పరిశ్రమల స్వర్గధామం ఏపీ  | Andhra Pradesh is a haven for Industries | Sakshi
Sakshi News home page

పరిశ్రమల స్వర్గధామం ఏపీ 

Published Sat, Aug 3 2019 3:39 AM | Last Updated on Sat, Aug 3 2019 3:39 AM

Andhra Pradesh is a haven for Industries - Sakshi

పారిశ్రామిక వేత్తలకు మంజూరు పత్రాలను అందజేస్తున్న మంత్రి గౌతంరెడ్డి, ఆర్‌కే రోజా

యూనివర్సిటీ క్యాంపస్‌: ‘పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ స్వర్గధామం. లంచాలకు తావు లేకుండా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తాం. పెట్టుబడులతో ముందుకొస్తే అవసరమైన అనుమతులను వెంటనే ఇస్తాం’ అని రాష్ట్ర మంత్రులు, ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తిరుపతి ఎస్వీయూ సెనేట్‌ హాల్‌లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అనే అంశంపై చిత్తూరు జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ.. పారిశ్రామిక చట్టం సవరణలో భాగంగా మరికొన్ని సంబంధిత శాఖలను సింగిల్‌ డెస్క్‌ పోర్టల్లోకి తీసుకొస్తామన్నారు. ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమల స్థాపనకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. సామాజిక బాధ్యతతో పారిశ్రామిక రంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామని వివరించారు. పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం తగ్గించేందుకు పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తున్నామన్నారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా త్వరితగతిన పారిశ్రామిక అనుమతులు మంజూరు చేయడంతో పాటు వారికి అవగాహన కల్పించేందుకు ప్రతినెలా సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీఐఐసీ కింద జిల్లాలో నాలుగువేల ఎకరాల భూమి ఉందని, వచ్చే ఏడాది కల్లా పరిశ్రమల పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌.కె.రోజా అధికారులకు సూచించారు. చెన్నై పోర్టు, కృష్ణపట్నం పోర్టు, చెన్నై ఎయిర్‌పోర్టు జిల్లాకు సమీపంలో ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనన్ని పరిశ్రమలు స్థాపిస్తే ఉద్యోగాల విప్లవం తీసుకురావచ్చన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి రజిత్‌ భార్గవ్‌ మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా ఏఏ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందో ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిమూలం, వెంకటేగౌడ, శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. విద్యుత్‌ బిల్లులు తగ్గించి, పరిశ్రమలకు మేలు చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చక్కగా ప్రయత్నిస్తున్నారని పలువురు పారిశ్రామికవేత్తలు కొనియాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement