ఈ మధ్యకాలంలో అనేక మంది బయోగ్రఫీని సినిమాల్లో ‘భయోపిక్’గా తెరకు ఎక్కిస్తున్నారు. ఇందులో చాలా బయోపిక్‌లలో వివాదాంశాలు ఉండడం, వివాదాలు, అల్లర్లు చెలరేగడం ఒక ఎత్తయితే, దాము బాలాజీ నిర్మించి విడుదల చేసిన ‘నయీం డైరీస్’ బయోపిక్ దారుణంగా ఉంది. ఈ వికృత ప్రయోగంలో తెలంగాణ పాటల కోయిల త్యాగశీలి బెల్లి లలిత పాత్రను వక్రీకరించి, ఆమె నయీమ్ జైళ్ళో ఉన్నప్పుడు నిత్యం వచ్చిపోతూ, అతని ప్రేమలో, నియంత్రణలో ఉన్నట్లు, నాటి నల్లగొండ మావోయిస్టు పార్టీ సెక్రటరీ ధర్మన్నను పట్టించడానికి ఒప్పుకున్నట్లు తరువాత నిరాకరించడంతోనే నయీమ్ కుటుంబ సభ్యులు బెల్లి లలితను హత్య చేసినట్లు చిత్రీకరించారు.
నిత్యం సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లులో చెమటోడ్చి పిల్లలను పెంచి, కుటుంబ బాధ్యతతోపాటు తెలంగాణ ఉద్యమంలో, ప్రజా పోరాటాల్లో జీవితాన్ని కొనసాగించిన తెలంగాణ ఆడబిడ్డ ప్రేమలో పడిన రహస్యం దాము బాలాజీకి ఎవరు చెప్పారు? ఒకరిని పట్టించమని ఒత్తిడి చేస్తే, నిరాకరించినంత మాత్రాన ముక్కలు ముక్కలుగా నరకడానికి వాళ్ళ కుటుంబానికి చేతులు ఎట్లా వచ్చాయి? రాజ్యం, పోలీసుల మిలాఖత్‌ను గొప్పగా చిత్రీకరించాననుకునే రామ్‌గోపాల్ వర్మ శిష్యుడికి బెల్లి లలితను తప్పుడుగా చిత్రీకరించడంలోను రాజ్యం పాత్ర లేదని ఎందుకనుకోవాలి? ఇప్పటికే ఈ చిత్రంలో బెల్లి లలిత వ్యక్తిగత జీవితాన్ని మలినం చేసిన దాము బాలాజీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘నయీమ్ డైరీస్’ సినిమా నిలిపివేయాలని హైదరాబాద్, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేటలో సినిమా హాళ్ళ ముందు నిరసనలతో అడ్డుకోవడాలు జరిగాయి. కదిరే కృష్ణ తదితరులు హైకోర్టు నుండి సినిమా నిలిపివేయవలసిందిగా ‘స్టే’ తెచ్చారు. (చదవండి: వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!)
దాము బాలాజీ ఉద్దేశం ఏదైనా సరే, తెలంగాణ సమాజమంతా కూడా బెల్లి లలిత జీవితాన్ని మలినం చేసే ఏ ప్రయత్నాన్నైనా తిప్పికొడతారు. మా చేతుల మీద ఎదిగిన ఆడపిల్ల బెల్లి లలిత. బెల్లి లలిత చెల్లెలు సరితకు ముక్క కరుణాకర్‌తో దగ్గరుండి నా చేతుల మీదిగా పెళ్ళి జరిపించాను. నయీమ్ భయానికి, కర్కశత్వానికి పదుల సంఖ్యలో గొల్ల, కుర్మ సోదరులు బలయిపోయారు. (చదవండి: ‘జై భీమ్’ సినిమాలో చూపింది సత్యమేనా?)
సాంబశివుడు, రాములు అంతకు ముందు పురుషోత్తం, ఆజమ్ అలీ ఈ హత్యల పరంపర, నయీమ్ సీరియల్ కిల్లర్ కావడానికి విప్లవ పార్టీల తీరు కూడా కారణమయినట్లు అన్యాపదేశ సందేశం ఇవ్వడం దారుణం. నయీమ్ కత్తుల వేటలో బలయిన అనేక మందికి పాడె మోసినవాణ్ణి... నేనింకా బతికే ఉన్నాను. నయీమ్‌ను గ్లోరిఫై చేయలేదని చెప్పుకున్న దాము బాలాజీ మరి ఎవరిని టార్గెట్ చేసినట్లు? ‘బయోపిక్’ సరదా ‘భయోపిక్’గా మారితే సహించడానికి బెల్లి లలిత త్యాగాల చరిత్ర చిన్నది కాదు. సినిమా నుంచి ఆ అంశాలను తొలగించి, తెలంగాణ సమాజానికి దాము బహిరంగ క్షమాపణ చెప్పాలి.
– డా. చెరుకు సుధాకర్
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment