ఒప్పందం కుదుర్చుకుంటున్న ఆర్టీసీ, ఎస్‌బీఐ అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజా రవాణా విభాగంలో సేవలందిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ (బీమా)ని రూ.45 లక్షల నుంచి ఏకంగా రూ.1.10 కోట్లకు పెంచింది. ఈమేరకు ఆర్టీసీ గురువారం ఎస్‌బీఐతో కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత మూడేళ్ల క్రితం రూ.45 లక్షల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని అమలులోకి తెచి్చంది. తాజాగా దీన్ని ఏకంగా రూ.1.10 కోట్లకు పెంచడం విశేషం. కొత్త శాలరీ ప్యాకేజీ 2026 సెప్టెంబరు 2 వరకు అమలులో ఉంటుంది.
ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యం: పినిపె విశ్వరూప్, రవాణా శాఖ మంత్రి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త చరిత్ర సృష్టించారని రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ పేర్కొన్నారు. శాలరీ ప్యాకేజీ ఒప్పందం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు.
అధిక పెన్షన్ విధానంతో అప్పటి వరకు రూ.5 వేలు పింఛన్ పొందిన ఉద్యోగులకు ఏకంగా రూ.40 వేల వరకు పెన్షన్ పెరిగిందన్నారు.ఇప్పుడు ప్రమాద బీమాను రూ.1.10 కోట్లకు పెంచడం ఉద్యోగుల కుటుంబాలకు భరోసానిస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు.
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామి కావడం పట్ల ఎస్‌బీఐ జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. రూ.1.10 కోట్ల ప్రమాద బీమాతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు మరణిస్తే వారి పిల్లల చదువుల కోసం అబ్బాయిలకు రూ.8 లక్షలు, అమ్మాయిలకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందిస్తున్నామన్నారు. ఉద్యోగుల పిల్లల వివాహ రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచామన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ ఎంకే సిన్హా, ఆర్టీసీ ఈడీలు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, ఏ.కోటేశ్వరరావు, కృష్ణమోహన్,ఎఫ్‌ఏ–సీఏ రాఘవరెడ్డి పాల్గొన్నారు.
ఈయూ హర్షం
ఆర్టీసీ ఉద్యోగులకు రూ.1.10 కోట్ల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని అమలు చేయడంపట్ల ఈయూ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కృతజ్ఞతలు తెలిపింది.ఈమేరకు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.దామోదరరావు, జీవీ నరసయ్య ఓ ప్రకటన జారీ చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఇలా..
- ప్రమాద బీమా రూ.30 లక్షల నుంచి రూ.85 లక్షలకు పెంపు
- రూపే డెబిట్ కార్డ్ లింకేజీ ద్వారా రూ.10 లక్షలు
- కొత్త రూపే కార్డ్ ద్వారా మరో రూ.10 లక్షలు
- సహజ మరణానికి రూ.5 లక్షలు
- మొత్తం మీద రూ.1.10 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment