ఖాకీలపై వేటు! | police suspensions starts after assembly sessions | Sakshi
Sakshi News home page

ఖాకీలపై వేటు!

Published Sun, Jan 8 2017 1:30 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

ఖాకీలపై వేటు! - Sakshi

ఖాకీలపై వేటు!

నయీమ్‌ కేసులో చర్యలకు ప్రభుత్వం ఆదేశం?
 
♦ అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సస్పెన్షన్‌ వేటుకు నిర్ణయం
♦ ఆ తర్వాత నోటీసులిచ్చి విచారించనున్న సిట్‌
♦ జాబితాలో ముగ్గురు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు..
♦ 9 మంది ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు ఎస్సైలకూ బిగుస్తున్న ఉచ్చు
నయీమ్‌తో సంబంధాలున్న రిటైర్డ్‌ అధికారులపైనా చర్యలు
♦ మరిన్ని ఆధారాలు లభించాక క్రిమినల్‌ కేసుల నమోదు
ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకూ ఉద్వాసన!  
 
సాక్షి, హైదరాబాద్‌
గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కేసులో కీలక చర్యల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. నయీమ్‌తో అంటకాగిన పోలీసు అధికారులపై వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కొంత మంది నేతలు, పోలీసు అధికారుల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందన్న ఆరోపణలకు చెక్‌పెట్టడంతో పాటు నేరాలు, నేరస్తులపై ఉక్కుపాదం మోపే దిశగా చర్యలు తీసుకుంటుందన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో నాలుగు నెలలుగా సిట్‌ అధికారులు చేసిన దర్యాప్తు, అధికారుల విచారణకు కూడా లైన్‌ క్లియరైనట్లు అభిప్రాయపడుతున్నాయి.
 
తొలుత సస్పెన్షన్‌ వేటు..
నయీమ్‌తో సంబంధాలు, దావత్‌లు, దందాలు నడిపించిన ఖాకీలపై తొలుత సస్పెన్షన్‌ వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల జాబితా కూడా సీఎం కేసీఆర్‌కు అందిందని... వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని, సిట్‌ దర్యాప్తులో బయటపడ్డ ఆధారాలను బట్టి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా పక్కా ఆధారాలున్న అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేయనున్నట్లు తెలిపాయి. ఆయా అధికారులపై వేటు అనంతరం నోటీసులిచ్చి, పూర్తి వివరాలు రాబట్టాలని సిట్‌ అధికారులు సైతం భావిస్తున్నారు.
 
24 మందిపై నయీమ్‌ ఎఫెక్ట్‌..!
2001 నుంచి నయీమ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించే వరకు అతడితో సంబంధాలు కొనసాగించిన అధికారుల జాబితా తయారైంది. అందులో ఎస్సై ర్యాంకు నుంచి నాన్‌కేడర్‌ అదనపు ఎస్పీ హోదా ఉన్న అధికారుల వరకు ఉన్నారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 9 మంది ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు ఎస్సైలు సస్పెన్షన్‌ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఇప్పటికే ఇద్దరు డీఎస్పీలను సిట్‌ సైబరాబాద్‌లోని కమిషనరేట్‌లో విచారించింది. వీరిలో ఒక అధికారి ఇటీవలి బదిలీల్లో సంగారెడ్డి జిల్లాలో శాంతి భద్రతల డీఎస్పీగా పోస్టింగ్‌ కూడా పొందారు. ఇక కీలకమైన రెండు విభాగాల్లో పనిచేస్తున్న ముగ్గురు అదనపు ఎస్పీలను విచారించాల్సి ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అదే విధంగా సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న మరో డీఎస్పీని, భద్రతా విభాగంలో పనిచేస్తున్న మరో అధికారి ఈ జాబితాలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
 
సంభాషణల్లో గుట్టు!
హైదరాబాద్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఓ డీఎస్పీ (ఏసీపీ), ట్రాఫిక్‌లో పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్‌ నయీమ్‌తో పదేపదే సంభాషణలు సాగించినట్టు సోదాల సందర్భంగా లభించిన ఆడియో సీడీల ద్వారా వెల్లడైనట్లు సమాచారం. ఇక పైఅధికారుల ఒత్తిడితో పాటు ఉడతా భక్తిగా చిన్న చిన్న సెటిల్‌మెంట్లు చేసిన ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలపైనా వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని విభాగాల్లో కీలకంగా పనిచేస్తున్న రిటైర్డ్‌ అధికారులకు ఉద్వాసన కూడా పలికే అవకాశముందని సమాచారం. నిఘా విభాగంలో పనిచేస్తున్న ఆ ఇద్దరు రిటైర్డ్‌ అధికారులను ఇంటికి పంపించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
 
ఆధారాలుంటే క్రిమినల్‌ కేసులు
నయీమ్‌తో సంబంధాలున్న 24 మంది పోలీసు అధికారుల్లో 12 మందిని సిట్‌ పూర్తిస్థాయిలో విచారించించింది. అయితే పక్కాగా ఆధారాలు లభించిన అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే జరిగితే సిట్‌ జాబితాలో ఉన్నవారిలో సగానికి పైగా జైలుకెళ్లక తప్పదని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
 
ఆ నేతలకు ఝలక్‌ తప్పదా?
ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధులకు కూడా నయీమ్‌ ఎఫెక్ట్‌ తీవ్రంగానే పడే అవకాశముందని విశ్వసనీయంగా తెలిసింది. వారిలో ఒక ప్రజాప్రతినిధి నిత్యం నయీమ్‌తో మాట్లాడటం, సెటిల్‌మెంట్లలో ‘భాయ్‌తో లొల్లి వద్దు’అంటూ బెదిరించినట్లుగా రికార్డులు సిట్‌ బృందాలకు లభించాయి. మరో ప్రజాప్రతినిధి తనకెలాంటి సంబంధంలేదని చెబుతున్నా... నయీమ్‌తో ఆయన తుక్కుగూడ ఫాంహౌస్‌లో డ్యాన్స్‌లు చేసిన వీడియో, గోవా బీచ్‌లో దిగిన ఫొటోలు పక్కా ఆధారాలుగా నిలవబోతున్నాయి. దీంతో వీరిద్దరిపై అధికార పార్టీ వేటు వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
 
అసెంబ్లీకి ముందే ఆదేశాలు
నయీమ్‌తో సంబంధాలున్న పోలీసు అధికారులపై వేటు వేయాలని అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విశ్వసనీయంగా తెలిసింది. అయితే ప్రజాసమస్యలపై సభలో చర్చ జరగాల్సి ఉండటం, బిల్లులు ఆమోదం పొందాల్సి ఉండటంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులపై వేటు వేయాలంటూ ఆదేశాలు కూడా వెళ్లాయని.. ఈ మేరకు జాబితాపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారనే చర్చ జరుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement