గ్యాంగ్‌స్టర్ నయీమ్ తన బావను మూడేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలోనే హత్య చేసినట్లు సిట్ విచారణలో తేలింది..,
* మూడేళ్ల కిందట పెద్దతూప్రలో పెట్రోలు పోసి తగలబెట్టారు
* మృతుడు నయీమ్ సోదరి భర్త నదీమ్‌గా గుర్తింపు
* సిట్ విచారణలో వెలుగులోకి..
శంషాబాద్ రూరల్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ తన బావను మూడేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలోనే హత్య చేసినట్లు సిట్ విచారణలో తేలింది. అతని సోదరి భర్త విజయ్‌కుమార్ అలియాస్ నదీమ్‌ను అతి కిరాతంగా మట్టుపెట్టి శంషాబాద్ మండలం పెద్దతూప్ర సమీపంలో పెట్రోలు పోసి తగులబెట్టాడు. ఈ కేసు ఇప్పటి వరకు మిస్టరీగానే ఉండగా.. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం అతని అనుచరులను సిట్ అధికారుల విచారణ చేస్తుండడంతో పెద్దతూప్రలో జరిగిన హత్య విషయం వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. 2013 ఫిబ్రవరి 2న రంగారెడ్డి జిల్లా పెద్దతూప్ర-చిన్నతూప్ర రోడ్డు సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని పొలాల్లో ఉన్న గుంతల్లో పడేసి పెట్రోలు పోసి తగులబెట్టారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో అతని ఆచూకీ తెలియలేదు. మృతుడి ఒంటిపై ఎర్రరంగు డ్రాయర్, నైట్ ప్యాంటు మాత్రమే ఉన్నాయి. హతుడికి సంబంధించి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశారు. ఇదిలావుండగా.. నయీమ్ అనుచరుల సమాచారంతో ఈ కేసును వారం క్రితమే పోలీసులు ఛేదిం చినట్లు తెలిసింది. మృతుడి అస్థికలను సేకరించి, అతడి తల్లి డీఎన్ ఏ పరీక్షలు చేసి హతుడు నదీమ్ అని నిర్ధారించారు. ఈ హత్య కేసులో నలుగురి ప్రమేయం ఉండవచ్చని సమాచారం.