చెప్పుడు మాటలు విని తప్పు చేస్తున్నారు
⇒ కేసీఆర్‌పై సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
⇒ ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో నిప్పులా బతికా
⇒ నయీమ్ కేసులో ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో తన గురించి వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని, అధికార టీఆర్‌ఎస్ పార్టీ కావాలనే తనతోపాటు తన సోదరుడు, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డిపై తప్పుడు వార్తలు రాయిస్తోందని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 20ఏళ్లుగా రాజకీయ జీవితంలో నిప్పులా బతుకుతున్న తన కుటుం బం ఇమేజ్‌ను దెబ్బతీసేందుకే అధికార పార్టీ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని, సీఎం కేసీఆర్ కూడా చెప్పుడు మాటలు విని తప్పు చేస్తున్నారన్నారు.
శుక్రవారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నయీమ్ కేసులో ఎంతటివారున్నా శిక్షించాలని, అలా జరగాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. నయీమ్ చనిపోయిన 40రోజుల తర్వాత తమపై వార్తలు రాయిస్తున్నారని, ఇవి చూస్తే జాలేస్తోందని అన్నారు. సాక్ష్యాధారాలు ఉంటే తమ పేర్లు పెట్టి రాయాలని, తాను తప్పు చేస్తే ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనని పేర్కొన్నారు.
సీఎం ఇలా చేస్తారనుకోలేదు...
‘నా కుమారుడు చనిపోయిన తర్వాత మా కుటుంబం అంతా బాధలో ఉంది. నాగేందర్ ఫిర్యాదులో నయీమ్ నా కొడుకును చంపించాడని ప్రస్తావించిన తర్వాత మా కుటుంబం అంతా శోకంతో ఉండిపోయింది. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కేసులో దొరికిన తర్వాత జిల్లాలో, రాష్ట్రంలో కోమటిరెడ్డి సోదరులకున్న ఇమేజ్‌ను ఖరాబ్ చేయాలనే ఆలోచనతో మా జిల్లాకు చెందిన కొందరు నేతలు, మంత్రి కలసి సీఎంపై ఒత్తిడి తెస్తున్నారు. వారి ఒత్తిడి వల్లే సీఎం తప్పుడు చర్యలకు పాల్పడుతున్నారు.’ అని కోమటిరెడ్డి ఆరోపించారు. సీఎం ఇలా చేస్తారని తాను కలలో కూడా ఊహించలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై గెలిచిన తర్వాతే తమపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. సెటిల్‌మెంట్లు, రౌడీయిజానికి తన కుటుంబం వ్యతిరేకమన్నారు.
చంపుతామని నయీమ్ బెదిరించాడు
‘గత డిసెంబర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నయీమ్ నా అనుచరులకు ఫోన్లు చేశాడు. నన్ను, నా సోదరుడు రాజగోపాల్‌రెడ్డిని చంపుతానని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ భర్త శ్రీనివాస్, భువనగిరి నేత పోతంశెట్టి వెంకటేశ్వర్లును బెదిరించాడు. ఎన్నికలైన తర్వాత నేనే స్వయంగా శ్రీనివాస్‌ను తీసుకెళ్లి ఐపీఎస్ శివధర్‌రెడ్డికి ఫిర్యాదు చేయించాను’ అని కోమటిరెడ్డి చెప్పారు. అయినా మానవత్వం లేకుండా టీఆర్‌ఎస్‌కు చెందిన జిల్లా నేతలు చెప్పిన మాటలు విని కేసీఆర్ తమను వేధించడం తగునా అని ఆయన ప్రశ్నించారు.