ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు మళ్లీ ఒప్పందం
ఎన్టీపీసీ పెట్టుబడులకు గత ఏడాది సీఎం జగన్ అధ్యక్షతన ఎస్‌ఐపీబీ ఆమోదం
ఈ ఏడాది ఫిబ్రవరి 24న సీఎస్ సమక్షంలో
ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్‌కు ఒప్పందం
తాజాగా అవే పెట్టుబడులకు మరోసారి..
పునరుత్పాదక రంగంలో రూ.1,87,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ సిద్ధం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)తో ఒప్పందం చేసుకుంటే.. సీఎం చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే సంస్థతో మరోసారి ఒప్పందం చేసుకున్నారు.
నిజానికి.. గత ఏడాది ఫిబ్రవరి 9న నాటి సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ).. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్ ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. అనంతరం.. ఈ ఏడాది ఫిబ్రవరి 24న సీఎస్ సమక్షంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్–రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కూడా జరిగింది. అయితే, ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పనులు ప్రారంభించలేదు. అలాగే,
అప్పట్లోనే ఎన్టీపీసీకి థర్మల్ పవర్ కోసం కేటాయించిన భూములను కూడా గ్రీన్ ఎనర్జీ కోసం కేటాయిస్తూ నాటి జగన్ ప్రభుత్వమే మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో.. గురువారం అదే ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీతో మళ్లీ ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్జీఈఎల్) మధ్య ఈ ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు రూ.1,87,000 కోట్లు ఎన్జీఈఎల్ పెట్టుబడి పెట్టనుందని ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీనిద్వారా రాష్ట్రంలో దాదాపు 1,06,250 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశముందని.. అలాగే, రానున్న 25 ఏళ్లలో దాదాపు రూ.20,620 కోట్ల లబ్ధి రాష్ట్రానికి చేకూరనుందని తెలిపింది.
పునరుత్పాదక విద్యుత్‌దే భవిష్యత్తు..
ఈ ఒప్పందం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా చేసే క్రమంలో ఇది కీలక అడుగన్నారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. భవిష్యత్తు అంతా పునరుత్పాదక విద్యుత్ రంగానిదేనని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్‌ను 2027 ఏప్రిల్ మే నాటికి పూర్తిచేయాలని సీఎం తెలిపారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 78.50 గిగావాట్ల సౌరశక్తి, 35 గిగావాట్ల పవన శక్తి, 22 గిగావాట్ల పంప్డ్ స్టోరేజీ, 1.50 ఎంఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ లక్ష్యంతో రాష్ట్ర ఇంధన మౌలిక అవసరాలు తీరడమే కాకుండా, రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందన్నారు.
ఈ ఒప్పంద కార్యక్రమంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎన్టీపీసి గ్రీన్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ గురుదీప్ సింగ్, ఎన్జీఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్. సారంగపాణి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment