nayeem diary
-
‘నయీం డైరీస్’మూవీ రివ్యూ
టైటిల్ : నయీం డైరీస్ నటీనటులు : వశిష్ట సింహ, యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్, శశి కుమార్, జబర్దస్త్ ఫణి తదితరులు నిర్మాత : సీఏ వరదరాజు దర్శకత్వం: దాము బాలాజీ సంగీతం : అరుణ్ ప్రభాకర్ ఎడిటింగ్: కిషోర్ మద్దాలి విడుదల తేది : డిసెంబర్ 10, 2021 2016లో గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నక్సల్‌గా ప్రారంభమైన ఆయన జీవితం, పోలీసు కోవర్ట్‌గా మారి ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి వణుకు పుట్టించాడు. చివరకు పోలీసుల ఎన్‌కౌంటర్‌కి గురయ్యాడు. అలాంటి వ్యక్తి జీవిత కథలో తెరకెక్కిన సినిమా ‘నయీం డైరీస్’. ఈ చిత్రంలో వశిష్ఠ సింహ నయీం క్యారెక్టర్ లో నటించారు. సీఏ వరదరాజు నిర్మాణంలో తన తొలి ప్రయత్నంగా నయీం డైరీస్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు దాము బాలాజీ. ఓ మోస్తారు అంచనాల మధ్య ఈ శుక్రవారం (డిసెంబర్ 10)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? నల్లగొండ జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన నయీం(వశిష్ట సింహ).. చిన్నతనంలోనే నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడై మావోయిస్ట్‌గా మారతాడు. నిస్వార్ధంగా సేవ చేస్తూ కొద్దికాలంలోనే నక్సలైట్ ఉద్యమంలో కీలక వ్యక్తిగా మారిపోతాడు. వ్యాస్ హత్య కేసులో జైలుకెళ్లిన నయీంకు అక్కడ ఊహించిన పరిస్థితులు ఎదురవుతాయి. నయీం సోదరిపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తికి నక్సల్స్ చిన్న శిక్ష విధించి వదిలేయడం నయీం, అతని సోదరుడి వలీకి నచ్చదు. జైల్లో ఉన్న నయీం సోదరుడు వలీ సహాయంతో తన సోదరిపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని చంపిస్తాడు. దీంతో పార్టీ గీత దాటినందుకు నయీంను నక్సలైట్లు కమిటీ నుంచి బహిష్కరిస్తారు. దాంతో నయీం పోలీసుల చేతుల్లో అసాంఘీక శక్తిగా మారిపోతాడు. క్సలైట్ ఉద్యమాన్ని ప్రాణంగా ప్రేమించిన నయీం, ఆ నక్సలైట్ల ఎన్ కౌంటర్ లకు ఎలా సారథ్యం వహించాడు? జైలులో నయీం ఎదుర్కొన్న సమస్యలు ఏంటి?నయీం సోదరుడు వల్లీ ఎందుకు హత్య గురయ్యాడు? సోదరుడి మరణం తర్వాత నయీం జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. నయీం పాత్రలో వశిష్ట సింహ ఒదిగిపోయాడు. భావోద్వేగం, కుటుంబం మీద ప్రేమ, శత్రువుల మీద పగ, పట్టరాని ఆవేశం, క్రోధం లాంటి హావభావాలన్నీ వశిష్ట సింహా చక్కగా పలికించాడు. డైలాగ్స్ కూడా అద్భుతంగా పలికి ఆ పాత్రకు న్యాయం చేశాడు. నయీం యువకుడి పాత్రలో బాహుబలి నిఖిల్ నటన బాగుంది. నయీం సోదరిగా నటించిన యజ్ఞశెట్టి తన మెప్పించింది. నయీం భార్యగా బిగ్‌బాస్ దివి తనదైన అందంతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో వశిష్ట, దివి కెమిస్ట్రీ బాగుంది. లత పాత్రలో సంయుక్త మెప్పించింది. తన ప్రేమనంతా మాటల్లో కాకుండా చూపుల్లోనే కనబర్చింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? తెలంగాణలో పేరమోసిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే ‘నయీం డైరీస్’.కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ని పక్కకి పెట్టి చూస్తే.. ‘అత్యంత వివాదాస్పద, సంచలనాత్మక గ్యాంగ్‌స్టర్ కథని అంతే బోల్డ్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు దాము బాలాజీ. నయీం జీవితంలో వెలుగు చూడని అంశాలను చక్కగా తెరమీదకు తీసుకురావడంలో సఫలమయ్యారు. నయీం అసలు నక్సల్ నుంచి పోలీస్ కోవర్ట్ గా మారడానికి దారి తీసిన అంశాలేంటి? తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని ఎన్కౌంటర్ చేయడానికి కారణాలేంటి? ఓ వైపు నక్సల్స్, మరోవైపు పోలీసులు, ఇంకోవైపు రాజకీయ నాయకులు ఆయన్ని ఎలా వాడుకున్నారు? అనేది ఆసక్తికరంగా చూపించాడు. నయీం సోదరుడి మర్డర్‌కు సంబంధించిన యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్‌గా ఉంటాయి. నయీం జీవితం గురించి దర్శకుడు చేసిన పరిశోధన సినిమాకు బలంగా మారిందనే చెప్పాలి. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం సినిమాకు మైనస్. సెకండాఫ్‌లో కథను అనుసరిస్తూ సాగిన హింస.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇబ్బందిగా ఉంటుంది. మొత్తనికి తొలి చిత్రంగా దర్శకుడు మంచి మార్కులే సంపాదించాడు. ఇక సాంకెతిక విషయాలకొస్తే.. ప్రభాకర్ అరున్ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎన్కౌంటర్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌ని తెరపై చక్కగా చూపించారు. కిషోర్ మద్దాలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
నయీం డైరీని, బాగోతాల్ని బయటపెట్టాలి
సాక్షి, కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీం డైరీని, అతని బాగోతాల్ని బయటపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ నయీం బాగోతంపై న్యాయవిచారణ జరిపించాలని కోరారు. నయీం కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్న 25 మంది పోలీస్ ఆఫీసర్లకు, క్లీన్‌చీట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. దోషులను నిర్దోషులుగా ప్రకటించడం చట్టవిరుద్దమని తెలిపారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్ జీవోను, రేట్లను సవరించాలని కోరారు. ఆస్తుల క్రమబద్దీకరణకు ఇంటింటా సర్వేను సీపీఐ స్వాగతిస్తుందని తెలిపారు. ఆస్తుల క్రమబద్దీకరణతో దేవాలయ భూములను, వక్ఫ్ బోర్డు భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. (ఆ పోరాటం స్ఫూర్తిగా సీపీఐ పోరాడుతుంది) -
నయీమ్ డైరీని బయట పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ డైరీ వివరాలను బయటపెట్టాలని సీపీఐ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. నయీమ్ కేసును సీబీఐతో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మఖ్దూం భవన్లో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 12న హైదరా బాద్‌లో నయీమ్ బాధితులతో ముఖాముఖి సదస్సును నిర్వహించాలని తీర్మానిం చారు. నయీమ్ ఆస్తులతో పాటు అతనితో సంబంధమున్న రాజకీయ నేతలు, పోలీసుల ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. నయీమ్ కేసులో తీసుకున్న చర్యలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. భువనగిరి, వరంగల్, హైదరాబాద్‌లలో నయీమ్ బాధితులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఒక బుక్లెట్ విడుదల చేయనున్నట్లు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. సమావేశంలో మానవ హక్కుల వేదిక కన్వీనర్ జీవన్‌కుమార్, సీపీఎం నేత నర్సింగరావు, పౌరహక్కుల సంఘ నేత నారాయణరావు, న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్, గాదె ఇన్నయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన: చాడ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మఖ్ధూమ్ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని వివరించారు. ముందస్తు ఎన్నికలు, 2018 మహాసభల నిర్వహణ, పంచాయతీ రాజ్ చట్టం తదితర అంశాలపై తమ కార్యవర్గ సమావేశం చర్చించిందని తెలిపారు. జనసేన నాయకుడు పవన్ కల్యాణ్‌కు తన మాటలపై తనకే స్పష్టత లేదని చాడ విమర్శించారు -
నయీమ్ కేసును లైట్ తీసుకోండి!
-
నయీమ్ కేసును లైట్ తీసుకోండి!
సెటిల్మెంట్ కోసం రంగంలోకి ఓ రిటైర్డ్ డీజీపీ ► విచారణ ఎదుర్కొంటున్న వారంతా ఆయన శిష్యులే ► వారం క్రితం సీఎం కార్యాలయానికి వెళ్లిన వైనం ► సాదాసీదా చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి ► ఈ ఒత్తిళ్లను పట్టించుకోని పోలీసు శాఖ ► నయీమ్ డైరీలో 22 పేజీలు మాయంపై సందేహాలు! సాక్షి, హైదరాబాద్ ఆయనో సీనియర్ ఐపీఎస్.. కేంద్ర సర్వీసుల్లో కీలక విభాగాలకు అధిపతిగా పనిచేసిన రాష్ట్ర కేడర్ అధికారి. ఇటీవలే పదవీ విరమణ సైతం పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన విభాగాలకు చీఫ్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే నయీమ్, నయీమ్‌తో అంటకాగిన ఖాకీలతో సంబంధాలు అల్లుకున్నాయి. పదమూడేళ్ల కింద కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయిన ఆయన తిరిగి ఇటువైపు కన్నెత్తి చూడలేదు కూడా. కానీ ఆ అధికారి, అదీ పదవీ విరమణ పొందిన తర్వాత నయీమ్ కేసును ప్రభావితం చేసేందుకు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఆ రిటైర్డ్ డీజీపీ రాష్ట్రంలో పనిచేసిన సమయంలో తన శిష్యులుగా ముద్రపడ్డ ఆరుగురు అధికారులు నయీమ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. తమపై చర్యలు తప్పవని గ్రహించిన ఆ అధికారులు.. వెళ్లి రిటైర్డ్ డీజీపీ వద్ద మొరపెట్టుకున్నారు. తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చిన ఆయన.. వారం క్రితం నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. రాష్ట్రంలో కీలక అధికారిగా ఉంటూ, సీఎంకు నమ్మినబంటు అయిన ఓ సీనియర్ అధికారి వద్దకు నేరుగా వెళ్లి లాబీయింగ్‌కు ప్రయత్నించినట్లు తెలిసింది. నయీమ్ కేసులో తమ వారిపై ఏవో చిన్న చిన్న చర్యలు తీసుకోవాలని ఆయన ప్రతిపాదించగా.. సదరు సీనియర్ అధికారి మాత్రం దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారని సమాచారం. సీఎం వద్ద తనకంత సీన్ లేదని, సిట్ నివేదిక పూర్తి ఆధారాలతో ఉందని ఆ అధికారి స్పష్టం చేసినట్లు తెలిసింది. అంతేకాదు తానేం చెప్పినా సరే.. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు నివేదించినదానినే సీఎం ఆమోదిస్తారని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఎలాగైనా ప్రయత్నం చేసి తమ వారిని రక్షించాలని సదరు రిటైర్డ్ డీజీపీ వేడుకున్నట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. సీఎంకే చెప్పండి! రిటైర్డ్ డీజీపీ ప్రతిపాదనను సంబంధిత సీనియర్ అధికారి పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. సస్పెన్షన్, విచారణ జరగకుండా చూడాలని కోరినట్లు తెలిసింది. అయితే ఉన్నతాధికారులు సైతం మొహమాటం లేకుండా సమాధానమిచ్చినట్లు సమాచారం. ‘మీరు ఏదైనా చెప్పాలని అనుకుంటే నేరుగా ముఖ్యమంత్రికి చెప్పండి. అంతేగానీ మా వద్ద ఇలాంటి పైరవీలు చేయొద్దు..’అని సూటిగా స్పష్టం చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక ఇటు సీఎంఓ అధికారి, అటు రిటైర్డ్ డీజీపీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. నయీమ్ డైరీలో ఆ పేజీలెక్కడ..? తాను చేసిన ప్రతి పని, సెటిల్మెంట్లు, దందాలు, అందించిన నజరానాలు.. ఇలా ప్రతీ అంశాన్ని నయీమ్ తన డైరీలో రాసిపెట్టాడు. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన వెంటనే అల్కాపురికాలనీలోని అతడి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించి.. డాక్యుమెంట్లు, ఆయుధాలు, నగదు, బంగారం వంటి వాటితో పాటు పలు డైరీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డైరీల్లో దాదాపు 22 పేజీలు మాయమవడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. సోదాలు చేసిన సమయంలోనే పోలీసు అధికారులు ఆ పేజీలను చించేశారా? నయీమే ఆ పేజీలను చింపేసి ఉంటాడా అన్న విషయంలో స్పష్టత లేదు. అయితే నయీమ్ భార్య, సోదరి ఇచ్చిన వాంగ్మూలాల మేరకు.. నయీమ్ తన డైరీల్లో ప్రతీ విషయం రాసుకునే వాడని, ఏ ఒక్క పేజీ కూడా చింపేవాడు కాదని చెప్పినట్టు తెలిసింది. నయీమ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొని సాధారణ పనిష్మెంట్లకు గురైన ఓ సీనియర్ అధికారి నేతృత్వంలోని బృందమే మొదటగా నయీమ్ ఇంట్లో సోదాలు నిర్వహించి డైరీలు, డాక్యుమెంట్లు, ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఆ అధికారి నేతృత్వంలోని బృందమే డైరీల్లోని పేజీలు చించేసి ఉంటుందన్న కోణంలో సిట్ విచారణ సాగిస్తోంది. నయీమ్ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ కూడా డిలీట్ కావడం దీనికి ఆధారంగా భావిస్తోంది. సంబంధిత అధికారి, సిబ్బందిని మళ్లీ విచారిస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయని సిట్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఆ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై క్రిమినల్ కేసులు! ఇక నయీమ్ కేసును మూసేస్తారన్న భావన నెలకొన్న తరుణంలో ఒక్కసారిగా సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై పూర్తి ఆధారాలతో డీజీపీకి నివేదిక అందించగా.. పోలీసు శాఖ చర్యలు కూడా చేపట్టింది. మరి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంగతేమిటని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తదుపరి టార్గెట్ రాజకీయ నాయకులే అని సిట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యేను ప్రశ్నించామని.. మరో ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలను ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు. ఈ నలుగురితోపాటు నియోజకవర్గ ఇన్చార్జులుగా ఉన్న మరో ఇద్దరు నేతలు కూడా నయీమ్‌తో చేసిన దందాలపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక పంపించామని వెల్లడించారు. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపడతామని, చార్జిషీట్లో వారి పేర్లు చేర్చాల్సి ఉంటుందని.. దీనిపై వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.