TRS MLAs and MLCs
-
అసమ్మతి మంటలు
గులాబీ రాజకీయం రచ్చకెక్కుతోంది. టికెట్ల ప్రకటనతో మొదలైన చిచ్చు.. రోజురోజుకు పెరుగుతోంది. మొన్నటివరకు కేవలం ప్రకటనలకే పరిమితమైన అసమ్మతి కాస్తా.. ఆందోళనల వరకు వెళ్లింది. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. అదేవిధంగా చేవెళ్లలో కేఎస్ రత్నం, ఆయన వర్గీయులు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. షాద్‌నగర్‌లో అంజయ్యయాదవ్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: టీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ శాసనసభ్యులకు టికెట్లను ఖరారు చేయడంతో అసంతృప్తికి లోనైన ఆశావహులు భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. దీంతో అసంతుష్ట నేతలతో టీఆర్ఎస్ నాయకత్వం చర్చలు జరుపుతోంది. టికెట్టు రాకపోవడంతో నిరాశకు గురైన కొందరు మాత్రం స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉంటామని ప్రకటిస్తుండగా.. మంత్రి కేటీఆర్ జరిపిన చర్చలతో కల్వకుర్తి సెగ్మెంట్ అసమ్మతి నేతలు మెత్తబడ్డట్లు తెలిసింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నేతలు గోలి శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీసింగ్, విజితారెడ్డితో భేటీ అయిన ఆయన.. కలిసికట్టుగా పనిచేయాలని హితోపదేశం చేసినట్లు సమాచారం రత్నం రాజీనామా.. గత ఎన్నికల వేళ టీఆర్ఎస్ గూటికి చేరిన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. భారీగా హాజరైన అనుచరుల మధ్య పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. సొంతపార్టీ నేతల కుట్రలు, టికెట్టు ఇవ్వకుండా అవమానాలు భరించలేకే టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. 2014 ఎన్నికల్లో తనపై ప్రత్యర్థిగా దిగి గెలిచిన కాలె యాదయ్యను పార్టీలో చేర్చుకోవడమేగాకుండా ఆయనకే తిరిగి టికెట్టు కట్టబెట్టడంతో రత్నం వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్టు ఖరారు చేయాలని నిర్ణయించిన గులాబీ హైకమాండ్.. రత్నంకు వికారాబాద్ సీటును కేటాయించే అంశాన్ని పరిశీలించింది. దీనిపై కూడా స్పష్టతనివ్వకుండా నాన్చడంతో టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు. అయితే, రత్నం పార్టీని వీడకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్యవర్తిత్వం నెరిపినా ఫలితం లేకుండా పోయింది. షాద్‌నగర్‌లో బలప్రదర్శనలు షాద్‌నగర్ సీటును సిట్టింగ్ శాసనసభ్యుడు అంజయ్యయాదవ్‌కు ఖరారు చేయడంతో ఆయన వైరివర్గం రోడ్డెక్కింది. మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వ్యతిరేకవర్గాలను ఏకం చేస్తోంది. సీనియర్ నేతలు వీర్లపల్లి శంకర్, అందె బాబయ్య ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేయగా బుధవారం అంజయ్య సొంత మండలమైన కేశంపేటలో సమావేశాన్ని ఏర్పాటు చేసి సవాల్ విసిరింది. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన టీఆర్ఎస్ అధిష్టానం.. అసమ్మతి నేతల బుజ్జగింపునకు ఎంపీ జితేందర్‌రెడ్డి, మంత్రి లక్ష్మారెడ్డిని రంగంలోకి దించింది. ఈ మేరకు శంకర్, బాబయ్య ముఖ్య అనుచరులతో మంతనాలు జరిపారు. అంజయ్యకు సహకరించాలని, అధికారంలోకి వచ్చినా తర్వాత అందరికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రతిపాదనలకు ససేమిరా అన్న ఇరువురి అనుచరవర్గం.. రెబల్‌గా బరిలో దిగుతామని స్పష్టం చేసింది. ‘పట్నం’లోనూ మంటలు ఇబ్రహీంపట్నంలోనూ అసమ్మతి రాజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీపీ నిరంజన్‌రెడ్డి, శేఖర్‌గౌడ్ అసమ్మతిరాగం వినిపిస్తున్నారు. కిషన్‌రెడ్డికి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ ఇప్పటికే అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో కొందరు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో శేఖర్‌గౌడ్ నేతృత్వంలో కిషన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోవైపు గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర అవమానభారంతో కుంగిపోతున్నారు. 2014 ఎన్నికల్లో కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నిలిచిన తనను పక్కనపెట్టడంతో నారాజ్ అయ్యారు. విలువలేని పార్టీలో కొనసాగడం కన్నా.. ప్రత్యామ్నాయం చూసుకోవడం మేలని ఆయనపై మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై మంతనాలు సాగిస్తున్నారు. ఆగని నిరసనలు.. ఎల్బీనగర్లో రామ్మోహన్‌గౌడ్‌కు వ్యతిరేకంగా కార్పొరేటర్లు జట్టు కట్టగా.. కూకట్‌పల్లిలో తాజా మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సీటు కేటాయించడంతో కార్పొరేటర్ పన్నాల కావ్య నిరసన దీక్షకు దిగారు. కుత్బుల్లాపూర్‌లో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన కొలను హన్మంతరెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించగా.. రాజేంద్రనగర్‌లో సీనియర్ నేత తోకల శ్రీశైలంరెడ్డి భారీ అనుచరగణంతో ప్రకాశ్‌గౌడ్‌కు వ్యతిరేకంగా బలప్రదర్శన చేశారు. -
టీఆర్ఎస్లో కదనోత్సాహం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎటూ చూసినా గులాబీ జెండాల రెపరెపలే... ఏ రోడ్డు చూసినా టీఆర్ఎస్ జెండాలతో కదిలే వాహనాలే.. ఆర్టీసీ బస్సులు మొదలుకొని కార్లు, ప్రైవేటు బస్సులు, ట్రాక్టర్లతోపాటు చివరికి రైళ్లు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులతోనే కిక్కిరిసి పోయాయి. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ నాయకులు తమ వాహనాలతో గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ సమీపంలోని కొంగరకలాన్‌కు వెళితే... బోథ్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల వాహనాలు బాసర, నిజామాబాద్ మీదుగా 44వ నెంబర్ జాతీయ రహదారి గుండా హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఖానాపూర్ నుంచి మాత్రం లక్సెట్టెపేట మీదుగా కరీంనగర్ నుంచి రాజీవ్ రహదారి ద్వారా హైదరాబాద్ వైపు వాహనాలు బయలుదేరి వెళ్లాయి. రోడ్లపై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గులాబీ జెండాలతో నిర్విరామంగా సాగుతున్న వాహనాల శ్రేణిని చూసి ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యే పరిస్థితి ఆదివారం నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్వంలో హైదరాబాద్ కొంగరకలాన్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ బహిరంగసభ ఘన విజయం సాధించింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా లక్షలాదిగా తరలివచ్చిన ప్రజానీకాన్ని ఉద్ధేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఉర్రూతలూగించిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, జరిగిన అభివృద్ధిని సీఎం వివరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. వచ్చే ఎన్నికల్లో జరిగిన అభివృద్ఢిని చూసి టీఆర్ఎస్కు ఓటేయమని చెప్పిన కేసీఆర్... కాంగ్రెస్, ఇతర పక్షాలకు ఓటేయడానికి ఉన్న కారణాలను కూడా ప్రశ్నించి ప్ర జలను ఆలోచనలో పడేశారు. ఈ నేపథ్యంలో స భకు వెళ్లిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు టీవీలకు అతుక్కుపోయిన జనం సైతం స భ జరిగిన తీరుపై విస్తృతంగా చర్చించుకున్నారు. ఆదిలాబాద్ నుంచి 70వేల పైనే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రగతి నివేదన సభకు లక్ష జనాన్ని తరలించాలని టీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10వేల మందిని లక్ష్యంగా చేసుకొని జన సమీకరణ జరపాలని మండల, గ్రామ యంత్రాంగానికి ఆదేశాలు పంపారు. కాగా ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలోని ఐదు నియోజకవర్గాల నుంచి 60వేల మందిని తరలించాలని భావించారు. ఈ మేరకు జన సమీకరణ జరిపినప్పటికీ వాహనాల కొరత వల్ల టార్గెట్ నిండలేదని నాయకులు చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి 106 ఆర్టీసీ బస్సులతోపాటు టవేరా, తుపాన్, జీప్ వంటì 180 వాహనాల ద్వారా 10వేలకు పైగా జనం తరలినట్లు చెబుతున్నారు. నిర్మల్‌లో 88 ఆర్టీసీ బస్సులతోపాటు 80 స్కూలు బస్సులు, 180 జీపులు, కార్ల ద్వారా 10 వేల మంది వరకు తరలినట్లు నియోజకవర్గం నాయకులు చెబుతున్నారు. సిర్పూరు నియోజకవర్గంలో 50 ఆర్టీసీ బస్సులతోపాటు 100 కార్లు, ఇతర వాహనాల ద్వారా వెళ్లిన జనంతోపాటు దక్షిణ్, నాగపూర్ ఎక్స్‌ప్రెస్, భాగ్యనగర్, ఇంటర్సిటీ రైళ్ల ద్వారా 12వేల మంది వరకు జనం తరలివెళ్లినట్లు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుయాయులు స్పష్టం చేస్తున్నారు. బోథ్ నుంచి 8 ఆర్టీసీ బస్సులు, 25 స్కూలు బస్సులు, ఇతర వాహనాలు 511 కలిపి 544 వాహనాలు వెళ్లినట్లు అధికారికంగా లెక్కలున్నాయి. బెల్లంపల్లి, ఆసిఫాబాద్, చెన్నూరుల నుంచి కూడా ఒక్కో నియోకజవర్గానికి 7వేలకు తగ్గకుండా జనాన్ని సమీకరించి పంపించినట్లు వారి వర్గీయులు లెక్కలు చెబుతున్నారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్‌రావుతోపాటు టిక్కెట్లు ఆశిస్తున్న ఒకరిద్దరు ముఖ్య నాయకులు సొంత ఖర్చుతో వాహనాలు ఏర్పాటు చేశారు. అన్ని స్థాయిల నాయకులదీ ఒకటే లక్ష్యం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ఇతర నాయకులు సైతం జన సమీకరణలో పోటీ పడ్డారు. ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశిస్తున్న ఎంపీలతోపాటు ఇతర నాయకులు కూడా వాహనాలు ఏర్పాటు చేసి జనాన్ని తరలించారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్‌రావుతోపాటు టిక్కెట్టు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే గోనె హన్మంతరావు తనయుడు గోనె విజయ్‌కుమార్, చలనచిత్ర అభివృద్ధి మండలి చైర్మన్ పుస్కూరి రామ్మోహన్రావు, బీసీ నాయకుడు బేర సత్యనారాయణ, మునిసిపల్ చైర్పర్సన్ ఎం.వసుంధర తదితరులు జన సమీకరణలో పాలు పంచుకున్నారు. చెన్నూరులో ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ నల్లాల ఓదెలుతోపాటు ఈ నియోజకవర్గం టికెట్టు ఆశిస్తున్న ఎంపీ బాల్క సుమన్ కూడా భారీగానే జన సమీకరణ జరిపారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు పోటీగా టిక్కెట్టు ఆశిస్తున్న ప్రవీణ్‌కుమార్ తన వర్గీయుల కోసం వాహనాలు ఏర్పాటు చేశారు. బోథ్‌లో ఎమ్మెల్యే బాపూరావుకు పోటీగా ఎంపీ గోడెం నగేష్, ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్‌కు పోటీగా రాథోడ్ రమేష్ జన సమీకరణ జరిపారు. వీరికి తోడు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, రైతు సమన్వయ సమితి నాయకులు, జిల్లా, మండల పరిషత్ సభ్యులు సొంత కార్లలో హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. -
ఎవరికి వారే.. యమునా తీరే
భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి, గండ్ర సత్యనారాయణ వర్గాలు వేర్వేరుగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో కనీసం వేదికను పంచుకునే పరిస్థితి లేదు. ములుగు నియోజకవర్గం నుంచి మంత్రి చందూలాల్ ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ఆయన ఎక్కువగా ప్రభుత్వ కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎన్నికలకు ఏడాది సమయమే ఉన్నా.. అధికార పార్టీ టీఆర్ఎస్లో ఐక్యతా రాగం వినిపించడం లేదు. అంతా కలిపి ఒక్కటిగా పార్టీ వాణి వినిపించే ప్రయత్నం గతంతో పోల్చితే తగ్గిపోయింది. పార్టీలో అంతర్గత విభేదాలు తగ్గించి ఒక్కతాటిపై నడిపించేందుకు ఉద్దేశించిన ఆత్మీయ సమావేశాల ఊసే లేదు. జిల్లాల విభజన జరిగిన తర్వాత ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా పనిచేసుకుంటున్నారు. 2009 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగానే ఎక్కువ గుర్తింపు పొందింది. డిసెంబరు 9 ప్రకటన తర్వాత టీఆర్ఎస్ పార్టీ క్రమంగా బలపడుతూ వచ్చింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టారు. పాత, కొత్త నేతల కలయిక తర్వాత ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పార్టీ పరంగా ప్రతి నెల ఆత్మీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆత్మీయ సమావేశాలు 2016 ప్రారంభంలో ఒకటి, రెండు సార్లు జరిగాయి. ఆ తర్వాత జిల్లాల విభజన అంశం తెరపైకి రావడంతో స్థానిక డిమాండ్లకు అనుగుణంగా ఎక్కడి నేతలు అక్కడే తమ ప్రాంతాలకే పరిమితం కావాల్సి వచ్చింది. జిల్లాల విభజన జరిగి ఏడాది కావొస్తున్నా.. నేతలందరూ ఒక్క తాటిపైకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నాయకులను, కార్యకర్తలను ఒక్కతాటిపై నడిపించే నేతలు పార్టీలో కరువయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరి, చందూలాల్ ఇద్దరు మంత్రులుగా ఉన్నా.. పార్టీని సమన్వయం చేసే పరిస్థితి లేదు. వీరిద్దరు ఐదు జిల్లాలో పర్యటిస్తున్నా.. ఎక్కువగా ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. పార్టీలో నేతల మధ్య సమన్వయం సాధించేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో గ్రూపులు బలపడతున్నాయి. దీనికి తోడు ఉద్యమకారులకు పార్టీలో సరైన గుర్తింపు లేకుండా పోతుందంటూ ఇటీవల అసమ్మతి గళం విప్పుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన వారికి ప్రస్తుతం పార్టీలో గుర్తింపు లేదంటూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్త నేతలతో మాట్లాడి వారి రాజకీయ భవిష్యత్‌కు హామీ ఇచ్చి నచ్చజెప్పే ప్రయత్నం పార్టీ పరంగా జరగడం లేదు. వరంగల్ తూర్పులో అచ్చ విద్యాసాగర్ వంటి నేతలు బహిరంగ లేఖ రాసినా.. పార్టీ నుంచి సరైన స్పందన లేదు. దీంతో అచ్చ విద్యాసాగర్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్ఎస్లో కొత్తవారికే పదవులు దక్కుతున్నాయి.. పాత వారికి ప్రాధాన్యం లేదంటూ మార్చిలో గీసుకొండలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సమావేశం నిర్వహించారు. ఇద్దరు మంత్రులు ఉన్నా.. పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యేను ఆ సమావేశం దగ్గరకు పంపారు. దీంతో సంతృప్తి చెందని వారు వారం తర్వాత రెండో సమావేశం నిర్వహించారు. పదవులు పొందిన నేతలు పార్టీ పటిష్టతకు పనిచేయడం లేదని, దీని ఫలితంగా పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఇక వేటే..!
-
ఇక వేటే!
నయీమ్ కేసులో చర్యలకు సిద్ధమవుతున్న సర్కారు జాబితాలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ నలుగురూ నల్లగొండకు చెందినవారే.. వినాయక నిమజ్జనోత్సవాల తర్వాత కీలక పరిణామాలు కీలక నివేదికను సీఎంకు అందజేసిన డీజీపీ జాబితాలో 21 మంది పోలీసు అధికారులు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలున్న రాజకీయ నేతలు, అధికారులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతోంది. ముందుగా నయీమ్‌తో సంబంధం ఉన్న సొంత పార్టీ నేతలపైనే వేటు వేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. వినాయక నిమజ్జనోత్సవాల తర్వాత పలు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. నయీమ్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు దర్యాప్తులో తేలిన ముఖ్యాంశాలు, కీలకమైన విచారణ నివేదికను డీజీపీ అనురాగ్‌శర్మ సీఎంకు అందజేశారు. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 21 మంది పోలీసు అధికారుల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ నలుగురు నేతలు న ల్లగొండ జిల్లాకు చెందిన వారే కావటం గమనార్హం. నయీమ్‌ను పోలీస్ ఇన్ఫార్మర్గా, గ్యాంగ్‌స్టర్‌గా ఈ నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. ఇన్ఫార్మర్ కోణంలో నయీమ్‌తో సంబంధాలున్న అధికారులను మినహాయించి గ్యాంగ్‌స్టర్‌గా అతడిని ఉపయోగించుకున్న నాయకులు, అధికారుల జాబితాను ఈ నివేదికలో పొందుపరిచారు. కొందరు ఐపీఎస్ అధికారులకు నయీమ్‌తో సంబంధాలున్నప్పటికీ.. జాబితాలో డీసీపీలు, ఏసీపీలు, డీఎస్పీలు, సీఐ, ఎస్సై స్థాయి హోదాకు చెందిన పోలీసు అధికారుల పేర్లున్నాయి. ఈ జాబితాలో ఉన్న వారెంతటి వారైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. న్యాయ నిపుణుల సలహా తీసుకొని తదుపరి చర్యలకు సిద్ధం కావాలని సూచించినట్లు సమాచారం. కొందరు ఐపీఎస్ అధికారులకు సైతం నయీమ్‌తో సంబంధాలున్నాయని ఈ నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. ముందుగా ఐపీఎస్‌ల జోలికి వెళ్లకుండా నయీమ్‌ను అడ్డం పెట్టుకొని అక్రమాలు, బెదిరింపులు, భూకబ్జాలకు పాల్పడిన వారిపై వేటు వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నయీమ్ దందాలతో సంబంధం ఉన్న ఒకరిద్దరు ఐపీఎస్‌లను వినాయక నిమజ్జనోత్సవాల తర్వాత అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసే అవకాశాలున్నాయి. -
అవినీతిపై మీరా మాట్లాడేది ?
హైదరాబాద్ : మల్లన్నసాగర్‌పై రాజకీయం చేస్తున్నాయని ప్రతిపక్షాలపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు. మంగళవారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంయుక్తంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లను అడ్డుకోవడం సరికాదని ప్రతిపక్షాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు సూచించారు. ఎవరు అడ్డుకున్నా... ప్రాజెక్ట్‌ల నిర్మాణం మాత్రం ఆగదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. అవినీతి గురించి మీరా మాట్లాడేది ? అంటూ టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.భట్టి విక్రమార్కపై బాలసాని లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. అవినీతిపై మీరు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేసిన ఉత్తమ్ ఆ శాఖను అవినీతిమయం చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఉత్తమ్ కారులో దొరికిన కోట్లాది రూపాయిల గురించి.. ఇప్పటి వరకు లెక్క చెప్పలేదని గుర్తు చేశారు. భట్టి విక్రమార్క పేపరు పులి అని ఆయన అభివర్ణించారు. భట్టి, ఉత్తమ్ అసమర్థులు కాబట్టే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు పెరిగాయన్నారు. ముందుగా పదవులకు రాజీనామా చేయాలని ఉత్తమ్, భట్టిలను బాలసాని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.