ఫ్రెషర్లకు అత్యల్పంగా రూ. 2.52 లక్షల వార్షిక జీతం ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ దానిపై స్పష్టత ఇచ్చింది. ఆ వేతనం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు కాదని, సాధారణ డిగ్రీ హోల్డర్‌లకు మాత్రమేనని తాజాగా పేర్కొంది.
తాము ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు రూ. 4-12 లక్షల వేతనాన్ని అందిస్తున్నట్లు కాగ్నిజెంట్ వివరణ ఇచ్చింది. దీంతోపాటు తమ సంస్థలో ఉద్యోగులకు శాలరీ హైక్ మరీ తక్కువగా 1 శాతమే ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఎగతాళిపైనా కాగ్నిజెంట్ స్పందించింది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఇచ్చే వార్షిక ఇంక్రిమెంట్‌లలో 1-5 శాతం అనేది కనిష్ట బ్యాండ్ అని వివరించింది.
కాగ్నిజెంట్ ఏటా ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్/ఐటీ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్‌లను విభిన్న పాత్రల కోసం నియమించుకుంటుంది. ఈ రెండు రిక్రూట్‌మెంట్‌లు దాదాపు సమాంతరంగా నడుస్తుండటంతో మూడేళ్ల నాన్-ఇంజనీరింగ్/ఐటీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్‌ల నియామకానికి సంబంధించిన ఫ్రెషర్‌ల శాలరీ ప్యాకేజీ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది.
"నాన్ ఇంజినీరింగ్ నేపథ్యాల నుంచి 3-సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న ప్రతిభావంతుల కోసం చేసిన మా ఇటీవలి జాబ్ పోస్టింగ్ వక్రీకరణకు గురైంది. ఈ జాబ్ పోస్టింగ్‌లో ఉన్న రూ. 2.52 లక్షల వార్షిక పరిహారం మూడేళ్ల సాధారణ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు మాత్రమే. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం కాదు. ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు మా వార్షిక పరిహారం హైరింగ్, స్కిల్ సెట్, అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రీ అక్రెడిటెడ్ సర్టిఫికేషన్‌ల కేటగిరీని బట్టి సంవత్సరానికి రూ. 4 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుంది" అని కాగ్నిజెంట్ అమెరికాస్ ఈవీపీ, ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment