 లక్షలు కాగా, సీనియర్ లెవెల్ సిబ్బంది ప్యాకేజీ రూ.43 లక్షల్లో ఉంది. ఐటీ కంపెనీలను పరిశీలిస్తే, అవే విధులకు గాను ఎంట్రీ లెవెల్ ప్యాకేజీ రూ.5.7 లక్షల నుండి సీనియర్లకు గరిష్టంగా 17.9 లక్షలుగా ఉండడటం గమనార్హం.చిన్న నగరాల్లోనూ నిపుణులకు డిమాండ్ జీసీసీలు టెకీలకు భారీగా వేతన ప్యాకేజీలు ఇస్తున్న నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గురుగ్రా మ్, హైదరాబాద్, చెన్నై వంటివి ఉన్నాయి. అయితే, జైపూర్, ఇండోర్, కోయంబత్తూరు తదితర ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా జీసీసీలు, డేటా సెంటర్లు శరవేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో అక్కడ డే టా సైన్స్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, డే టా ఇంజినీరింగ్ నిపుణులకు డిమాండ్ భారీగా ఉందని పరిశ్రమ చెబుతోంది. ‘జీసీసీలు ప్రధానంగా జెన్ ఏఐ, ఏఐ/ఎంఎల్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాలపై ఫోకస్ చేస్తున్నాయి. దీంతో డిజిటల్ మార్పులకు దన్నుగా నిలవడంతో పాటు నవకల్పనల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి’ అని టీమ్‌లీజ్ డిజిటల్ వైస్–ప్రెసిడెంట్ కృష్ణ విజ్ పేర్కొన్నారు. సాంప్రదాయ ఐటీ కంపెనీలతో పోలిస్తే జీసీసీల్లో 12–20 శాతం అధిక ప్యాకేజీలు, డిజిటల్ స్కిల్స్‌కు ఎంత డిమాండ్ ఉందనేదుకు నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు. విస్తరణ జోరు.. 2025 నాటికి జీసీసీల సంఖ్య 1900కు పెరగనుంది. సిబ్బంది 20 లక్షలను మించుతారని అంచనా. ముఖ్యంగా జెనరేటివ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ), మెషిన్ లెరి్నంగ్/ఏఐ, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాల్లో భారీగా నిపుణుల అవసరం ఉంటుందని టీమ్‌లీజ్ చెబుతోంది. గ్లోబల్ టెక్ హబ్‌గా భారత్ ప్రాధాన్యత అంతకంతకూ పెరుతుండటంతో వచ్చే 5–6 ఏళ్లలో ఏకంగా 800 కొత్త జీసీసీలు భారత్‌లో కొలువుదీరే అవకాశం ఉంది. ఇవి కేవలం మెట్రోలు, బడా నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరించే సన్నాహల్లో ఉండటం పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టే టెకీలకు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆ తక్కువ జీతం ఐటీ వాళ్లకు కాదు: కాగ్నిజెంట్ క్లారిటీ
ఫ్రెషర్లకు అత్యల్పంగా రూ. 2.52 లక్షల వార్షిక జీతం ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ దానిపై స్పష్టత ఇచ్చింది. ఆ వేతనం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు కాదని, సాధారణ డిగ్రీ హోల్డర్లకు మాత్రమేనని తాజాగా పేర్కొంది.తాము ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు రూ. 4-12 లక్షల వేతనాన్ని అందిస్తున్నట్లు కాగ్నిజెంట్ వివరణ ఇచ్చింది. దీంతోపాటు తమ సంస్థలో ఉద్యోగులకు శాలరీ హైక్ మరీ తక్కువగా 1 శాతమే ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఎగతాళిపైనా కాగ్నిజెంట్ స్పందించింది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఇచ్చే వార్షిక ఇంక్రిమెంట్లలో 1-5 శాతం అనేది కనిష్ట బ్యాండ్ అని వివరించింది.కాగ్నిజెంట్ ఏటా ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్/ఐటీ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్లను విభిన్న పాత్రల కోసం నియమించుకుంటుంది. ఈ రెండు రిక్రూట్మెంట్లు దాదాపు సమాంతరంగా నడుస్తుండటంతో మూడేళ్ల నాన్-ఇంజనీరింగ్/ఐటీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్ల నియామకానికి సంబంధించిన ఫ్రెషర్ల శాలరీ ప్యాకేజీ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది."నాన్ ఇంజినీరింగ్ నేపథ్యాల నుంచి 3-సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న ప్రతిభావంతుల కోసం చేసిన మా ఇటీవలి జాబ్ పోస్టింగ్ వక్రీకరణకు గురైంది. ఈ జాబ్ పోస్టింగ్‌లో ఉన్న రూ. 2.52 లక్షల వార్షిక పరిహారం మూడేళ్ల సాధారణ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు మాత్రమే. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం కాదు. ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు మా వార్షిక పరిహారం హైరింగ్, స్కిల్ సెట్, అడ్వాన్స్డ్ ఇండస్ట్రీ అక్రెడిటెడ్ సర్టిఫికేషన్ల కేటగిరీని బట్టి సంవత్సరానికి రూ. 4 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుంది" అని కాగ్నిజెంట్ అమెరికాస్ ఈవీపీ, ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి తెలిపారు. -
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో, ఎండీ కృతివాసన్ 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక పరిహారంగా రూ. 25.36 కోట్లు తీసుకున్నారు. అతిపెద్ద ఐటీ కంపెనీల సీఈవోల జీతాల్లో ఇదే అత్యంత తక్కువ కావడం గమనార్హం.ఆసక్తికరంగా, బయటకు వెళ్తున్న చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణ్యం ఇదే సంవత్సరంలో సీఈవో కృతివాసన్ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు. అయితే, సీఈఓగా కృతివాసన్ జీతం 10 నెలల కాలానికి కాగా, సుబ్రమణ్యం వేతనం పూర్తి సంవత్సరానికి. కృతివాసన్ 2023 జూన్ 1న రాజేష్ గోపీనాథన్ నుండి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేయడానికి ముందు రెండు నెలల స్వల్ప వ్యవధిలో గోపీనాథన్ రూ. 1.1 కోట్లు అందుకున్నారు. అంతకు ముందు ఏడాది అంటే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 29.16 కోట్లు అందుకున్నారు.కృతివాసన్ వేతన పరిహారంలో ప్రాథమిక జీతం, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు, కమీషన్ ఉన్నాయి. టీసీఎస్ వార్షిక నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.21 కోట్ల కమీషన్ అందుకున్నారు. కంపెనీలో కృతివాసన్‌కి 11,232 స్టాక్‌లు ఉన్నప్పటికీ వేతన పరిహారంలో ఎంప్లాయి స్టాక్ పర్చేజ్ స్కీమ్ (ESPS) ఉండదు.2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇతర ఐటీ సంస్థలు తమ వార్షిక నివేదికలను ఇంకా విడుదల చేయలేదు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ. 56 కోట్ల వార్షిక రెమ్యునరేషన్ ప్యాకేజీని పొందారు. ఐటీ కంపెనీ సీఈవోల జీతాల్లో ఇదే అత్యధికం. ఈయన తర్వాత విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా సుమారు రూ. 50 కోట్ల అత్యధిక వార్షిక ప్యాకేజీ అందుకున్నారు. రూ. 28.4 కోట్లతో హెచ్‌సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ మూడో స్థానంలో ఉన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు రూ.1.10 కోట్ల బీమా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజా రవాణా విభాగంలో సేవలందిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ (బీమా)ని రూ.45 లక్షల నుంచి ఏకంగా రూ.1.10 కోట్లకు పెంచింది. ఈమేరకు ఆర్టీసీ గురువారం ఎస్బీఐతో కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత మూడేళ్ల క్రితం రూ.45 లక్షల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని అమలులోకి తెచి్చంది. తాజాగా దీన్ని ఏకంగా రూ.1.10 కోట్లకు పెంచడం విశేషం. కొత్త శాలరీ ప్యాకేజీ 2026 సెప్టెంబరు 2 వరకు అమలులో ఉంటుంది. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యం: పినిపె విశ్వరూప్, రవాణా శాఖ మంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త చరిత్ర సృష్టించారని రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ పేర్కొన్నారు. శాలరీ ప్యాకేజీ ఒప్పందం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. అధిక పెన్షన్ విధానంతో అప్పటి వరకు రూ.5 వేలు పింఛన్ పొందిన ఉద్యోగులకు ఏకంగా రూ.40 వేల వరకు పెన్షన్ పెరిగిందన్నారు.ఇప్పుడు ప్రమాద బీమాను రూ.1.10 కోట్లకు పెంచడం ఉద్యోగుల కుటుంబాలకు భరోసానిస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామి కావడం పట్ల ఎస్బీఐ జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. రూ.1.10 కోట్ల ప్రమాద బీమాతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు మరణిస్తే వారి పిల్లల చదువుల కోసం అబ్బాయిలకు రూ.8 లక్షలు, అమ్మాయిలకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందిస్తున్నామన్నారు. ఉద్యోగుల పిల్లల వివాహ రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచామన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ ఎంకే సిన్హా, ఆర్టీసీ ఈడీలు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, ఏ.కోటేశ్వరరావు, కృష్ణమోహన్,ఎఫ్ఏ–సీఏ రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈయూ హర్షం ఆర్టీసీ ఉద్యోగులకు రూ.1.10 కోట్ల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని అమలు చేయడంపట్ల ఈయూ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కృతజ్ఞతలు తెలిపింది.ఈమేరకు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.దామోదరరావు, జీవీ నరసయ్య ఓ ప్రకటన జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఇలా.. ప్రమాద బీమా రూ.30 లక్షల నుంచి రూ.85 లక్షలకు పెంపు రూపే డెబిట్ కార్డ్ లింకేజీ ద్వారా రూ.10 లక్షలు కొత్త రూపే కార్డ్ ద్వారా మరో రూ.10 లక్షలు సహజ మరణానికి రూ.5 లక్షలు మొత్తం మీద రూ.1.10 కోట్లు -
విశాఖ అమ్మాయి.. భారీ ప్యాకేజ్‌తో కొలువు
మనం అనుకున్నవి నెరవేరకున్నా.. ఆ లక్ష్యం మరో రూపంలో నెరవేరే అవకాశాలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి తండ్రీకూతుళ్ల కథే ఇది. తన తల్లి ప్రోత్సహంతో ఉన్నత స్థానానికి ఎదగాలనుకున్న వ్యక్తి.. కన్నకూతురి రూపంలో ఆ ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు. భారీ ప్యాకేజీ కొలువుతో తండ్రి కలను తీర్చి.. ఆయన పేరును నలుదిశలా చాటిన ఆ మధ్యతరగతి బిడ్డ పేరు రేపాక ఈశ్వరి ప్రియ. పైగా ఏయూ చరిత్రలోనే పెద్ద ప్యాకేజీ అందుకున్న అమ్మాయి కూడా ఈమెనే కావడం గమనార్హం!. రేపాక శ్రీనివాసరావుది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆయన ఎలక్ట్రానిక్ స్పేర్‌పార్ట్‌లు అమ్ముకునే చిరు వ్యాపారి. ఆయన భార్య రాధ.. గృహిణి. కొడుకు సందీప్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇక కూతురు ఈశ్వరి ప్రియ గురించి చెప్పుకోవాల్సింది చాలానే ఉంది. కానీ, అంతకంటే ముందు శ్రీనివాసరావు గురించి చెప్పాలి. చిన్నతనంలో ఆయనకు బాగా చదువుకోవాలని కోరిక. అదే ఆయన తల్లి కూడా కోరుకుంది. కానీ, ఆమె శ్రీనివాసరావు చిన్నతనంలోనే చనిపోయారు. అదే సమయంలో ఆర్థిక పరిస్థితులు సహకరించక.. చదువు ముందుకు సాగలేదు. ఏళ్లు గడిచాయి.. ఆయన పెద్దయ్యాడు.. ఆయనకు ఓ కుటుంబం వచ్చింది. తాను చదువుకోలేకపోయానన్న బాధను.. తరచూ పిల్లల ముందు వ్యక్తపరిచేవారాయన. ఆ మాటలు కూతురు ఈశ్వరి ప్రియను బాగా ప్రభావితం చేశాయి. ‘నేనెలాగూ చదువుకోలేకపోయా. మీరైనా బాగా చదువుకోవా’లనే మాటలను ఆమె బాగా ఎక్కించుకుంది. ఇంటర్, ఆపై ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించింది. కానీ, తండ్రి కళ్లలో ఇంకా పూర్తి స్థాయిలో ఆనందం చూడలేదామె. మంచి ఉద్యోగంలో స్థిరపడినప్పుడే తన తండ్రి సంతోషంగా ఉంటాడని భావించిందామె. మంచి ర్యాంక్ రావడంతో ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్‌లో చేరింది. ఈ క్రమంలో సందీప్ సైతం సోదరికి ఎంతో ప్రోత్సాహం అందించాడు. వెనువెంటనే.. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు.. మోర్గాన్ స్టాన్లీ సంస్థలో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసింది. రెండు నెలల ఇంటర్న్‌షిప్‌లో.. ఆమెకు రూ.87 వేలు స్టైపెండ్ వచ్చింది. అప్పుడే.. ఆ కంపెనీ రూ.28.7 లక్షల ప్యాకేజీతో(ఇయర్ శాలరీ) ఆఫర్ చేసింది. ఆపై అమెజాన్ సంస్థ కోడింగ్ పరీక్షలోనూ ఎంపికై.. నెలకు రూ.1.4 లక్షల అందించడం మొదలుపెట్టింది. నెల పూర్తయ్యే లోపే.. అట్లాషియన్‌లో భారీ ప్యాకేజీతో కొలువు దక్కించుకుంది. ఏకంగా ఏడాదికి.. రూ.84.5 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసింది అట్లాషియన్ కంపెనీ. ఇది తాను అసలు ఊహించలేదని ఈశ్వరి చెబుతోంది. అంతేకాదు వర్క్‌ఫ్రమ్ హోం కావడంతో.. తమ బిడ్డ కళ్లెదురుగానే ఉంటూ పని చేసుకుంటుందంటూ ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పెద్ద ప్యాకేజీ ఇంటర్వ్యూ అంటే.. ఆమె ఆందోళనకు గురైందట. అది తెలిసిన శ్రీనివాసరావు.. మరేం ఫర్వాలేదు.. ఇదొక్కటే జీవితం కాదు. అంతా మన మంచికే. నీ వంతు ప్రయత్నించు అని కూతురికి ప్రొత్సహం ఇచ్చి పంపించారు. ఆ మాటలే ఆమెలో ధైర్యాన్ని నింపాయి. ఇంటర్వ్యూ అయిన రోజే అపాయింట్మెంట్ లెటర్ మెయిల్ చేశారు. కిందటి ఏడాది అక్టోబర్‌లో అట్లాషియన్ కంపెనీ కోడింగ్ కోసం పోటీ పెడితే.. దేశవ్యాప్తంగా 30 వేల మంది విద్యార్థులు పోటీ పడ్డారు. 300 మందిని ఫైనల్ పోటీలకు ఎంపిక చేసి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. టెక్నికల్ సిస్టమ్ డిజైన్, హెచ్ఆర్ దశల్లో పరీక్షించి పది మందిని ఉద్యోగాలకు, చదువుతున్న మరో పది మందిని ఇంటర్న్‌షిప్‌లోకి తీసుకున్నారు. విశేషం ఏంటంటే.. ఈ ఉద్యోగానికి ఏపీ నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి ఈశ్వరినే. ఉపాధి అవకాశాల కోసం సోషల్ మీడియాలో అనేక ఫ్లాట్‌ఫామ్‌లు ఉంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజినీరింగ్ ఉద్యోగావకాశాలు చాలానే ఉంటున్నాయి. కాకపోతే.. క్యాంపస్‌లో కాకుండా బయట రిక్రూట్‌మెంట్స్‌పై దృష్టిసారించాలి అని సలహా ఇస్తోంది ఈ విజేత. -
ఎయిర్టెల్ చీఫ్ మిట్టల్ ప్యాకేజీ తగ్గింపు.. ఎంతంటే
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2021–22) సంబంధించి టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ప్యాకేజీ 5 శాతం తగ్గింది. రూ. 15.39 కోట్లకు పరిమితం అయ్యింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 16.19 కోట్లుగా నమోదైంది. గత రెండేళ్లుగా ఆయన జీతాలు, ప్రోత్సాహకాలు యథాప్రకారంగానే ఉన్నప్పటికీ ..హోదాపరంగా లభించే కొన్ని ప్రయోజనాల విలువ కొంత తగ్గడమే మిట్టల్ ప్యాకేజీలో తగ్గుదలకు కారణం. 2020–21లో వీటి విలువ రూ. 1.62 కోట్లుగా ఉండగా తాజాగా ఇది రూ. 83 లక్షలకు పరిమితమైంది. -
జాక్‌పాట్ కొట్టిన సంప్రీతి.. గూగుల్‌లో రూ. కోటికిపైగా ప్యాకేజీ
Indian Girl Sampreeti Yadav Biodata and Google Package Details: టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో టెక్ దిగ్గజ కంపెనీలు ఎప్పుడూ ముందుంటాయి. ఈ తరుణంలో భారత్ నుంచి ఎక్కువ మేధోసంపత్తిని వెలికి తీస్తుంటాయి. బడా బడా కంపెనీల సీఈవోలుగా భారత మూలాలు ఉన్నవాళ్లు, భారీ ప్యాకేజీలు అందుకుంటున్న వాళ్లలో భారతీయ టెక్కీలు ఉండడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే తాజాగా ఓ భారత యువతికి కోటి రూపాయలకు పైగా ప్యాకేజీతో బంపరాఫర్ ఇచ్చింది గూగుల్. కొవిడ్ టైంలో ఉద్యోగాల నియామకం కంపెనీలకు తలనొప్పిగా మారింది. అందునా టాలెంట్ ఉన్న ఉద్యోగులను లాగేసుకునేందుకు పోటాపోటీ పడుతున్నాయి కూడా. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో పని చేస్తున్న సంప్రీతికి.. మరో టెక్ కంపెనీ గూగుల్ భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది. మొత్తం తొమ్మిది రౌండ్ల ఇంటర్వ్యూ క్లియరెన్స్ తర్వాత గూగుల్ ఆమెకు ఒక కోటి పది లక్షల రూపాయల ఏడాది శాలరీ ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఇందుకు సంప్రీతి సైతం ఓకే చెప్పింది. నేపథ్యం.. సంప్రీతి యాదవ్ స్వస్థలం బీహార్ రాజధాని పాట్నాలోని నెహ్రూ నగర్. తండ్రి రామ్‌శంకర్ యాదవ్ బ్యాంక్ ఆఫీసర్ కాగా, తల్లి ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2014లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి.. 2016లో జేఈఈ మెయిన్స్‌ను క్లియర్ చేసింది సంప్రీతి. ఇక ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది. బీటెక్ పూర్తి చేసుకున్న వెంటనే(2021లో) ఏకంగా నాలుగు కంపెనీలు ఆమె కోసం ఆఫర్ ఇచ్చాయి. అందులో ఫ్లిప్‌కార్ట్, అడోబ్ కంపెనీలు కూడా ఉన్నాయి. కానీ, ఆమె మాత్రం మైక్రోసాఫ్ట్‌ను ఎంచుకుంది. మైక్రోసాఫ్ట్‌లో ఆమె శాలరీ ఏడాదికి 44 లక్షల రూపాయల ప్యాకేజీ. ఇక ఫిబ్రవరి 14, 2022 తేదీన ఆమె గూగుల్‌లో చేరాల్సి ఉంది. ఇదిలా ఉంటే కిందటి ఏడాది జూన్‌లో పాట్నాకే చెందిన ఐఐటీ స్టూడెంట్ దీక్ష బన్సాల్(ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్)కు గూగుల్ 54 లక్షల ఏడాది ప్యాకేజీతో ఉద్యోగం ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఐఐటీ బీహెచ్‌యూకి చెందిన ఐదుగురు విద్యార్థులను ‘ఉబెర్’ ఇనయమించుకోగా.. అందులో ఓ స్టూడెంట్‌కు 2.05 కోట్ల జీతం ప్రకటించింది ఉబెర్. చదవండి: టెస్లా ఆటో పైలెట్ టీమ్‌కి ఎంపికైన అశోక్ ఎల్లుస్వామి గురించి తెలుసా? -
హై హై.. ఐటీ ఆఫర్ కోటి!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ఐటీలో మళ్లీ జోష్ పెరిగింది. గత మూడేళ్లుగా కొంత స్తబ్దుగా ఉన్న ఐటీ కంపెనీలు తాజాగా నియామకాల జోరు పెంచాయి. నాలుగేళ్ల క్రితం ఐఐటీ విద్యార్థులకు రూ.కోటి అంతకంటే ఎక్కువ వేతనాలు ఆఫర్ చేసిన మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గోల్డ్‌మెన్‌శాక్స్ వంటి అమెరికన్ కంపెనీలు ప్రతిభావంతుల కోసం మన ఐఐటీల ముందు క్యూ కట్టాయి. సగటున రూ.కోటి వార్షికవేతనం ఇస్తామని ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థి ప్రతిభను బట్టి గరిష్టంగా రూ.1.40 కోట్లు, కనిష్టంగా రూ.41 లక్షలు ఇస్తామని పేర్కొంటున్నాయి. అలాగే మొదటిసారిగా అమెరికాకు చెందిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్, సిటీ గ్రూప్, పేపాల్ వంటి సంస్థలు ఐఐటీ, ఎన్ఐటీ, ప్రముఖ కాలేజీల్లో ప్లేస్మెంట్లకు రావడం విశేషం. ఒక్కో విద్యార్థికి ఒకేసారి ఐదారు ఉద్యోగావకాశాలు కూడా వస్తు న్నాయి. జూలై మొదటి వారంలో ప్రారంభమైన క్యాంపస్ రిక్రూట్మెంట్ జోరు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఐఐటీలు, నిట్లు మాత్రమే కాకుండా మంచి ర్యాంకింగ్ కలిగి ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ నియామకాల ప్రక్రియ ఊపందుకుంది. గత మూడేళ్లుగా పాక్షిక నియామకాలకు పరిమితమైన ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, టీసీఎస్, క్యాప్ జెమినీ, యాక్సెంచర్ వంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగుల నియామకానికి రిక్రూట్మెంట్ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. ఐఐటీ వారణాసి విద్యార్థికి 1.52 కోట్ల వార్షిక వేతనం ఈ ఏడాది ఐఐటీ విద్యార్థుల పంట పండింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ వారణాసి (బీహెచ్‌యూ) విద్యార్థికి ఒక కంపెనీ రూ.1.52 కోట్ల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. ఈ సంస్థ ఇంకా అధికారికంగా విద్యార్థి, కంపెనీ పేరు వెల్లడించలేదు. మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మెన్‌శాక్స్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జోమాటో, ఫేస్బుక్ వంటి కంపెనీలు ఈ ఐఐటీ విద్యార్థులకు ఉద్యోగాలు ఆఫర్ చేశాయి. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఓ విద్యార్థికి అత్యధికంగా (ఇప్పటివరకూ) రూ.1.5 కోట్ల వార్షిక వేతనాన్ని ఓ కంపెనీ ఆఫర్ చేసింది. ఈ ఐఐటీలో ఆదిత్య బిర్లా, అబోడ్, అమెజాన్, క్యాటర్ పిల్లర్, మారుతీ సుజుకీ సంస్థలు విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. ఐఐటీ రూర్కీలోనూ ఓ విద్యార్థికి ప్రపంచ ప్రసిద్ది గాంచిన కంపెనీ రూ.1.5 కోట్ల వేతనాన్ని ఆఫర్ చేసింది. ఈ ఐఐటీలో గూగుల్, మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మెన్‌శాక్స్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, వాల్‌మార్ట్ సంస్థలు ఉద్యోగాలు ఆఫర్ చేశాయి. ఐఐటీ ముంబైలో విద్యార్థులను నియమించుకోవడానికి 15 కంపెనీలు పోటీ పడ్డాయి. ఇక్కడ ఇప్పటివరకూ ఒక విద్యార్థికి గరిష్టంగా రూ.140 కోట్ల ఆఫర్ లభించింది. మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మెన్‌శాక్స్, మెకెన్సీ నాలెడ్జ్ సెంటర్, టాటా స్టీల్, ఈసీ జపాన్, ఐబీఎం, ఉబర్ వంటి సంస్థలు ఇందులోని విద్యార్థులను ఎంచుకున్నాయి. నిట్ విద్యార్థులకూ భారీ ఆఫర్లు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన (నిట్, న్యూఢిల్లీ) విద్యార్థికి ఓ కంపెనీ రూ.1.24 కోట్ల మేర వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. ఈ సంస్థలోని విద్యార్థులను నియమించుకోవడానికి మెకెన్సీ అండ్ కంపెనీ, జబాంగ్.కామ్, ఆర్ఐఎల్, జనరల్ మోటార్స్, ఈబే, సిటీ గ్రూప్ పోటీ పడ్డాయి. దక్షిణాది నిట్‌లలో అగ్రస్థానంలో ఉండే తిరుచిరాపల్లి నిట్ విద్యార్ధికి రూ.89.5 లక్షల వార్షిక వేతనం ఆఫర్ లభించింది. తోషిబా, ఫ్లిప్‌కార్ట్, టాటా మోటార్స్, ఎర్నెస్ట్ అండ్ ఎంగ్ వంటి కంపెనీలు ఇక్కడ పోటీ పడ్డాయి. ఇక మోతీలాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (నిట్, అలహాబాద్) విద్యార్థుల్లో దాదాపు 55 మందికి రూ.25.5 లక్షల వార్షిక వేతనం లభించింది. ఇక్కడ విద్యార్థులను నియమించుకోవడానికి ఎల్ అండ్ టీ, ఏబీబీ లిమిటెడ్, హీరో మోటార్స్, బ్లూస్టార్ సంస్థలు ఉత్సాహం కనబరిచాయి. సూరత్కల్లోనూ దాదాపు 100 మంది విద్యార్థులకు రూ.29.15 లక్షల మేర వార్షిక వేతనాన్ని కంపెనీలు ఆఫర్ చేశాయి. హైదరాబాద్‌లో 5వేల మందికి అవకాశాలు ఈ ఏడాది హైదరాబాద్‌లో దాదాపు 5వేల మంది విద్యార్థులకు క్యాంపస్ నియామకాలు, జాబ్ మేళాల ద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయని నాస్కామ్ (దక్షిణ భారత) డైరెక్టర్ ఒకరు వెల్లడించారు. మునుపెన్నడూ లేని విధంగా అనేక బహుళజాతి కంపెనీలు ద్వితీయ శ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ నియామకాల ప్రక్రియ చేపడుతున్నాయని ఆయన వెల్లడించారు. సీబీఐటీ హైదరాబాద్ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ రూ.41 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేసింది. జేపీ మోర్గాన్ చేజ్ కంపెనీ ఈ కాలేజీలో 40 మందికి పైగా విద్యార్థులకు భారీ వేతనాలను ఆఫర్ చేసింది. ఈ ఏడాది పెద్ద ఎత్తున కంపెనీలు రానున్నాయని, విద్యార్థులకు భారీ ఎత్తున అవకాశాలు ఉంటాయని, కంపెనీల నుంచి నియామక తేదీలు కావాలంటూ లేఖలు వస్తున్నాయని సీబీఐటీ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ ఎన్ఎల్ఎన్ రెడ్డి తెలిపారు. గత మూడు నాలుగేళ్లుగా టాప్ టెన్ కాలేజీల్లో నియామకాలకు మాత్రమే పరిమితమైన ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, యాక్సెంచర్ వంటి కంపెనీలు ఈ ఏడాది ద్వితీయ శ్రేణి కాలేజీల్లో నియామకాలకు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ ఏడాది హైదరాబాద్‌లో దాదాపు 5వేల మంది విద్యార్థులకు క్యాంపస్ నియామకాలు, జాబ్ మేళాల ద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయని నాస్కామ్ డైరెక్టర్ వెల్లడించారు. సీబీఐటీ హైదరాబాద్ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ రూ.41 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేసింది. జేపీ మోర్గాన్ చేజ్ కంపెనీ ఈ కాలేజీలో 40 మందికి పైగా విద్యార్థులకు భారీ వేతనాలను ఆఫర్ చేసింది. కంపెనీల నుంచి నియామక తేదీలు కావాలంటూ లేఖలు వస్తున్నాయని సీబీఐటీ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ ఎన్ఎల్ఎన్ రెడ్డి తెలిపారు. -
ఉద్యోగులకు వరం...
బొంరాస్‌పేట(కొడంగల్): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటివరకు స్టేట్ బ్యాంకులో ఉన్న జీతాల పొదుపు ఖాతాను వివిధ ప్రయోజనాల కోసం స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ (ఎస్జీఎస్పీ) విధానానికి మార్చుకునే అవకాశం కల్పించింది. ఈమేరకు స్టేట్ బ్యాంకులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ మార్పుతో ఇతర సాధారణ ఖాతాదారులకంటే మెరుగైన సేవలు, అదనపు సౌకర్యాలు పొందే అవకాశం ఉంది. కొత్తగా అమలులోకి వచ్చిన ఎస్జీఎస్పీ విధానాలపై అవగాహన ఉంటే ఈ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. జిల్లాలో దాదాపు 3,600మంది ఉపాధ్యాయులు, మరో 2,500 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరంతా తమ బ్యాంకు ఖాతాల ద్వారా జీతాలు అందుకుంటున్నారు. వీటిని సాలరీ ప్యాకేజీ అకౌంట్లుగా మార్పుచేసుకునేందుకు తమ జీతాలు అందుకునే బ్యాంకుల్లో ఎస్జీఎస్పీ విధానం పలురకాల ప్రయోజనాలు అందిస్తోంది. ప్యాకేజీ ప్రయోజనాలు.. ♦ స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజీ(ఎస్జీఎస్పీ) ఖాతా కిందకు మారితే ఖాతాదారులకు లభించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.. ♦ ప్రస్తుతం బ్యాంకు ఖాతాలో కనీసం రూ.500 నుంచి రూ.2 వేలు ఉండాలన్న నిబంధన ఉంది. ఎస్జీఎస్పీ విధానంలో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎటువంటి నష్టం ఉండదు. ♦ ఏటీఎంలో నగదు డ్రా చేయడానికి ఇటీవల బ్యాంకులు కొన్ని పరిమితులు విధించాయి. పరిమికి మించి డ్రా చేస్తే చార్జీలు వసూలు చేస్తున్నాయి. సాలరీ ప్యాకేజీలో ఎన్ని పర్యాయాలైనా ఏటీఎం నుంచి నగదు డ్రా చేయవచ్చు. ♦ వ్యక్తిగత రుణం తీసుకున్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఇందుకు రుణం తీసుకున్న సమయంలోనే ప్రీమియం వసూలు చేస్తారు. కొత్త విధానంలో ప్రీమియం లేకుండా ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తారు. అలాగే విమాన ప్రయాణంలో చనిపోతే రూ.30 లక్షలు చెల్లిస్తారు. ♦ వ్యక్తిగత, గృహ, విద్యారుణాలు తీసుకున్న ఖాతాదారుల నుంచి బ్యాంకు అధికారులు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుండగా.. ఈ ఖాతా కలిగి ఉన్న వారికి ఫీజులో 50శాతం రాయితీ అభిస్తుంది. ♦ బ్యాంకుల్లో బంగారం, డాక్యుమెంట్లు, ఇతర విలువైన వస్తువులు దాచుకునేందుకు తీసుకున్న లాకర్ సౌకర్యం చార్జీల్లో 25శాతం రాయితీ ఉంటుంది. ♦ డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ)లకు ఎస్జీఎస్పీ ఖాతాదారులకు ఎటువంటి చార్జీల వసూలు ఉండదు. ♦ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నగదు లేకున్నా, వారికి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తారు. రెండు నెలల శాలరీని ఈ ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాలో సొమ్ము లేకపోయినా తీసుకోవచ్చు. తీసుకున్న ఓవర్ డ్రాఫ్ట్‌ను నిర్ణీత గడువులోగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్జీఎస్పీ ఖాతాదారులకు రూ.20లక్షల వరకు ఉచితంగా బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. వేతనాల స్థాయి ఆధారంగా ప్యాకేజీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తాము ప్రతినెల తీసుకుంటున్న వేతనాల ఆధారంగా సాలరీ ప్యాకేజీ అకౌంట్లను కేటాయిస్తుంది. ఉద్యోగులందరికీ ఒకే రకమైన అకౌంటు కాకుండా జీతం స్థాయికి అనుగుణంగా వివిధ విభాగాలుగా విభజించారు. జీతం ఆధారంగా అకౌంట్ రూ.5వేల నుంచి రూ.20వేల జీతం తీసుకునే ఉద్యోగులకు సిల్వర్ అకౌంట్లు, రూ.20వేల నుంచి రూ.50వేల మధ్య జీతం తీసుకునే ఉద్యోగులకు గోల్డ్ అకౌంట్లు, రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు జీతాలు పొందుతున్న వారివి డైమండ్ అకౌంట్లుగా, రూ.లక్షకు పైగా జీతాలు పొందుతున్న ఉద్యోగుల అకౌంట్లను ప్లాటినం అకౌంట్లుగా వ్యవహరిస్తారు. ప్యాకేజీ పొందే విధానం ♦ జీతం అందుకునే ఖాతా ఉన్న బ్యాంకులో అందుకు కావల్సిన వివరాలు, పత్రాలు, గుర్తింపుకార్డు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు జిరాక్సులు, ఆ నెలలో తీసుకున్న జీతపు బిల్లులను దరఖాస్తుతో జతచేసి బ్యాంకు మేనేజరుకు అందివ్వాలి. ♦ మేనేజరు పరిశీలించి సంతకంతో ధ్రువీకరిస్తారు. ♦ ధ్రువీకరణ పూర్తయిన ఫారాన్ని సంబంధిత కౌంటరులో ఇవ్వాలి. ♦ అనంతరం రెండు లేదా మూడు రోజుల్లో అకౌంటును ఎస్జీఎస్పీ పద్ధతిలోకి మార్పు చేస్తారు. ♦ ఎస్జీఎస్పీ పద్ధతిలోకి మార్పు అయిన విషయాన్ని ఆన్‌లైన్‌లోనూ తెలుసుకోవచ్చు. ♦ ఎస్జీఎస్పీలోకి మారిన తర్వాత ఏటీఎం కార్డుకోసం దరఖాస్తు చేసుకోవాలి. కార్డు (జీతం స్థాయిని బట్టి సిల్వర్/గోల్డ్/డైమండ్/ప్లాటినం పేరుతో) అందుతుంది. దీనిద్వారా పరిమితిలేని డ్రాలు, ప్రయోజనాలు పొందవచ్చు. అనేక ప్రయోజనాలున్నాయి నేను జీతం పొందే బ్యాంకు ఖాతాను రెండు నెలల క్రితం ఎస్జీఎస్పీ విధానంలోకి మార్చుకున్నా. నా నెలసరి జీతాన్ని బట్టి నాకు ‘గోల్డెన్ అకౌంట్’ కార్డు వచ్చింది. రోజువారీ పరిమితికి మించినన్ని సార్లు టీఎంకార్డును వినియోగించుకుంటున్నా. ఎలాంటి చార్జీలు కట్ కావడంలేదు. ఎస్బీఐలో ప్రకటించిన ఎస్జీఎస్పీ విధానంతో ఉద్యోగులకు అనేక ప్రయోనాలున్నాయి. ఎస్బీఐ అధికారులు ఈ ప్యాకేజీ అకౌంట్లపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలి. – క్రాంతికుమార్, టీఎస్ సీపీఎస్ఈయూ, జిల్లా సహాయ కార్యదర్శి, కొడంగల్ -
ఫ్రెషర్స్ వేతన ప్యాకేజీపై సర్వే ఏం చెప్పిందంటే.....
కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారి(ఫ్రెషర్స్) వేతన ప్యాకేజీ గతేడాది కంటే 2016లో భారీగా పెరిగిందట. వార్షిక వేతనం కింద ఆరు లక్షల కంటే ఎక్కువ వేతన ప్యాకేజీనే చాలా ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయని, ఈ వృద్ధి 85 శాతం ఉందని తాజా సర్వేలు తేల్చాయి. ఉద్యోగ అంచనా సంస్థ యాస్పైరింగ్ మైండ్స్, ఫ్రెషర్ జాబ్స్ పోర్టల్ మ్యామ్క్యాట్.కామ్ ద్వారా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఉద్యోగులకు(0 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉన్న) ఆఫర్ చేసే వేతనాలు వార్షికంగా రూ.1-30 లక్షల మధ్యలో ఉంటాయని, వాటిలో చాలా వేతనాలు వార్షికంగా రూ.2-3 లక్షల రేంజ్‌లోనే ఉంటాయని సర్వే పేర్కొంది. అయితే వేతన ప్యాకేజీ రూ.6 లక్షల కంటే ఎక్కువగా ఆఫర్ చేసే ఉద్యోగాలు 2015 నుంచి 85 శాతం పెరిగాయని తాజా సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 6వేల ఉద్యోగాల్లో పోస్ట్ అయిన 40 లక్షల జాబ్ అప్లికేషన్లపై ఈ సర్వే నిర్వహించారు. ఎక్కువగా డిమాండ్ ఉన్న జాబ్ రోల్ సాప్ట్వేర్ అప్లికేషన్స్ అని, దీనికి సుమారు 38 శాతం జాబ్ అప్లికేషన్లు నమోదైనట్టు ఈ సర్వే పేర్కొంది. ఫ్రెషర్స్‌లో రెండో టాప్ జాబ్ మార్కెటింగ్, సేల్స్ అని వెల్లడైంది. మార్కెటింగ్‌లో కూడా డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువగా పాపులర్ జాబ్‌గా ఉందని తెలిసింది. డేటా అనాలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్లకు యేటికేటికి 30 శాతానికి పైగా వృద్ధి నమోదవుతుందట. టెక్నికల్ ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ డెవలపర్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల్లో డిజిటల్ మార్కెటింగ్‌లు అత్యంత ప్రాముఖ్యమైన జాబ్ కేటగిరీల్లో అగ్రస్థానాల్లో నిలుస్తున్నాయని యాస్పైరింగ్ మైండ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హిమాన్షు అగర్వాల్ చెప్పారు. -
వేతన సంప్రదింపులు ఫలించాలంటే!
జాబ్ ఆఫర్ చేతిలో పడగానే కొలువు వేట ముగిసినట్టు కాదు. ప్రయత్నం సగం ఫలించనట్లే భావించాలి. సంస్థ యాజమాన్యంతో చర్చించి, జీతభత్యాలను ఖాయం చేసుకొని ఉద్యోగంలో చేరినప్పుడే మీరు పూర్తి విజయం సాధించినట్లు లెక్క. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో నెగ్గిన తర్వాత వేతనం గురించి సంస్థతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. తమ అర్హతలు, నైపుణ్యాలకు తగిన గుర్తింపు, వేతనం కావాలని అభ్యర్థులు కోరుకోవడం సహజమే. అయితే, ఈ విషయంలో పట్టుదలకు పోతే మొదటికే మోసం వస్తుంది. కొలువు చేజారుతుంది. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి. పట్టువిడుపులు ప్రదర్శించాలి వేతన ప్యాకేజీని నిర్ణయించుకొనే విషయంలో ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జాబ్ ప్రొఫైల్, గ్రేడ్, పనివేళలు, యాజమాన్యం పాటించే విలువలు, కార్యాలయం ఉన్న ప్రాంతం.. వంటివి ముఖ్య పాత్ర పోషిస్తాయి. పనివేళలు, కార్యాలయం మీకు అనుకూలంగా ఉండొచ్చు. అలాంటప్పుడు జీతం విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించాలి. మీ అర్హతలు, పని అనుభవం పెంచుకొనే అవకాశం ఉన్న ఉద్యోగమైతే వేతనంపై ఎక్కువ ఆశలు పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో అనుభవం సంపాదించిన తర్వాత మరో సంస్థలో చేరి, ఆశించిన ప్యాకేజీ పొందడానికి వీలుంటుంది. పరిశోధన చేయండి వేతనంపై సంస్థతో సంప్రదింపులు జరపడానికంటే ముందు కొంత పరిశోధన చేయండి. ప్రస్తుత జాబ్ మార్కెట్ తీరుతెన్నులు, కంపెనీ, అందులో సిబ్బందికి ఇస్తున్న జీతాలు, మీతో సమానమైన అర్హతలున్నవారికి దక్కుతున్న ప్యాకేజీ.. ఇలాంటి వాటిపై అవగాహన పెంచుకోండి. ప్రతి కంపెనీకి ప్రత్యేకమైన సంస్థాగత నిర్మాణం, వేతనాల విధానం ఉంటాయి. వాటి గురించి పరిశోధిస్తే ఎంత జీతం కోరుకోవాలో తెలుస్తుంది. ఇతర ప్రయోజనాలు కొన్ని కంపెనీల్లో జీతాలు తక్కువగా ఉన్నప్పటికీ ఇతర బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. రవాణా, భోజన సదుపాయం, టెలిఫోన్ రియంబర్స్మెంట్ వంటి ప్రయోజనాలను ఉద్యోగులకు కల్పిస్తారు. ఇవి మీకు సంతృప్తికరంగా అనిపిస్తే జీతం తక్కువైనా ఉద్యోగంలో చేరొచ్చు. కాబట్టి సంస్థలో ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయో లేదో ముందే తెలుసుకోవాలి. ఆత్మవిశ్వాసం ముఖ్యం పే ప్యాకేజీపై యాజమాన్యంతో మాట్లాడేటప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. బాడీ లాంగ్వేజ్ సక్రమంగా ఉండాలి. మర్యాద ఉట్టిపడే భాష ఉపయోగించాలి. స్వరం స్పష్టంగా వినిపించాలి. మీరు చెప్పాలనుకుంటున్న విషయాన్ని డొంకతిరుగుడు లేకుండా సూటిగా చెప్పాలి. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటే కచ్చితంగా మేలు జరుగుతుంది. యాజమాన్యం ఆఫర్ చేస్తున్న ప్యాకేజీపై తొందరపడి ఒక నిర్ణయానికి రావొద్దు. అన్ని విషయాలను నిదానంగా ఆలోచించుకున్న తర్వాతే అడుగు ముందుకేయండి. దీర్ఘకాలిక అవసరాలు వేతనం ప్రారంభంలో తక్కువగా ఉన్నా.. దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తమే జేబులో పడే అవకాశం ఉంటుంది. అంటే జీతభత్యాలు క్రమంగా పెరుగుతుంటాయి. కొన్ని సంస్థల్లో మేనేజ్మెంట్ తమ ఉద్యోగుల కెరీర్ డెవలప్మెంట్కు అవసరమైన చర్యలు చేపడుతుంది. వీటిని కూడా మీరు నిశితంగా పరిశీలించండి. తాత్కాలికమైన వెసులుబాట్లను కాకుండా దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకోండి. జాబ్ ఆఫర్‌ను అందుకోవాలా? లేక తిరస్కరించాలా? అనే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స ఎంఆర్‌పీఎల్ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. జనరల్ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్/ ఫైనాన్స్) చీఫ్ మేనేజర్ (షిప్పింగ్) సీనియర్ మేనేజర్ (లా) సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్) మేనేజర్ (ఆపరేషన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ, లా) డిప్యూటీ మేనేజర్ (ఆపరేషన్స్) సీనియర్ ఇంజనీర్ (ఫైర్ అండ్ సేఫ్టీ) సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) ఇంజనీర్ (కెమికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్) అభ్యర్థులకు నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు, అనుభవం, వయోపరిమితి తప్పనిసరిగా ఉండాలి. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 20 వెబ్సైట్: www.mrpl.co.in ఐఐటీ-మద్రాస్ ఐఐటీ-మద్రాస్.. వివిధ కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. కోర్సులు: రెగ్యులర్ పీహెచ్డీ, పీహెచ్డీ ఎక్స్టర్నల్/ పార్ట్ టైం పీహెచ్డీ, ఇంటర్ డిసిప్లినరీ పీహెచ్డీ, ఎంటెక్- పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ. విభాగాలు: ఏరోస్పేస్, అప్లయిడ్ మెకానిక్స్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ డిజైన్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్, మేనేజ్మెంట్ స్టడీస్, మ్యాథమెటిక్స్, మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఓషన్ అండ్ ఫిజిక్స్. అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎంటెక్/ ఎమ్మెస్సీ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 21 వెబ్సైట్: www.iitm.ac.in ఐఐఎస్ఈఆర్లో పీహెచ్డీ మొహాలీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్) వివిధ విభాగాల్లో పీహెచ్డీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పీహెచ్డీ ప్రోగ్రామ్-2015 ఎంపిక: యూజీసీ నెట్/గేట్/ఎన్బీహెచ్ఎం స్కోర్ ఆధారంగా ఎంపిక చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.. చివరి తేది: అక్టోబర్ 15 వెబ్సైట్: http://iisermohali.ac.in కాంపిటీటివ్ కౌన్సెలింగ్ కానిస్టేబుల్, ఎస్సై పోటీ పరీక్షల్లో ‘సిరీస్’ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది? - టి.అభిలాష్, మియాపూర్ పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పోటీ పరీక్షల్లో ‘సిరీస్’ టాపిక్ నుంచి కనీసం 3 నుంచి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఆంగ్ల అక్షరాలు లేదా సంఖ్యలను ఒక వరుస క్రమంలో ఇస్తారు. చివరగా ఒక ఖాళీ ఇస్తారు. ముందుగా.. ఇచ్చిన అక్షరాలు లేదా సంఖ్యల మధ్య సంబంధాన్ని/ సారూప్యాన్ని గుర్తించాలి. అదే సంబంధంతో ఉన్న అక్షరాలు లేదా సంఖ్యలను కనుక్కోవాలి. సాధారణంగా సరి, బేసి, ప్రధాన సంఖ్యలు, వర్గాలు, ఘనాల ఆధారంగా ఈ సిరీస్‌లను ఇస్తారు. వీటిపై పట్టు సాధిస్తే, ఈ విభాగం నుంచి ఇచ్చే ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. ఇన్పుట్స్: బి.రవిపాల్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ డిఎస్సీ పరీక్షలో బయాలజీ కంటెంట్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను ఎలా అధ్యయనం చేయాలి? ‘వ్యాధులు, కారకాలు’ నుంచి ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? - కె.గీత, బి.ఎన్.రెడ్డి నగర్ డిఎస్సీలో జీవశాస్త్రానికి సంబంధించి అధ్యాయాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. మార్కుల పరంగా కంటెంట్‌కు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే 8 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. చదువుతున్నప్పుడే సిలబస్‌లోని అంశాలపై సొంతంగా బిట్స్ రాసుకుంటే చక్కగా గుర్తుంటాయి. తెలుగు అకాడమీ.. బిట్స్‌తో కూడిన పుస్తకాలను ప్రత్యేకంగా ప్రచురించింది. ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. వ్యాధులు, కారకాలు పాఠ్యాంశం నుంచి ప్రతి డిఎస్సీలో 2 నుంచి 3 ప్రశ్నలు అడుగుతు న్నారు. వ్యాధి పేరు, కారకం, వ్యాప్తి చెందే పద్ధతి, వ్యాధి లక్షణాలను పట్టిక రూపంలో పొందుపర్చుకుని అధ్యయనం చేయాలి. అదే విధంగా గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేస్తే ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవచ్చు. ఇన్పుట్స్: ఎస్.పి.డి.పుష్పరాజ్, సీనియర్ ఫ్యాకల్టీ