నయీమ్ ముఠా.. 24 హత్యలు
- అందులో నాలుగు సహజ మరణాలట!
- తప్పుడు పోస్ట్‌మార్టమ్ నివేదికలు ఇచ్చిన ప్రభుత్వ డాక్టర్లు
- వైద్యులకు నోటీసులు జారీ చేసి విచారించనున్న సిట్
- రాజకీయ నేతలు, అధికారుల భూదందాపై కన్ను
- వారి భూముల వివరాలివ్వాలంటూ రిజిస్ట్రేషన్ల శాఖ డీజీకి సిట్ చీఫ్ లేఖ
- అసెంబ్లీ సమావేశాల్లోపే కేసును కొలిక్కి తెచ్చే యత్నం
- పొలిటికల్ లింకులను ఛేదించేందుకు మరో రెండు బృందాలు
సాక్షి, హైదరాబాద్: నరహంతక నయీమ్ ముఠా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 24 మందిని హతమార్చింది! ఇందులో కొన్ని హత్యలను పథకం ప్రకారం సహజ మరణాలుగా చిత్రీకరించారు. ప్రభుత్వ వైద్యులే ఇలా తప్పుడు రిపోర్టులు ఇచ్చినట్లు వెల్లడైంది. నయీమ్ కేసులపై సిట్ చేస్తున్న దర్యాప్తులో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు పోలీస్, పొలిటికల్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మీడియా విభాగాలతో నయీమ్‌కు సంబంధాలున్నట్టు తేలింది.
తాజాగా ప్రభుత్వ వైద్యులు సైతం ఈ ముఠాకు సహకరించినట్టు ఆధారాలు లభ్యమవడంతో కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్లయింది. నయీమ్ చేసిన దారుణ హత్యలను సహజ మరణాలుగా చూపించి ప్రభుత్వ డాక్టర్లు సైతం అందరి కళ్లు గప్పినట్టు సిట్ గుర్తించింది.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారంతోపాటు ఇతర ఆధారాల ప్రకారం నయీమ్ ముఠా 24 మందిని హతమార్చినట్టు లెక్కతేలింది. వీటిలో నాలుగు హత్యలకు సంబంధించి డాక్టర్లు.. పోస్టుమార్టం రిపోర్టును తప్పుడుగా ఇచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
ఈ హత్యలను కూడా సహజ మరణాలంటూ నివేదిక ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఆ డాక్టర్లకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ బృందం సన్నద్ధమైంది. తప్పుడు నివేదికలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? నయీమ్ ముఠా ఏమైనా బెదిరించిందా..? అన్న వివరాలు రాబట్టేందుకు డాక్టర్లను సైతం విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.
వారి లావాదేవీల వివరాలివ్వండి..
నయీమ్ ముఠాను అడ్డుపెట్టుకొని భూ లావాదేవీలతోపాటు ఆస్తులు కూడబెట్టిన పోలీసు అధికారులు, రాజకీయ నేతలపై సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వారికి సంబంధించిన భూముల వివరాలు అందించాలంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీజీకి లేఖ రాసింది. నయీమ్‌తో సంబంధాలున్నట్లు తేలిన అధికారులు, నేతలకు సంబంధించిన భూముల వివరాలను అందించాలని ఈ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. నయీమ్ కనుసన్నల్లో 7 జిల్లాల్లో దౌర్జన్యంగా భూములు లాక్కోవడం, కబ్జాలు, బలవంతపు రిజిస్ట్రేషన్లు సాగినట్టు విచారణలో తేలింది.
200కి పైగా బాధితులు ఇప్పటికే నయీమ్‌పై ఫిర్యాదు చేశారు. వీటిలో ఎక్కువ భూ బాగోతాలే. వీటిని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు సిట్.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ సాయం కోరింది. ఈ మేరకు సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన ్లశాఖ ఐజీకి లేఖ రాశారు. నయీమ్ సహకారంతో భూ కబ్జాలకు పాల్పడిన వారిపై సిట్ నిఘా పెట్టింది. కాగా, బాధితులు అందజేసిన ఆధారాలు, విచారణలో లభ్యమైన ఎలక్ట్రానిక్ వస్తువులను పరిశీలన కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపించారు.
త్వరలో నేతల లింకుల వెల్లడి
నయీమ్ కేసును సిట్ సీరియస్‌గా తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ కేసు దర్యాప్తును కొలిక్కి తేవాలని యోచి స్తోంది. పొలిటికల్ లింకులను ఛేదించడం కోసం ప్రత్యేకంగా మరో 2 బృందాలను రంగంలోకి దించింది. నయీమ్‌ను అడ్డు పెట్టుకొని రాజకీయ నేతలు పెద్దఎత్తున లాభపడినట్లు విచారణలో వెలుగు చూసింది. నయీమ్ డైరీలో.. నాయకులకు చేసిన ‘ప్రత్యేక’ సహాయాలను పొందుపరిచినట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లోనూ పలువురు నేతల పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన బాధితుడి ఫిర్యాదులో ఓ ఎమ్మెల్సీ పేరు ఏకంగా ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు. దీంతో నాయకుల లింకులను సాధ్యమైనంత త్వరలో ఛేదించాలని నిర్ణయించారు. అందుకోసం బలమైన ఆధారాలను సేకరిస్తున్నారు.