Nayeem Diaries Movie
-
బయోపిక్‌లు ‘భయో’ పిక్‌లు, కాకూడదు
ఈ మధ్యకాలంలో అనేక మంది బయోగ్రఫీని సినిమాల్లో ‘భయోపిక్’గా తెరకు ఎక్కిస్తున్నారు. ఇందులో చాలా బయోపిక్‌లలో వివాదాంశాలు ఉండడం, వివాదాలు, అల్లర్లు చెలరేగడం ఒక ఎత్తయితే, దాము బాలాజీ నిర్మించి విడుదల చేసిన ‘నయీం డైరీస్’ బయోపిక్ దారుణంగా ఉంది. ఈ వికృత ప్రయోగంలో తెలంగాణ పాటల కోయిల త్యాగశీలి బెల్లి లలిత పాత్రను వక్రీకరించి, ఆమె నయీమ్ జైళ్ళో ఉన్నప్పుడు నిత్యం వచ్చిపోతూ, అతని ప్రేమలో, నియంత్రణలో ఉన్నట్లు, నాటి నల్లగొండ మావోయిస్టు పార్టీ సెక్రటరీ ధర్మన్నను పట్టించడానికి ఒప్పుకున్నట్లు తరువాత నిరాకరించడంతోనే నయీమ్ కుటుంబ సభ్యులు బెల్లి లలితను హత్య చేసినట్లు చిత్రీకరించారు. నిత్యం సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లులో చెమటోడ్చి పిల్లలను పెంచి, కుటుంబ బాధ్యతతోపాటు తెలంగాణ ఉద్యమంలో, ప్రజా పోరాటాల్లో జీవితాన్ని కొనసాగించిన తెలంగాణ ఆడబిడ్డ ప్రేమలో పడిన రహస్యం దాము బాలాజీకి ఎవరు చెప్పారు? ఒకరిని పట్టించమని ఒత్తిడి చేస్తే, నిరాకరించినంత మాత్రాన ముక్కలు ముక్కలుగా నరకడానికి వాళ్ళ కుటుంబానికి చేతులు ఎట్లా వచ్చాయి? రాజ్యం, పోలీసుల మిలాఖత్‌ను గొప్పగా చిత్రీకరించాననుకునే రామ్‌గోపాల్ వర్మ శిష్యుడికి బెల్లి లలితను తప్పుడుగా చిత్రీకరించడంలోను రాజ్యం పాత్ర లేదని ఎందుకనుకోవాలి? ఇప్పటికే ఈ చిత్రంలో బెల్లి లలిత వ్యక్తిగత జీవితాన్ని మలినం చేసిన దాము బాలాజీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘నయీమ్ డైరీస్’ సినిమా నిలిపివేయాలని హైదరాబాద్, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేటలో సినిమా హాళ్ళ ముందు నిరసనలతో అడ్డుకోవడాలు జరిగాయి. కదిరే కృష్ణ తదితరులు హైకోర్టు నుండి సినిమా నిలిపివేయవలసిందిగా ‘స్టే’ తెచ్చారు. (చదవండి: వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!) దాము బాలాజీ ఉద్దేశం ఏదైనా సరే, తెలంగాణ సమాజమంతా కూడా బెల్లి లలిత జీవితాన్ని మలినం చేసే ఏ ప్రయత్నాన్నైనా తిప్పికొడతారు. మా చేతుల మీద ఎదిగిన ఆడపిల్ల బెల్లి లలిత. బెల్లి లలిత చెల్లెలు సరితకు ముక్క కరుణాకర్‌తో దగ్గరుండి నా చేతుల మీదిగా పెళ్ళి జరిపించాను. నయీమ్ భయానికి, కర్కశత్వానికి పదుల సంఖ్యలో గొల్ల, కుర్మ సోదరులు బలయిపోయారు. (చదవండి: ‘జై భీమ్’ సినిమాలో చూపింది సత్యమేనా?) సాంబశివుడు, రాములు అంతకు ముందు పురుషోత్తం, ఆజమ్ అలీ ఈ హత్యల పరంపర, నయీమ్ సీరియల్ కిల్లర్ కావడానికి విప్లవ పార్టీల తీరు కూడా కారణమయినట్లు అన్యాపదేశ సందేశం ఇవ్వడం దారుణం. నయీమ్ కత్తుల వేటలో బలయిన అనేక మందికి పాడె మోసినవాణ్ణి... నేనింకా బతికే ఉన్నాను. నయీమ్‌ను గ్లోరిఫై చేయలేదని చెప్పుకున్న దాము బాలాజీ మరి ఎవరిని టార్గెట్ చేసినట్లు? ‘బయోపిక్’ సరదా ‘భయోపిక్’గా మారితే సహించడానికి బెల్లి లలిత త్యాగాల చరిత్ర చిన్నది కాదు. సినిమా నుంచి ఆ అంశాలను తొలగించి, తెలంగాణ సమాజానికి దాము బహిరంగ క్షమాపణ చెప్పాలి. – డా. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు -
'నయీం డైరీస్' మూవీకి తెలంగాణ హైకోర్టు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: 'నయీం డైరీస్' చిత్రం ప్రదర్శనపై హైకోర్టు స్టే విధించింది. సినిమాలో బెల్లి లలిత పాత్రను అభ్యంతరకరంగా చిత్రీకరించారంటూ ఆమె కుమారుడు సూర్యప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. 1999లో బెల్లిలలిత దారుణ హత్యకు గురైంది. బెల్లి లలితను నయీం హత్య చేయించాడంటూ అప్పట్లో కుటుంబ సభ్యులు ఆరోపించారు. తాజాగా నయీం డైరీ చిత్రంలో బెల్లి లలిత క్యారెక్టర్ అయిన 'లత'ను నయీం లిప్ కిస్ చేసే దృశ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, ఈ సినిమా శుక్రవారమే విడుదలైంది. దీంతో చిత్రం నిలుపుదల చేయాలంటూ సూర్యప్రకాష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చిత్రం డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకూ నయీం డైరీ చిత్ర ప్రదర్శనపై హైకోర్టు స్టే విధించింది. చదవండి: (‘నయీం డైరీస్’మూవీ రివ్యూ) ఆ దృశ్యాలను తొలగిస్తాం: నిర్మాత నయీం డైరీస్ నిర్మాత సీ.ఏ వరదరాజు బెల్లి లలిత కుటుంబానికి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'సినిమాలో నిజజీవితంలో అమరులైన ఒక మహిళ పాత్రను చిత్రించి ఆమె కుటుంబ సభ్యులను, అభిమానుల్ని బాధపెట్టినట్లు మా దృష్టికి వచ్చింది. వారి మనోభావాల్ని గాయపరిచినందుకు మేము భేషరతుగా క్షమాపణ చెప్తున్నాము. మా సినిమా ప్రదర్శనను ఆపివేసి ఆ పాత్రకు సంబంధించిన అభ్యంతరకర దృశ్యాలను, సంభాషణలను వెంటనే తొలగిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అని నయీం డైరీస్ నిర్మాత సీ.ఏ వరదరాజు అన్నారు. -
‘నయీం డైరీస్’మూవీ రివ్యూ
టైటిల్ : నయీం డైరీస్ నటీనటులు : వశిష్ట సింహ, యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్, శశి కుమార్, జబర్దస్త్ ఫణి తదితరులు నిర్మాత : సీఏ వరదరాజు దర్శకత్వం: దాము బాలాజీ సంగీతం : అరుణ్ ప్రభాకర్ ఎడిటింగ్: కిషోర్ మద్దాలి విడుదల తేది : డిసెంబర్ 10, 2021 2016లో గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నక్సల్‌గా ప్రారంభమైన ఆయన జీవితం, పోలీసు కోవర్ట్‌గా మారి ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి వణుకు పుట్టించాడు. చివరకు పోలీసుల ఎన్‌కౌంటర్‌కి గురయ్యాడు. అలాంటి వ్యక్తి జీవిత కథలో తెరకెక్కిన సినిమా ‘నయీం డైరీస్’. ఈ చిత్రంలో వశిష్ఠ సింహ నయీం క్యారెక్టర్ లో నటించారు. సీఏ వరదరాజు నిర్మాణంలో తన తొలి ప్రయత్నంగా నయీం డైరీస్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు దాము బాలాజీ. ఓ మోస్తారు అంచనాల మధ్య ఈ శుక్రవారం (డిసెంబర్ 10)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? నల్లగొండ జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన నయీం(వశిష్ట సింహ).. చిన్నతనంలోనే నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడై మావోయిస్ట్‌గా మారతాడు. నిస్వార్ధంగా సేవ చేస్తూ కొద్దికాలంలోనే నక్సలైట్ ఉద్యమంలో కీలక వ్యక్తిగా మారిపోతాడు. వ్యాస్ హత్య కేసులో జైలుకెళ్లిన నయీంకు అక్కడ ఊహించిన పరిస్థితులు ఎదురవుతాయి. నయీం సోదరిపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తికి నక్సల్స్ చిన్న శిక్ష విధించి వదిలేయడం నయీం, అతని సోదరుడి వలీకి నచ్చదు. జైల్లో ఉన్న నయీం సోదరుడు వలీ సహాయంతో తన సోదరిపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని చంపిస్తాడు. దీంతో పార్టీ గీత దాటినందుకు నయీంను నక్సలైట్లు కమిటీ నుంచి బహిష్కరిస్తారు. దాంతో నయీం పోలీసుల చేతుల్లో అసాంఘీక శక్తిగా మారిపోతాడు. క్సలైట్ ఉద్యమాన్ని ప్రాణంగా ప్రేమించిన నయీం, ఆ నక్సలైట్ల ఎన్ కౌంటర్ లకు ఎలా సారథ్యం వహించాడు? జైలులో నయీం ఎదుర్కొన్న సమస్యలు ఏంటి?నయీం సోదరుడు వల్లీ ఎందుకు హత్య గురయ్యాడు? సోదరుడి మరణం తర్వాత నయీం జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. నయీం పాత్రలో వశిష్ట సింహ ఒదిగిపోయాడు. భావోద్వేగం, కుటుంబం మీద ప్రేమ, శత్రువుల మీద పగ, పట్టరాని ఆవేశం, క్రోధం లాంటి హావభావాలన్నీ వశిష్ట సింహా చక్కగా పలికించాడు. డైలాగ్స్ కూడా అద్భుతంగా పలికి ఆ పాత్రకు న్యాయం చేశాడు. నయీం యువకుడి పాత్రలో బాహుబలి నిఖిల్ నటన బాగుంది. నయీం సోదరిగా నటించిన యజ్ఞశెట్టి తన మెప్పించింది. నయీం భార్యగా బిగ్‌బాస్ దివి తనదైన అందంతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో వశిష్ట, దివి కెమిస్ట్రీ బాగుంది. లత పాత్రలో సంయుక్త మెప్పించింది. తన ప్రేమనంతా మాటల్లో కాకుండా చూపుల్లోనే కనబర్చింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? తెలంగాణలో పేరమోసిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే ‘నయీం డైరీస్’.కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ని పక్కకి పెట్టి చూస్తే.. ‘అత్యంత వివాదాస్పద, సంచలనాత్మక గ్యాంగ్‌స్టర్ కథని అంతే బోల్డ్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు దాము బాలాజీ. నయీం జీవితంలో వెలుగు చూడని అంశాలను చక్కగా తెరమీదకు తీసుకురావడంలో సఫలమయ్యారు. నయీం అసలు నక్సల్ నుంచి పోలీస్ కోవర్ట్ గా మారడానికి దారి తీసిన అంశాలేంటి? తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని ఎన్కౌంటర్ చేయడానికి కారణాలేంటి? ఓ వైపు నక్సల్స్, మరోవైపు పోలీసులు, ఇంకోవైపు రాజకీయ నాయకులు ఆయన్ని ఎలా వాడుకున్నారు? అనేది ఆసక్తికరంగా చూపించాడు. నయీం సోదరుడి మర్డర్‌కు సంబంధించిన యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్‌గా ఉంటాయి. నయీం జీవితం గురించి దర్శకుడు చేసిన పరిశోధన సినిమాకు బలంగా మారిందనే చెప్పాలి. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం సినిమాకు మైనస్. సెకండాఫ్‌లో కథను అనుసరిస్తూ సాగిన హింస.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇబ్బందిగా ఉంటుంది. మొత్తనికి తొలి చిత్రంగా దర్శకుడు మంచి మార్కులే సంపాదించాడు. ఇక సాంకెతిక విషయాలకొస్తే.. ప్రభాకర్ అరున్ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎన్కౌంటర్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌ని తెరపై చక్కగా చూపించారు. కిషోర్ మద్దాలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
నయీం క్యారెక్టర్ కోసం నక్సలైట్స్ గురించి ఆరా తీశా: వశిష్ట సింహా
‘నాకు సహజంగానే నెగిటివ్ రోల్స్ అంటే ఇష్టం. థియేటర్ నాటికల్లోనూ నెగిటివ్ పాత్రలు చేశాను. నెగిటివ్ రోల్స్ లో నటించేందుకు చాలా స్వేచ్ఛ ఉంటుంది . హీరోకు ఉండే పరిమితులు ప్రతినాయకుడికి ఉండవు. అందుకే నాకు విలన్ పాత్రలు అంటే ఇష్టం’అన్నారు హీరో వశిష్ట సింహా. కేజీఎఫ్, నారప్ప సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ యంగ్ హీరో.. తాజాగా ‘నయీం డైరీస్’లో ప్రధాన పాత్రలో నటించారు. . వరదరాజు నిర్మించిన ఈ చిత్రానికి దాము బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ నెల 10న నయీం డైరీస్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా వశిష్ట సింహా మీడియాతో ముచ్చటించారు. ఈ విశేషాలు.. ►సంగీత దర్శకుడు హంసలేఖ నా అభిమాన సంగీత దర్శకుడు. ఆయన కన్సర్ట్ జరుగుతుంటే వెళ్లి కలవాలని ప్రయత్నించాను. ఆ తర్వాత హంసలేఖ నోటీస్ కు వెళ్లాను. ఒక రోజు ఆయన పిలిచి పాడమని అడిగారు. అలా సింగర్ గా నా జర్నీ మొదలైంది. పెద్ద ప్రొపెషనల్ సింగర్ ను కాదు కానీ...సినిమా మీద ఆసక్తి పెరిగింది. అలా ఇండస్ట్రీకి రాగలిగాను. ►కాలేజ్ లో ఉన్నప్పుడు రౌడీ గ్యాంగ్ మాది. కాలేజ్ లో ఉన్నప్పుడే కల్చరల్ యాక్టివిటీస్ చేసేవాళ్లం. నాటికను డైరెక్ట్ చేశాను. ఆ నాటికకు అవార్డ్ వచ్చింది. ఇదంతా నాకు ఎంకరేజింగ్ గా ఉండేది. బెంగళూరు థియేటర్ నాటికలకు తరుచూ వెళ్లేవాడిని. అలా సినిమా వైపు మరింత ఆకర్షితం అయ్యాను. థియేటర్ నాటికల్లో నటించడం మొదలుపెట్టాను. అరడజను నాటికల్లో నటించాను. జాబ్ చేస్తూనే ఇటు నాటికల్లో నటించేవాడిని. పనిచేసే కంపెనీ నుంచి బయటకొచ్చి నాటికల్లో పూర్తిగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. అక్కడి నుంచి నా సినిమా ప్రయాణం మొదలైంది. ►సినిమాల్లో డీవోపీ, ఎడిటింగ్ ఇలా. చాలా డిపార్ట్ మెంట్ ల్లో పనిచేశాను. యష్ సినిమాలో ఒక నెగిటివ్ రోల్ లో నటించాను. ఆ పాత్రకు బాగా పేరొచ్చింది. అలా విలన్ గా నా కెరీర్ మొదలైంది. ఆ తర్వాత మంచి మంచి క్యారెక్టర్స్ దొరికాయి. ఇక్కడ కిరాక్ పార్టీలో ఒక క్యారెక్టర్ లో నటించాను. అలా నేను బిజీగా మారిన టైమ్ లో నిర్మాత వరదరాజు గారు బెంగళూరు వచ్చారు. దర్శకుడు దాము బాలాజీ గారికి నయీం డైరీస్ కోసం పరిచయం చేశారు. ఈ కథ నాకు బాగా నచ్చింది. అలా నయీం డైరీస్ మూవీ లో జాయిన్ అయ్యాను. ►నయీం కథ విన్నప్పుడు మనిషి ఇంత క్రూరంగా ఉంటాడా అనిపించింది. జీవితంలో ఎన్నో సాధిస్తాం. ఎంతో సంపాదిస్తాం. కానీ ఒక ఘటన ఎదురైనప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది తర్వాత భవిష్యత్ ను నిర్ణయిస్తుంది. నయీం అనే మనిషి త్వరగా, గట్టిగా రియాక్ట్ అవుతాడు. తర్వాత ఏంటనేది ఆలోచించడు. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు ఒక గ్యాంగ్ స్టర్ గా ఎదగడం సర్ ప్రైజింగ్ గా అనిపిస్తుంది. నారప్ప, కేజీఎఫ్ తర్వాత నయీం డైరీస్ సినిమా చేయడం నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. నయీం క్యారెక్టర్ లో ఉన్న డెప్త్, ఇంటర్నల్ ఎమోషన్ నాకు బాగా నచ్చింది. ఇలాంటి పాత్రలు తరుచూ దొరకవు. ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంటుంది. ►నయీం కథ ఎవరైనా ముందు వింటే కోపం వస్తుంది, ఆ తర్వాత జాలి కలుగుతుంది. నేను కూడా నయీం గురించి యూట్యూబ్ ద్వారా నెట్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. మీడియా ఇంటర్వ్వూస్ చూశాను, ఆర్టికల్స్ చదివాను. నక్సలైట్స్ గురించి తెలుసుకున్నాను. ఇలా నయీం క్యారెక్టర్ కోసం కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యాను. స్క్రిప్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రైమ్ ను, ఎమోషన్ ను దర్శకుడు కొత్తగా చూపించారు. డైలాగ్స్ బాగుంటాయి. ►నయీం ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అని అన్నప్పుడు కాంట్రవర్సీ వస్తుంది. ఇలాంటి సినిమాలో ఎందుకు నటించావు అనే ప్రశ్నలూ వస్తాయి. కానీ నేనొక నటుడిని. నయీంకు సంబంధించిన ఏ విషయాలతో నాకు సంబంధం లేదు. నయీంను ఈ సినిమాలో మంచిగా చూపించే ప్రయత్నం చేయలేదు. అతని జీవితం ఎలా సాగిందో, అలాగే ఒక అద్దంలా తెరకెక్కించాం. నాణేనికి రెండో వైపు ఉన్నట్లు ...నయీం కొందరికి హీరో అంటే ఆశ్చర్యం కలుగుతుంది.