ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ఐటీలో మళ్లీ జోష్ పెరిగింది. గత మూడేళ్లుగా కొంత స్తబ్దుగా ఉన్న ఐటీ కంపెనీలు తాజాగా నియామకాల జోరు పెంచాయి. నాలుగేళ్ల క్రితం ఐఐటీ విద్యార్థులకు రూ.కోటి అంతకంటే ఎక్కువ వేతనాలు ఆఫర్ చేసిన మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, గోల్డ్‌మెన్‌శాక్స్ వంటి అమెరికన్ కంపెనీలు ప్రతిభావంతుల కోసం మన ఐఐటీల ముందు క్యూ కట్టాయి. సగటున రూ.కోటి వార్షికవేతనం ఇస్తామని ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థి ప్రతిభను బట్టి గరిష్టంగా రూ.1.40 కోట్లు, కనిష్టంగా రూ.41 లక్షలు ఇస్తామని పేర్కొంటున్నాయి. అలాగే మొదటిసారిగా అమెరికాకు చెందిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్, సిటీ గ్రూప్, పేపాల్ వంటి సంస్థలు ఐఐటీ, ఎన్‌ఐటీ, ప్రముఖ కాలేజీల్లో ప్లేస్‌మెంట్లకు రావడం విశేషం. ఒక్కో విద్యార్థికి ఒకేసారి ఐదారు ఉద్యోగావకాశాలు కూడా వస్తు న్నాయి. జూలై మొదటి వారంలో ప్రారంభమైన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ జోరు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఐఐటీలు, నిట్‌లు మాత్రమే కాకుండా మంచి ర్యాంకింగ్ కలిగి ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ నియామకాల ప్రక్రియ ఊపందుకుంది. గత మూడేళ్లుగా పాక్షిక నియామకాలకు పరిమితమైన ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, టీసీఎస్, క్యాప్ జెమినీ, యాక్సెంచర్ వంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగుల నియామకానికి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి.
ఐఐటీ వారణాసి విద్యార్థికి 1.52 కోట్ల వార్షిక వేతనం
ఈ ఏడాది ఐఐటీ విద్యార్థుల పంట పండింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ వారణాసి (బీహెచ్‌యూ) విద్యార్థికి ఒక కంపెనీ రూ.1.52 కోట్ల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. ఈ సంస్థ ఇంకా అధికారికంగా విద్యార్థి, కంపెనీ పేరు వెల్లడించలేదు. మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మెన్‌శాక్స్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జోమాటో, ఫేస్‌బుక్ వంటి కంపెనీలు ఈ ఐఐటీ విద్యార్థులకు ఉద్యోగాలు ఆఫర్ చేశాయి. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఓ విద్యార్థికి అత్యధికంగా (ఇప్పటివరకూ) రూ.1.5 కోట్ల వార్షిక వేతనాన్ని ఓ కంపెనీ ఆఫర్ చేసింది. ఈ ఐఐటీలో ఆదిత్య బిర్లా, అబోడ్, అమెజాన్, క్యాటర్ పిల్లర్, మారుతీ సుజుకీ సంస్థలు విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. ఐఐటీ రూర్కీలోనూ ఓ విద్యార్థికి ప్రపంచ ప్రసిద్ది గాంచిన కంపెనీ రూ.1.5 కోట్ల వేతనాన్ని ఆఫర్ చేసింది. ఈ ఐఐటీలో గూగుల్, మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మెన్‌శాక్స్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, వాల్‌మార్ట్ సంస్థలు ఉద్యోగాలు ఆఫర్ చేశాయి. ఐఐటీ ముంబైలో విద్యార్థులను నియమించుకోవడానికి 15 కంపెనీలు పోటీ పడ్డాయి. ఇక్కడ ఇప్పటివరకూ ఒక విద్యార్థికి గరిష్టంగా రూ.140 కోట్ల ఆఫర్ లభించింది. మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మెన్‌శాక్స్, మెకెన్సీ నాలెడ్జ్ సెంటర్, టాటా స్టీల్, ఈసీ జపాన్, ఐబీఎం, ఉబర్ వంటి సంస్థలు ఇందులోని విద్యార్థులను ఎంచుకున్నాయి.
నిట్ విద్యార్థులకూ భారీ ఆఫర్లు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన (నిట్, న్యూఢిల్లీ) విద్యార్థికి ఓ కంపెనీ రూ.1.24 కోట్ల మేర వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. ఈ సంస్థలోని విద్యార్థులను నియమించుకోవడానికి మెకెన్సీ అండ్ కంపెనీ, జబాంగ్.కామ్, ఆర్‌ఐఎల్, జనరల్ మోటార్స్, ఈబే, సిటీ గ్రూప్ పోటీ పడ్డాయి. దక్షిణాది నిట్‌లలో అగ్రస్థానంలో ఉండే తిరుచిరాపల్లి నిట్ విద్యార్ధికి రూ.89.5 లక్షల వార్షిక వేతనం ఆఫర్ లభించింది. తోషిబా, ఫ్లిప్‌కార్ట్, టాటా మోటార్స్, ఎర్నెస్ట్ అండ్ ఎంగ్ వంటి కంపెనీలు ఇక్కడ పోటీ పడ్డాయి. ఇక మోతీలాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (నిట్, అలహాబాద్) విద్యార్థుల్లో దాదాపు 55 మందికి రూ.25.5 లక్షల వార్షిక వేతనం లభించింది. ఇక్కడ విద్యార్థులను నియమించుకోవడానికి ఎల్ అండ్ టీ, ఏబీబీ లిమిటెడ్, హీరో మోటార్స్, బ్లూస్టార్ సంస్థలు ఉత్సాహం కనబరిచాయి. సూరత్‌కల్‌లోనూ దాదాపు 100 మంది విద్యార్థులకు రూ.29.15 లక్షల మేర వార్షిక వేతనాన్ని కంపెనీలు ఆఫర్ చేశాయి.
హైదరాబాద్‌లో 5వేల మందికి అవకాశాలు
ఈ ఏడాది హైదరాబాద్‌లో దాదాపు 5వేల మంది విద్యార్థులకు క్యాంపస్ నియామకాలు, జాబ్ మేళాల ద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయని నాస్కామ్ (దక్షిణ భారత) డైరెక్టర్ ఒకరు వెల్లడించారు. మునుపెన్నడూ లేని విధంగా అనేక బహుళజాతి కంపెనీలు ద్వితీయ శ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ నియామకాల ప్రక్రియ చేపడుతున్నాయని ఆయన వెల్లడించారు. సీబీఐటీ హైదరాబాద్ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ రూ.41 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేసింది. జేపీ మోర్గాన్ చేజ్ కంపెనీ ఈ కాలేజీలో 40 మందికి పైగా విద్యార్థులకు భారీ వేతనాలను ఆఫర్ చేసింది. ఈ ఏడాది పెద్ద ఎత్తున కంపెనీలు రానున్నాయని, విద్యార్థులకు భారీ ఎత్తున అవకాశాలు ఉంటాయని, కంపెనీల నుంచి నియామక తేదీలు కావాలంటూ లేఖలు వస్తున్నాయని సీబీఐటీ ప్లేస్‌మెంట్ అధికారి డాక్టర్ ఎన్‌ఎల్‌ఎన్ రెడ్డి తెలిపారు. గత మూడు నాలుగేళ్లుగా టాప్ టెన్ కాలేజీల్లో నియామకాలకు మాత్రమే పరిమితమైన ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, యాక్సెంచర్ వంటి కంపెనీలు ఈ ఏడాది ద్వితీయ శ్రేణి కాలేజీల్లో నియామకాలకు ప్లాన్ చేసుకుంటున్నాయి.
ఈ ఏడాది హైదరాబాద్‌లో దాదాపు 5వేల మంది విద్యార్థులకు క్యాంపస్ నియామకాలు, జాబ్ మేళాల ద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయని నాస్కామ్ డైరెక్టర్ వెల్లడించారు. సీబీఐటీ హైదరాబాద్ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ రూ.41 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేసింది. జేపీ మోర్గాన్ చేజ్ కంపెనీ ఈ కాలేజీలో 40 మందికి పైగా విద్యార్థులకు భారీ వేతనాలను ఆఫర్ చేసింది. కంపెనీల నుంచి నియామక తేదీలు కావాలంటూ లేఖలు వస్తున్నాయని సీబీఐటీ ప్లేస్‌మెంట్ అధికారి డాక్టర్ ఎన్‌ఎల్‌ఎన్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment