ఆర్.కృష్ణయ్యను ప్రశ్నించిన సిట్
► నయీమ్ కేసులో దాదాపు
గంటపాటు విచారించిన అధికారులు
► సాక్షిగానే పిలిచారన్న ఆర్.కృష్ణయ్య
► ఈ కేసులో ఓ రాజకీయ నేతను
విచారణకు పిలవడం ఇదే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సంబంధించి కేసులో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను సిట్ విచారించింది. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీస్‌స్టేషన్ కు కృష్ణయ్యను పిలిపించిన అధికారులు.. దాదాపు 55 నిమిషాల పాటు ఆయనను ప్రశ్నించారు. నయీమ్‌తో సంబంధాలపై ఆరా తీశారు. అయితే నయీమ్ వ్యవహారంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ సహా ఎంతో మంది రాజకీయ నాయకులపై ఆరోపణలు వచ్చినా.. పోలీసులు ఎవరినీ పిలిపించిన దాఖలాలు లేవు. ఈ కేసులో తొలిసారిగా ఓ రాజకీయ నేతను పిలిచి ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దర్యాప్తు వేగవంతం:
నయీమ్ కేసు చార్జిషీట్ దాఖలుకు సమయం సమీపిస్తుండటంతో సిట్ బృందం దర్యాప్తు వేగవంతం చేసింది. నిబంధనల ప్రకారం ఈ నెల ఎనిమిదిన చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. దీంతో నయీమ్‌తో సంబంధాలున్నట్టుగా భావిస్తున్న వారిని నేరుగా పిలిచి, విచారించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే బుధవారం ఆర్.కృష్ణయ్యను నార్సింగి పోలీస్‌స్టేషన్ కు పిలిపించింది. అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీ ఆనంద్‌కుమార్, ఏసీపీ జయ్‌పాల్‌లతో కూడిన సిట్ బృందం దాదాపు 55 నిమిషాల పాటు ప్రశ్నించింది. అయితే కృష్ణయ్య కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ.. నయీమ్ తనకు తెలుసని, తనను గురువుగా భావించేవాడని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం. అయితే తాను ప్రజా నాయకుడినని, వివిధ పనుల కోసం తన వద్దకు ఎంతో మంది వస్తుంటారని.. అలాగే నయీమ్ కూడా వచ్చాడని కృష్ణయ్య చెప్పినట్లు తెలిసింది. నయీమ్‌తో దందాలు చేసినట్టు ఆధారాలేమైనా ఉంటే తనకు నోటీసులిచ్చి, ప్రశ్నించాలని పేర్కొన్నట్లు తెలిసింది.
సాక్షిగానే పిలిచారు: ఆర్.కృష్ణయ్య
నయీమ్ కేసు విషయంలో తనను పోలీసులు సాక్షిగానే పిలిచారని విచారణ అనంతరం ఆర్.కృష్ణయ్య మీడియాకు చెప్పారు. పోలీసులు తనకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదని, కేవలం ఫోన్ సమాచారంతోనే వచ్చానని తెలిపారు. తాను గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలు అడిగారని, తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పానని పేర్కొన్నారు. పోలీసులు తనను అడిగిన ప్రశ్నల కంటే... తానే పోలీసులను ఎక్కువ ప్రశ్నలు అడిగానన్నారు. నయీమ్ ఎదురులేకుండా అన్ని వ్యవస్థలను చేతుల్లోకి తీసుకున్న సమయంలో ప్రభుత్వం, పోలీస్ శాఖ ఏం చేసిందని నిలదీశానని చెప్పారు.