టైటిల్ : నయీం డైరీస్
నటీనటులు : వశిష్ట సింహ, యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్, శశి కుమార్, జబర్దస్త్ ఫణి తదితరులు
నిర్మాత : సీఏ వరదరాజు
దర్శకత్వం: దాము బాలాజీ
సంగీతం : అరుణ్ ప్రభాకర్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
విడుదల తేది : డిసెంబర్ 10, 2021
2016లో గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నక్సల్‌గా ప్రారంభమైన ఆయన జీవితం, పోలీసు కోవర్ట్‌గా మారి ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి వణుకు పుట్టించాడు. చివరకు పోలీసుల ఎన్‌కౌంటర్‌కి గురయ్యాడు. అలాంటి వ్యక్తి జీవిత కథలో తెరకెక్కిన సినిమా ‘నయీం డైరీస్’. ఈ చిత్రంలో వశిష్ఠ సింహ నయీం క్యారెక్టర్ లో నటించారు. సీఏ వరదరాజు నిర్మాణంలో తన తొలి ప్రయత్నంగా నయీం డైరీస్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు దాము బాలాజీ. ఓ మోస్తారు అంచనాల మధ్య ఈ శుక్రవారం (డిసెంబర్ 10)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..?
నల్లగొండ జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన నయీం(వశిష్ట సింహ).. చిన్నతనంలోనే నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడై మావోయిస్ట్‌గా మారతాడు. నిస్వార్ధంగా సేవ చేస్తూ కొద్దికాలంలోనే నక్సలైట్ ఉద్యమంలో కీలక వ్యక్తిగా మారిపోతాడు. వ్యాస్ హత్య కేసులో జైలుకెళ్లిన నయీంకు అక్కడ ఊహించిన పరిస్థితులు ఎదురవుతాయి. నయీం సోదరిపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తికి నక్సల్స్ చిన్న శిక్ష విధించి వదిలేయడం నయీం, అతని సోదరుడి వలీకి నచ్చదు. జైల్లో ఉన్న నయీం సోదరుడు వలీ సహాయంతో తన సోదరిపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని చంపిస్తాడు. దీంతో పార్టీ గీత దాటినందుకు నయీంను నక్సలైట్లు కమిటీ నుంచి బహిష్కరిస్తారు. దాంతో నయీం పోలీసుల చేతుల్లో అసాంఘీక శక్తిగా మారిపోతాడు. క్సలైట్ ఉద్యమాన్ని ప్రాణంగా ప్రేమించిన నయీం, ఆ నక్సలైట్ల ఎన్ కౌంటర్ లకు ఎలా సారథ్యం వహించాడు? జైలులో నయీం ఎదుర్కొన్న సమస్యలు ఏంటి?నయీం సోదరుడు వల్లీ ఎందుకు హత్య గురయ్యాడు? సోదరుడి మరణం తర్వాత నయీం జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే మిగతా కథ.
ఎవరెలా చేశారంటే..
నయీం పాత్రలో వశిష్ట సింహ ఒదిగిపోయాడు. భావోద్వేగం, కుటుంబం మీద ప్రేమ, శత్రువుల మీద పగ, పట్టరాని ఆవేశం, క్రోధం లాంటి హావభావాలన్నీ వశిష్ట సింహా చక్కగా పలికించాడు. డైలాగ్స్ కూడా అద్భుతంగా పలికి ఆ పాత్రకు న్యాయం చేశాడు. నయీం యువకుడి పాత్రలో బాహుబలి నిఖిల్ నటన బాగుంది. నయీం సోదరిగా నటించిన యజ్ఞశెట్టి తన మెప్పించింది. నయీం భార్యగా బిగ్‌బాస్ దివి తనదైన అందంతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో వశిష్ట, దివి కెమిస్ట్రీ బాగుంది. లత పాత్రలో సంయుక్త మెప్పించింది. తన ప్రేమనంతా మాటల్లో కాకుండా చూపుల్లోనే కనబర్చింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఎలా ఉందంటే..?
తెలంగాణలో పేరమోసిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే ‘నయీం డైరీస్’.కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ని పక్కకి పెట్టి చూస్తే.. ‘అత్యంత వివాదాస్పద, సంచలనాత్మక గ్యాంగ్‌స్టర్ కథని అంతే బోల్డ్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు దాము బాలాజీ. నయీం జీవితంలో వెలుగు చూడని అంశాలను చక్కగా తెరమీదకు తీసుకురావడంలో సఫలమయ్యారు.
నయీం అసలు నక్సల్ నుంచి పోలీస్ కోవర్ట్ గా మారడానికి దారి తీసిన అంశాలేంటి? తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని ఎన్‌కౌంటర్ చేయడానికి కారణాలేంటి? ఓ వైపు నక్సల్స్, మరోవైపు పోలీసులు, ఇంకోవైపు రాజకీయ నాయకులు ఆయన్ని ఎలా వాడుకున్నారు? అనేది ఆసక్తికరంగా చూపించాడు. నయీం సోదరుడి మర్డర్‌కు సంబంధించిన యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్‌గా ఉంటాయి. నయీం జీవితం గురించి దర్శకుడు చేసిన పరిశోధన సినిమాకు బలంగా మారిందనే చెప్పాలి. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం సినిమాకు మైనస్. సెకండాఫ్‌లో కథను అనుసరిస్తూ సాగిన హింస.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇబ్బందిగా ఉంటుంది. మొత్తనికి తొలి చిత్రంగా దర్శకుడు మంచి మార్కులే సంపాదించాడు. ఇక సాంకెతిక విషయాలకొస్తే.. ప్రభాకర్ అరున్ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎన్‌కౌంటర్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌ని తెరపై చక్కగా చూపించారు. కిషోర్ మద్దాలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment