పేద దళిత రైతుల నోట్లో సర్కారు మన్ను | Government shock to Poor Dalit farmers | Sakshi
Sakshi News home page

పేద దళిత రైతుల నోట్లో సర్కారు మన్ను

Published Mon, Apr 25 2016 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

పేద దళిత రైతుల నోట్లో సర్కారు మన్ను

పేద దళిత రైతుల నోట్లో సర్కారు మన్ను

♦ పరిశ్రమల కోసం అసైన్డ్ భూములు కారు చౌకగా కొట్టేసే వ్యూహం
♦ ప్రాథమిక విలువ చెల్లించడానికి జీవో 155 జారీ
 
 సాక్షి, హైదరాబాద్: పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల ప్రయోజనాలకు పెద్దపీటవేస్తోంది. పేద దళితులకు చెందిన అసైన్డ్ భూములను లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వారి నోట్లో మట్టి కొట్టి పారిశ్రామికవేత్తలకు ఆ భూములు కట్టబెట్టడానికి తాజాగా ఓ జీవో తెచ్చింది. పేదల నుంచి భూములు గుంజుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)ని పెద్ద దళారీగా వినియోగించుకుంటోంది. బలవంతపు సేకరణవల్ల భూమి కోల్పోయే వారికి న్యాయమైన పరిహారం కూడా ఇవ్వకుండా ప్రాథమిక (బేసిక్) విలువ ఇచ్చి సరిపెట్టాలని చూస్తోంది.

అసైన్డ్, పేదలు అనుభవిస్తూ ఉన్న (ఆక్రమిత ప్రభుత్వ) భూముల సేకరణకు ఏపీఐఐసీ ప్రాథమిక విలువ మాత్రం చెల్లిస్తే సరిపోతుందంటూ తాజాగా సర్కారు జీవో 155 జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం (2015-20)లో భాగంగా 10 లక్షల ఎకరాలతో ల్యాండ్‌బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నామమాత్రపు పరిహారంతో పేదల నుంచి భూములు లాక్కునేందుకు ఈ జీవో జారీ చేసిందనే విషయం తెలుస్తోంది.

ప్రజావసరాల కోసం అసైన్డ్ భూములను సేకరించినా అసైనీలకు న్యాయమైన పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ చట్టం చెబుతోంది. మార్కెట్ విలువ ప్రకారమే అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాలని గతంలో జారీ చేసిన జీవో 571లో కూడా స్పష్టంగా ఉంది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారి నుంచి ఆ భూమిని సేకరించినా మార్కెట్ విలువ ప్రకారమే అనుభవదారులకు పరిహారం చెల్లించాలని ఆ జీవోలో ఉంది. అయినా దీనికి విరుద్ధంగా అసైన్డ్, ప్రభుత్వ ఆక్రమిత భూముల సేకరణకు ప్రాథమిక విలువ మాత్రమే ఏపీఐఐసీ చెల్లిస్తుందని ఈనెల 19న ప్రభుత్వం జీవో 155 జారీ చేసింది.

 నష్టపోయేది పేద దళితులే..
 బేసిక్ విలువ అనే ముద్దుపేరుతో బిక్ష వేసి అసైనీలు, అనుభవదారుల నుంచి భూమిని ఏపీఐఐసీ బలవంతంగానైనా సేకరించవచ్చంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో అత్యంత దుర్మార్గమైనదని రెవెన్యూ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. న్యాయబద్ధమైన పరిహారం చెల్లించాలనే కేంద్ర చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా ఈ ఉత్తర్వు ఉందని రెవెన్యూ శాఖలో రిటైరైన ఒక ఐఏఎస్ అధికారి చెప్పారు. ‘‘బహిరంగ మార్కెట్ విలువపై గిరిజన ప్రాంతాల్లో అయితే 1.5 రెట్లు, షెడ్యూలేతర ప్రాంతాల్లో అయితే 1.25 రెట్లు అధికంగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం చెబుతోంది.

అంటే.. ఉదాహరణకు ఎకరా మార్కెట్ విలువ రూ. లక్ష ఉంటే గిరిజన ప్రాంతాల్లో రూ. 2.50 లక్షలు, గిరిజనేతర ప్రాంతాల్లో రూ. 2.25 లక్షలు పరిహారం చెల్లించాలి. దీనికి అదనంగా 12 శాతం కూడా ఇవ్వాలి. పైగా కేంద్ర ప్రభుత్వం చేసిన ఎల్‌ఏఆర్‌ఆర్ చట్టం ప్రకారం చేయాల్సిన నష్ట పరిహారం పునరావాస ప్యాకేజీలను తగ్గించి రాష్ట్రం పైప్యాకేజీలు అమల్లోకి తెచ్చింది. బేసిక్ విలువ అనేది రిజిస్ట్రేషన్ శాఖ ఫీజుల వసూలు కోసం నిర్ణయించిన మార్కెట్ ధర. ఇది వాస్తవంగా బహిరంగ మార్కెట్ విలువలో పదో వంతు మాత్రమే ఉంటుంది. అందువల్ల బేసిక్ విలువ చెల్లించి పేదలకు చెందిన అసైన్డ్, వారు అనుభవిస్తున్న భూములు లాక్కోవడమంటే వారి కడుపు కొట్టడమే.

అసైన్డ్ భూములున్న వారిలో పేద దళితులే ఎక్కువ. అందువల్ల ఈ జీవో ప్రకారం భూములు లాక్కుంటే ఎక్కువగా నష్టపోయేది ఆ దళితులే’’ అని ఆ రిటైర్డు ఐఏఎస్ అధికారి వివరించారు. పెపైచ్చు జీవో 571కి సవరణలు చేసేందుకు ప్రభుత్వం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏడాది క్రితం నియమించింది. ఆ ఉప సంఘం నివేదిక ఇంకా సమర్పించక ముందే జీవో 571కి సవరణ చేస్తూ జీవో 155ను జారీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనదని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

 ఎందుకివ్వాలి?
 ఏ సంస్థ అయినా తమ వ్యాపార ప్రయోజనాల కోసమే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. వ్యాపారమో, పారిశ్రామిక కార్యకలాపాల కోసమో వచ్చే సంస్థలకు నామమాత్రపు ధరకో లేదా ఉచితంగా భూములు ఎందుకు ఇవ్వాలి? పెపైచ్చు పారిశ్రామిక సంస్థలకు అప్పనంగా కట్టబెట్టేందుకు పేదల నుంచి అసైన్డు భూములు ఎందుకు లాక్కోవాలి? ఏపీఐఐసీని ఇందుకు పెద్ద దళారీగా పెట్టి పది లక్షల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏమిటి? ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాలు లేకపోతే పేదల పొట్టకొట్టేలా పది లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు ప్రతిపాదన ఎందుకు? అని రాజకీయ, అధికార వర్గాలు గట్టిగా ప్రశ్నిస్తున్నాయి.
 
 ఎవరి ప్రయోజనాల కోసం?
 మార్కెట్ విలువ చెల్లించి సేకరించిన భూములను పారిశ్రామిక సంస్థలు తీసుకుంటే వాటికి భారమవుతుందని ఏపీఐఐసీ భావించింది. అందువల్ల బేసిక్ విలువకే అసైన్డ్, పేదల భూములను వారికి ఇవ్వాలని ఏపీఐఐసీ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. అంటే ప్రభుత్వానికి పేదల ప్రయోజనాలు ముఖ్యమా? పారిశ్రామిక సంస్థలకు లబ్ధి చేకూర్చడం ప్రాధాన్యమా? అని విపక్షాలతోపాటు అధికార వర్గాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. పేదల భూములు లాక్కుని పారిశ్రామిక సంస్థలకు కారుచౌకగానో లేక ఉచితంగానో భూములు కట్టబెట్టాలని కుట్ర పన్నడం దారుణమని ఆ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇలా భూములు కట్టబెట్టడం వెనుక ప్రభుత్వ పెద్దల స్వార్థం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు, ప్రజల ఆస్తులకు గండిపడేలా టీడీపీ సర్కారు గత కొంతకాలంగా తీసుకున్న నిర్ణయాలు ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. పారిశ్రామిక సంస్థలకు మేలు చేకూర్చే భూముల గరిష్ట లీజు పరిమితిని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇందుకు నిదర్శనం. లీజు పెంపుతో పాటు పారిశ్రామిక సంస్థలకు కేటాయించిన భూములు విక్రయించుకునేలా పూర్తి యాజమాన్య హక్కు కల్పిస్తూ  జీవో ఇవ్వడం మరో నిదర్శనం.
 
 అమ్మో.. పరిశ్రమల శాఖ
 ప్రభుత్వం అస్మదీయులకు ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు, భూములు కట్టబెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ఆ మేరకే ఉత్తర్వులు మీద ఉత్తర్వులు జారీ చేస్తోంది. వీటిపై ఎవరైనా కోర్టుకు వెళితే.. భవిష్యత్‌లో ప్రభుత్వాలు విచారణకు ఆదేశించినా ఇబ్బందులు తప్పవని ఉన్నతాధికారులు భయపడుతున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారు. ఆ స్థానంలో నియమించేందుకు ఇద్దరు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను సంప్రదించగా.. అక్కడ నియమిస్తే తాము సైతం దీర్ఘకాలిక సెలవుపై వెళ్తామని స్పష్టీకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement