ముంబై: దేశీయంగా ఆటో అమ్మకాలు జూలైలో నెమ్మదించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ కంపెనీల విక్రయాలు ఒక అంకె వృద్ధికి పరిమితమయ్యాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం జూలైలో మొత్తం 1,75,916 వాహనాలను విక్రయించగా, జూలైలో ఈ సంఖ్య స్వల్పంగా 3% పెరిగి 1,81,630 యూనిట్లకు చేరింది. ‘‘ఈ జూలైలో మా ఎస్‌యూవీ అమ్మకాలు 42,620 యూనిట్లు. కేరళ ఓనమ్ పండుగ(ఆగస్టు 28)తో ప్రారంభం కానున్న పండుగ సీజన్ నుంచి ఆటో పరిశ్రమ అమ్మకాల్లో వృద్ధి ఆశించవచ్చు’’ అని కంపెనీ మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ జూలైలో 66,701 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే ఏప్రిల్‌లో అమ్మిన 63,851 వాహనాలతో పోలిస్తే నాలుగు శాతం అధికం. ‘‘స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యూవీ) వాహనాలకు డిమాండ్ లభించడంతో జూలైలో దేశీయంగా 60 వేలకు పైగా అమ్మకాలను సాధించగలిగాము’’ అని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు.
♦ టాటా మోటార్స్ స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది జూలైలో 81,790 వాహనాలకు విక్రయించగా.., ఈ జూలైలో నాలుగుశాతం క్షీణతతో 80,633 యూనిట్లకు పరిమితమయ్యాయి.
♦మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో 18% వృద్ధి సాధించింది. గతేడాది జూలైలో మొత్తం 56,148 యూనిట్లకు విక్రయించగా, ఈ జూలైలో 66,124 వాహనాలను అమ్మింది. ముఖ్యంగా ప్యాసింజర్ విభాగంలో 29 శాతం వృద్ధిని నమోదు చేసింది.
♦ ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. బజాజ్ ఆటో(10% క్షీణత) మినహా రాయల్ ఎన్‌ఫీల్డ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 32%, 12%, 4% చొప్పున పెరిగాయి.
♦ మొత్తంగా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 3% స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. ఈ జూలైలో వీటి విక్రయాలు 3,52,492 యూనిట్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment