ఆర్.కృష్ణయ్యను ప్రశ్నించిన పోలీసులు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను పోలీసులు బుధవారం విచారించారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన కృష్ణయ్యను సిట్ ఐజీ నాగిరెడ్డి ప్రశ్నించారు. గంటపాటు విచారణ కొనసాగింది. మాదాపూర్ భూమి వివాదం సెటిల్ మెంట్ పై ప్రశ్నించినట్టు సమాచారం. నయీం తనకు తెలుసునని గతంలో కృష్ణయ్య చెప్పారు. తనను నయీం గురువుగా భావించేవాడని, అతడి దందాలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
నయీమ్‌తో సంబంధాలున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో కృష్ణయ్య అప్పట్లో స్పందించారు. ‘‘నయీమ్ 1986లో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో ఉన్నప్పట్నుంచే నా వద్దకు వచ్చేవాడు. విద్యార్థి సంఘాలతో కలసి చేసే ఉద్యమాలకు నేను నాయకత్వం వహించేవాడిని. అప్పట్నుంచే నయీమ్ నాకు శిష్యుడయ్యాడు. నన్ను గురువుగా భావించేవాడు. కానీ ఆ తర్వాత కార్యక్రమాలకు నాకు సంబంధం లేదు. గుడికి పోయే వాళ్లు ఎవరు, ఏంటని చూడనట్టే.. సమస్యలపై నా దగ్గరికి వచ్చే వాళ్లను కూడా నేను వ్యక్తిగత విషయాలు అడగను’’ అని ఆర్.కృష్ణయ్య అన్నారు.