![First desalination plant in Krishnapatnam Leather Park - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/5/DESAALINATION.jpg.webp?itok=ROO1mLGM)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పారిశ్రామిక అవసరాలకు సముద్రపు నీటిని శుద్ధి (డీశాలినేషన్) చేసి వినియోగించుకోవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలి డీశాలినేషన్ ప్లాంట్‌ను కృష్ణపట్నం మెగా లెదర్ క్లస్టర్‌లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. లెదర్ పార్కులో ఏర్పాటు చేసే యూనిట్లకు నీటి వినియోగం అధికంగా ఉండటంతో ఒక్క చుక్క నీటిని కూడా భూగర్భజలాల నుంచి వినియోగించకుండా పూర్తిగా సముద్రపు నీటినే వినియోగించే విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 536.88 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ మెగా లెదర్ క్లస్టర్‌కు రోజుకు 10.5 మిలియనలీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా.
ఇందుకోసం రోజుకు 90 మిలియన్ లీటర్లకు పైగా సముద్రపు నీటిని శుద్ధిచేయాల్సి ఉంటుంది. ఇలా శుద్ధి చేయగా వచ్చిన మంచినీటిని వినియోగించి మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలేస్తారు. తొలిదశలో 386.88 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ క్లస్టర్‌కు రోజుకు 3.5 మిలియన్ లీటర్ల నీరు అవసరవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం 30.5 మిలియన్ లీటర్ల సముద్రపు నీటిని శుద్ధిచేయాల్సి ఉంటుంది. డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ.70 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నామని, దీనికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని కృష్ణపట్నం లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్ అధికారులు తెలిపారు.
నాలుగు పైసలకే లీటరు నీరు అందుబాటులోకి
డీశాలినేషన్ విధానంలో పరిశ్రమలకు కారుచౌకగా నాలుగు పైసలకే లీటరు నీరు అందించవచ్చని, తీరప్రాంతంలో ఏర్పాటు చేసే యూనిట్లకు ఈ విధానంలో నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని 2019 ఆగస్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇజ్రాయేల్ పర్యటన సందర్భంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రంలో డీశాలినేషన్ విధానంలో సముద్రపు నీటిని వినియోగించుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం అందించేలా ఇజ్రాయేల్‌కు చెందిన ఐడీఈ టెక్నాలజీస్‌తో ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకుంది.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు డీశాలినేషన్ ద్వారా నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాల కోసం సముద్రపు నీటిని వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పరిశ్రమలశాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యం తెలిపారు. ఇందులో భాగంగా తొలుత కృష్ణపట్నం లెదర్ పార్క్‌లో డీశాలినేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment