రావత్ అవుట్.. మిశ్రాపై సీఎస్ సీరియస్
♦ రాయితీల కుంభకోణంలో కీలక మలుపు
♦ పరిశ్రమలశాఖ కొత్త కమిషనర్‌గా సాల్మన్
♦ మిశ్రాను వివరణ కోరిన చీఫ్ సెక్రటరీ
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల శాఖ కొత్త కార్యదర్శిగా సాల్మన్ ఆరోఖ్యరాజ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ పోస్టులో ఉన్న షంషేర్‌సింగ్ రావత్‌ను తప్పించారు. పారిశ్రామిక రాయితీల వ్యవహారంలో అవకతవకలు వెలుగుచూసిన నేపథ్యంలో జరిగిన ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. రూ.2,045 కోట్ల రాయితీల్లో దాదాపు రూ.100 కోట్ల మేర పక్కదారి పట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకూ రూ.10 కోట్లు గుర్తించారు. పరిశ్రమల శాఖ కమిషనరేట్‌లో పనిచేస్తున్న అధికారి ఇండస్ట్రీస్ డెరైక్టర్ పేరుతో షాడో అకౌంట్ తెరిచారు.దారిమళ్లిన రాయితీలు ఇదే అకౌంట్‌కు రావడంతో విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
అధికార పార్టీలోని కొంతమంది ముడుపులు తీసుకుని, అడ్డగోలుగా రాయితీలు ఇచ్చినట్టు విమర్శలొచ్చాయి. ఫలితంగా ప్రభుత్వాధినేతకు రూ.కోట్లను పారిశ్రామిక వేత్తలు ముట్టజెప్పినట్టు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో లేని పరిశ్రమలకు, అర్హతలేని యూనిట్లకు రాయితీలు ఇవ్వడం విచారణలో వెలుగుచూసింది. దీనిపై గురువారం లోక్‌సత్తా పార్టీ నేతలు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ తంతు వెనుక పరిశ్రమల శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు ప్రమేయం ఉందని, సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ నేపథ్యంలో రావత్ బదిలీ కావడం, ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టడం గమనార్హం. ఇదిలా ఉంటే, పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రాను ఈ గోల్‌మాల్‌పై సీఎస్ శుక్రవారం వివరణ కోరినట్టు సమాచారం.