నయీమ్‌ కేసును లైట్‌ తీసుకోండి! | retired dgp trying to settle the nayeem case | Sakshi
Sakshi News home page

నయీమ్‌ కేసును లైట్‌ తీసుకోండి!

Published Tue, May 16 2017 2:45 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

నయీమ్‌ కేసును లైట్‌ తీసుకోండి! - Sakshi

నయీమ్‌ కేసును లైట్‌ తీసుకోండి!

సెటిల్‌మెంట్‌ కోసం రంగంలోకి ఓ రిటైర్డ్‌ డీజీపీ
విచారణ ఎదుర్కొంటున్న వారంతా ఆయన శిష్యులే
►  వారం క్రితం సీఎం కార్యాలయానికి వెళ్లిన వైనం
►  సాదాసీదా చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి
►  ఈ ఒత్తిళ్లను పట్టించుకోని పోలీసు శాఖ
►  నయీమ్‌ డైరీలో 22 పేజీలు మాయంపై సందేహాలు!


సాక్షి, హైదరాబాద్‌
ఆయనో సీనియర్‌ ఐపీఎస్‌.. కేంద్ర సర్వీసుల్లో కీలక విభాగాలకు అధిపతిగా పనిచేసిన రాష్ట్ర కేడర్‌ అధికారి. ఇటీవలే పదవీ విరమణ సైతం పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన విభాగాలకు చీఫ్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే నయీమ్, నయీమ్‌తో అంటకాగిన ఖాకీలతో సంబంధాలు అల్లుకున్నాయి. పదమూడేళ్ల కింద కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయిన ఆయన తిరిగి ఇటువైపు కన్నెత్తి చూడలేదు కూడా. కానీ ఆ అధికారి, అదీ పదవీ విరమణ పొందిన తర్వాత నయీమ్‌ కేసును ప్రభావితం చేసేందుకు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఆ రిటైర్డ్‌ డీజీపీ రాష్ట్రంలో పనిచేసిన సమయంలో తన శిష్యులుగా ముద్రపడ్డ ఆరుగురు అధికారులు నయీమ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు.

తమపై చర్యలు తప్పవని గ్రహించిన ఆ అధికారులు.. వెళ్లి రిటైర్డ్‌ డీజీపీ వద్ద మొరపెట్టుకున్నారు. తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చిన ఆయన.. వారం క్రితం నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. రాష్ట్రంలో కీలక అధికారిగా ఉంటూ, సీఎంకు నమ్మినబంటు అయిన ఓ సీనియర్‌ అధికారి వద్దకు నేరుగా వెళ్లి లాబీయింగ్‌కు ప్రయత్నించినట్లు తెలిసింది. నయీమ్‌ కేసులో తమ వారిపై ఏవో చిన్న చిన్న చర్యలు తీసుకోవాలని ఆయన ప్రతిపాదించగా.. సదరు సీనియర్‌ అధికారి మాత్రం దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారని సమాచారం. సీఎం వద్ద తనకంత సీన్‌ లేదని, సిట్‌ నివేదిక పూర్తి ఆధారాలతో ఉందని ఆ అధికారి స్పష్టం చేసినట్లు తెలిసింది. అంతేకాదు తానేం చెప్పినా సరే.. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు నివేదించినదానినే సీఎం ఆమోదిస్తారని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఎలాగైనా ప్రయత్నం చేసి తమ వారిని రక్షించాలని సదరు రిటైర్డ్‌ డీజీపీ వేడుకున్నట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి.

సీఎంకే చెప్పండి!
రిటైర్డ్‌ డీజీపీ ప్రతిపాదనను సంబంధిత సీనియర్‌ అధికారి పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. సస్పెన్షన్, విచారణ జరగకుండా చూడాలని కోరినట్లు తెలిసింది. అయితే ఉన్నతాధికారులు సైతం మొహమాటం లేకుండా సమాధానమిచ్చినట్లు సమాచారం. ‘మీరు ఏదైనా చెప్పాలని అనుకుంటే నేరుగా ముఖ్యమంత్రికి చెప్పండి. అంతేగానీ మా వద్ద ఇలాంటి పైరవీలు చేయొద్దు..’అని సూటిగా స్పష్టం చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక ఇటు సీఎంఓ అధికారి, అటు రిటైర్డ్‌ డీజీపీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

నయీమ్‌ డైరీలో ఆ పేజీలెక్కడ..?
తాను చేసిన ప్రతి పని, సెటిల్‌మెంట్లు, దందాలు, అందించిన నజరానాలు.. ఇలా ప్రతీ అంశాన్ని నయీమ్‌ తన డైరీలో రాసిపెట్టాడు. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ జరిగిన వెంటనే అల్కాపురికాలనీలోని అతడి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించి.. డాక్యుమెంట్లు, ఆయుధాలు, నగదు, బంగారం వంటి వాటితో పాటు పలు డైరీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డైరీల్లో దాదాపు 22 పేజీలు మాయమవడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. సోదాలు చేసిన సమయంలోనే పోలీసు అధికారులు ఆ పేజీలను చించేశారా? నయీమే ఆ పేజీలను చింపేసి ఉంటాడా అన్న విషయంలో స్పష్టత లేదు. అయితే నయీమ్‌ భార్య, సోదరి ఇచ్చిన వాంగ్మూలాల మేరకు.. నయీమ్‌ తన డైరీల్లో ప్రతీ విషయం రాసుకునే వాడని, ఏ ఒక్క పేజీ కూడా చింపేవాడు కాదని చెప్పినట్టు తెలిసింది.

నయీమ్‌ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొని సాధారణ పనిష్మెంట్లకు గురైన ఓ సీనియర్‌ అధికారి నేతృత్వంలోని బృందమే మొదటగా నయీమ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించి డైరీలు, డాక్యుమెంట్లు, ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఆ అధికారి నేతృత్వంలోని బృందమే డైరీల్లోని పేజీలు చించేసి ఉంటుందన్న కోణంలో సిట్‌ విచారణ సాగిస్తోంది. నయీమ్‌ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ కూడా డిలీట్‌ కావడం దీనికి ఆధారంగా భావిస్తోంది. సంబంధిత అధికారి, సిబ్బందిని మళ్లీ విచారిస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయని సిట్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

ఆ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై క్రిమినల్‌ కేసులు!
ఇక నయీమ్‌ కేసును మూసేస్తారన్న భావన నెలకొన్న తరుణంలో ఒక్కసారిగా సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై పూర్తి ఆధారాలతో డీజీపీకి నివేదిక అందించగా.. పోలీసు శాఖ చర్యలు కూడా చేపట్టింది. మరి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంగతేమిటని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తదుపరి టార్గెట్‌ రాజకీయ నాయకులే అని సిట్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యేను ప్రశ్నించామని.. మరో ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలను ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు. ఈ నలుగురితోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జులుగా ఉన్న మరో ఇద్దరు నేతలు కూడా నయీమ్‌తో చేసిన దందాలపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక పంపించామని వెల్లడించారు. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే వారందరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి విచారణ చేపడతామని, చార్జిషీట్‌లో వారి పేర్లు చేర్చాల్సి ఉంటుందని.. దీనిపై వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement