నయీమ్ కేసుకు ‘నారా’ బ్రేకు! | SIT officials work on nayeem case | Sakshi
Sakshi News home page

నయీమ్ కేసుకు ‘నారా’ బ్రేకు!

Published Thu, Sep 15 2016 1:58 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

నయీమ్ కేసుకు ‘నారా’ బ్రేకు! - Sakshi

నయీమ్ కేసుకు ‘నారా’ బ్రేకు!

కేసు నుంచి కాపాడాలంటూ ఏపీ సీఎం బాబును
ఆశ్రయించిన ఆరుగురు పోలీసు అధికారులు
తెలంగాణ టీడీపీకి చెందిన కొందరు నేతలు కూడా..
కేంద్ర హోంమంత్రితో చంద్రబాబు రాయబారం
తెలంగాణ సర్కారు ఎలాంటి చర్యలూ తీసుకోకుండా చూడాలని విన్నపం
ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రభుత్వం కోసమే పనిచేశామని బాబుతో మొరపెట్టుకున్న ఆ పోలీసు అధికారులు...
‘సొహ్రాబుద్దీన్’ కేసుకు లింకు పెట్టి బయటపడే యత్నం

 
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో ముమ్మరంగా సాగుతున్న దర్యాప్తునకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మోకాలడ్డుతున్నారా...? ఉమ్మడి ఏపీకి తాను సీఎంగా ఉన్న సమయంలో పనిచేసిన కొందరు అధికారులను, తన పార్టీకి చెందిన కొందరు నేతలను కాపాడుకునే  యత్నం చేస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారా? ఒకట్రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి!
 
నయీమ్‌తో ఆర్థిక లావాదేవీలు, చట్టవ్యతిరేక వ్యవహారాల్లో అంటకాగిన కొందరు పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు ఈ కేసు నుంచి బయట పడేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందానికి (సిట్) రాష్ట్ర ప్రభుత్వం మరికొందరు ఐపీఎస్ అధికారులను కేటాయించింది. దీంతో దర్యాప్తు మరింత వేగం పుంజుకోవడం, డీజీపీ అనురాగ్ శర్మ ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు మధ్యంతర నివేదిక ఇవ్వడంతో నయీమ్‌తో సంబంధాలున్నవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 21 మంది పోలీసు అధికారులకు సంబంధాలున్నట్లు నివేదికలో పొందుపరిచిన సంగతి తెలుసుకొని కొందరు పోలీసు అధికారులు కొత్త పాచికలు విసుతున్నారు.
 
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. నివేదికలో పేర్లున్న, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు అధికారులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి శరణు జొచ్చారు. తాము కేవలం అప్పటి ప్రభుత్వ అవసరాల కోసమే పనిచేశామని, వ్యక్తిగతం కోసం కాదని ఆయనకు వివరించారు. ఈ కేసులో తమ పేర్లు బయటకురాకుండా, అరెస్టు కాకుండా కాపాడాలని కోరినట్లు తెలిసింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు ఒకట్రెండు రోజుల కిందట కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఫోన్లో సంప్రదించి ఈ విషయాలను వివరించారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఆ ఆరుగురు అధికారులపై ఎలాంటి చర్య తీసుకోకుండా చూడాలని కోరినట్లు తెలిసింది.
 
టీడీపీ నేతలు కూడా..
ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో టీడీపీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు, మంత్రులుగా పనిచేసిన వారికి నయీమ్‌తో సంబంధాలున్నట్టు సిట్ దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయని తేలితే సొంత పార్టీ వారని కూడా చూడొద్దని సీఎం కేసీఆర్ ఇప్పటికే పోలీసు అధికారులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో విపక్షాలకు చెందిన నేతలు వణికిపోతున్నారు. టీడీపీకి చెందిన కొందరు నేతలు ఈ కేసు నుంచి తమను బయట పడేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబును కోరినట్లు ప్రచారం జరుగుతోంది. తన హయాంలో అధికారులుగా పనిచేసిన వారు, ప్రభుత్వంలో భాగస్వాములైన తమ పార్టీ నేతలను కాపాడుకునే పనిలో పడిన చంద్రబాబు ‘సిట్’ దర్యాప్తునకు మోకాలుడ్డుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 సొహ్రాబుద్దీన్ కేసును సాకుగా చూపి..
టీడీపీ పాలనలోనే నక్సలైట్లకు వ్యతిరేకిగా మారిన నయీమ్ 1990 నుంచి తన కార్యకలాపాలను మొదలు పెట్టాడు. గుజరాత్‌కు చెందిన సొహ్రాబుద్దీన్‌తోనూ సంబంధాలు కొనసాగించాడు. నయీమ్‌ను కలిసేందుకే హైదరాబాద్‌కు వచ్చి గుజరాత్‌కు పయనమైన సొహ్రాబుద్దీన్.. 2005 నవంబర్‌లో గుజరాత్ ఏటీఎస్ (యాంటీ టైస్ట్ స్క్వాడ్) చేతిలో ఎన్‌కౌంటర్ అయ్యాడు. సొహ్రాబుద్దీన్‌ను గుజరాత్ ఏటీఎస్ అదుపులోకి తీసుకోవడంలో అప్పటి ఏపీ పోలీసుల సహకారం ఉందని, అసలు వారికి ఆ సమాచారం ఇచ్చిందే నయీమ్ అన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని ఆ ఆరుగురు పోలీసు అధికారులు ఇప్పుడు ఇదే ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని కేసు నుంచి బయట పడాలని చూస్తున్నారు.
 
తాము కేవలం సొహ్రాబుద్దీన్‌కు సంబంధించిన సమాచారం సేకరించడానికే నయీమ్‌తో సంబంధాలు కొనసాగించామంటూ నమ్మబలుకుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సొహ్రాబుద్దీన్ కేసులో ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై ఆరోపణలు రావడంతో నాడు గుజరాత్ కేబినెట్ నుంచి వైదొలిగారు. ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు అమిత్ షాకు ఈ కేసు విముక్తి కల్పించింది. కాగా, సొహ్రాబుద్దీన్ కేసును నాడు సీబీఐకి అప్పగించారు.

అప్పట్నుంచి మొన్న ఎన్‌కౌంటర్‌లో హతమయ్యే వరకు నయీమ్ సీబీఐకి దొరక్కుండా తప్పించుకు తిరిగాడు. ఇప్పుడు ఇదే కేసును అడ్డం పెట్టుకుని బయటపడేందుకు ఏపీ సీఎం చంద్రబాబును సదరు అధికారులు కలవడం చర్చనీయాంశమైంది. నయీమ్‌తో సంబంధాలున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. చంద్రబాబు విసిరిన పాచిక ఎంత వరకు పారుతుంది..? కేంద్రం ఒత్తిడికి రాష్ట్రం తలొగ్గుతుందా..? అన్నది వేచిచూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement