
సాక్షి, హైదరాబాద్: 'నయీం డైరీస్' చిత్రం ప్రదర్శనపై హైకోర్టు స్టే విధించింది. సినిమాలో బెల్లి లలిత పాత్రను అభ్యంతరకరంగా చిత్రీకరించారంటూ ఆమె కుమారుడు సూర్యప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. 1999లో బెల్లిలలిత దారుణ హత్యకు గురైంది. బెల్లి లలితను నయీం హత్య చేయించాడంటూ అప్పట్లో కుటుంబ సభ్యులు ఆరోపించారు.
తాజాగా నయీం డైరీ చిత్రంలో బెల్లి లలిత క్యారెక్టర్ అయిన 'లత'ను నయీం లిప్ కిస్ చేసే దృశ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, ఈ సినిమా శుక్రవారమే విడుదలైంది. దీంతో చిత్రం నిలుపుదల చేయాలంటూ సూర్యప్రకాష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చిత్రం డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకూ నయీం డైరీ చిత్ర ప్రదర్శనపై హైకోర్టు స్టే విధించింది.
చదవండి: (‘నయీం డైరీస్’మూవీ రివ్యూ)
ఆ దృశ్యాలను తొలగిస్తాం: నిర్మాత
నయీం డైరీస్ నిర్మాత సీ.ఏ వరదరాజు బెల్లి లలిత కుటుంబానికి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'సినిమాలో నిజజీవితంలో అమరులైన ఒక మహిళ పాత్రను చిత్రించి ఆమె కుటుంబ సభ్యులను, అభిమానుల్ని బాధపెట్టినట్లు మా దృష్టికి వచ్చింది. వారి మనోభావాల్ని గాయపరిచినందుకు మేము భేషరతుగా క్షమాపణ చెప్తున్నాము. మా సినిమా ప్రదర్శనను ఆపివేసి ఆ పాత్రకు సంబంధించిన అభ్యంతరకర దృశ్యాలను, సంభాషణలను వెంటనే తొలగిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అని నయీం డైరీస్ నిర్మాత సీ.ఏ వరదరాజు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment