
ఇక వేటే!
గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలున్న రాజకీయ నేతలు, అధికారులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతోంది.
నయీమ్ కేసులో చర్యలకు సిద్ధమవుతున్న సర్కారు
జాబితాలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు
ఆ నలుగురూ నల్లగొండకు చెందినవారే..
వినాయక నిమజ్జనోత్సవాల తర్వాత కీలక పరిణామాలు
కీలక నివేదికను సీఎంకు అందజేసిన డీజీపీ
జాబితాలో 21 మంది పోలీసు అధికారులు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలున్న రాజకీయ నేతలు, అధికారులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతోంది. ముందుగా నయీమ్‌తో సంబంధం ఉన్న సొంత పార్టీ నేతలపైనే వేటు వేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. వినాయక నిమజ్జనోత్సవాల తర్వాత పలు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.
నయీమ్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు దర్యాప్తులో తేలిన ముఖ్యాంశాలు, కీలకమైన విచారణ నివేదికను డీజీపీ అనురాగ్‌శర్మ సీఎంకు అందజేశారు. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 21 మంది పోలీసు అధికారుల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ నలుగురు నేతలు న ల్లగొండ జిల్లాకు చెందిన వారే కావటం గమనార్హం.
నయీమ్‌ను పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా ఈ నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. ఇన్‌ఫార్మర్ కోణంలో నయీమ్‌తో సంబంధాలున్న అధికారులను మినహాయించి గ్యాంగ్‌స్టర్‌గా అతడిని ఉపయోగించుకున్న నాయకులు, అధికారుల జాబితాను ఈ నివేదికలో పొందుపరిచారు.
కొందరు ఐపీఎస్ అధికారులకు నయీమ్‌తో సంబంధాలున్నప్పటికీ.. జాబితాలో డీసీపీలు, ఏసీపీలు, డీఎస్పీలు, సీఐ, ఎస్సై స్థాయి హోదాకు చెందిన పోలీసు అధికారుల పేర్లున్నాయి. ఈ జాబితాలో ఉన్న వారెంతటి వారైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. న్యాయ నిపుణుల సలహా తీసుకొని తదుపరి చర్యలకు సిద్ధం కావాలని సూచించినట్లు సమాచారం.
కొందరు ఐపీఎస్ అధికారులకు సైతం నయీమ్‌తో సంబంధాలున్నాయని ఈ నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. ముందుగా ఐపీఎస్‌ల జోలికి వెళ్లకుండా నయీమ్‌ను అడ్డం పెట్టుకొని అక్రమాలు, బెదిరింపులు, భూకబ్జాలకు పాల్పడిన వారిపై వేటు వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నయీమ్ దందాలతో సంబంధం ఉన్న ఒకరిద్దరు ఐపీఎస్‌లను వినాయక నిమజ్జనోత్సవాల తర్వాత అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసే అవకాశాలున్నాయి.