నయీం కేసు: నేతి విద్యాసాగర్ వాంగ్మూలం
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ స్టేట్ మెంట్ ను ఆదివారం సిట్ అధికారులు నమోదు చేశారు. భువనగిరి వ్యాపారి నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిట్ విచారణ చేపట్టింది. సుమారు 3 గంటల పాటు విద్యాసాగర్ ను విచారించినట్టు తెలిసింది. నయీంతో తనకెలాంటి సంబంధం లేదని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే నయీంతో ఆయన వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టు సిట్ దగ్గర ఆధారాలు ఉన్నట్టు సమాచారం. నయీం భార్య ఫర్హానాతో కలిసి విద్యాసాగర్ భూమి కొన్నట్టు సిట్ అధికారులు సాక్ష్యాలు సేకరించినట్టు తెలుస్తోంది.
నయీమ్ కేసులో ఇప్పటివరకు 197 కేసులు నమోదు చేసి, 125 మందిని అరెస్ట్ చేశామని సిట్ చీఫ్ గత నెలలో తెలిపారు. 330 మందిని పీటీ వారెంట్‌పై విచారించామని, 107 మంది పోలీస్ కస్టడీలోనే ఉన్నారన్నారు. 878 సాక్షులను విచారించామని, 18 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేసినట్టు చెప్పారు. త్వరలోనే మిగతా కేసుల్లోనూ చార్జిషీట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.