ఆదిలాబాద్‌రూరల్: జెండా ఊపి బస్సును ప్రారంభిస్తున్న జెడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎటూ చూసినా గులాబీ జెండాల రెపరెపలే... ఏ రోడ్డు చూసినా టీఆర్‌ఎస్ జెండాలతో కదిలే వాహనాలే.. ఆర్టీసీ బస్సులు మొదలుకొని కార్లు, ప్రైవేటు బస్సులు, ట్రాక్టర్లతోపాటు చివరికి రైళ్లు కూడా టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులతోనే కిక్కిరిసి పోయాయి. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లోని టీఆర్‌ఎస్ నాయకులు తమ వాహనాలతో గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ సమీపంలోని కొంగరకలాన్‌కు వెళితే... బోథ్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల వాహనాలు బాసర, నిజామాబాద్ మీదుగా 44వ నెంబర్ జాతీయ రహదారి గుండా హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఖానాపూర్ నుంచి మాత్రం లక్సెట్టెపేట మీదుగా కరీంనగర్ నుంచి రాజీవ్ రహదారి ద్వారా హైదరాబాద్ వైపు వాహనాలు బయలుదేరి వెళ్లాయి.
రోడ్లపై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గులాబీ జెండాలతో నిర్విరామంగా సాగుతున్న వాహనాల శ్రేణిని చూసి ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యే పరిస్థితి ఆదివారం నెలకొంది. టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్వంలో హైదరాబాద్ కొంగరకలాన్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ బహిరంగసభ ఘన విజయం సాధించింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా లక్షలాదిగా తరలివచ్చిన ప్రజానీకాన్ని ఉద్ధేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఉర్రూతలూగించిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, జరిగిన అభివృద్ధిని సీఎం వివరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. వచ్చే ఎన్నికల్లో జరిగిన అభివృద్ఢిని చూసి టీఆర్‌ఎస్‌కు ఓటేయమని చెప్పిన కేసీఆర్... కాంగ్రెస్, ఇతర పక్షాలకు ఓటేయడానికి ఉన్న కారణాలను కూడా ప్రశ్నించి ప్ర జలను ఆలోచనలో పడేశారు. ఈ నేపథ్యంలో స భకు వెళ్లిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు టీవీలకు అతుక్కుపోయిన జనం సైతం స భ జరిగిన తీరుపై విస్తృతంగా చర్చించుకున్నారు.
ఆదిలాబాద్ నుంచి 70వేల పైనే..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రగతి నివేదన సభకు లక్ష జనాన్ని తరలించాలని టీఆర్‌ఎస్ నేతలు నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10వేల మందిని లక్ష్యంగా చేసుకొని జన సమీకరణ జరపాలని మండల, గ్రామ యంత్రాంగానికి ఆదేశాలు పంపారు. కాగా ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలోని ఐదు నియోజకవర్గాల నుంచి 60వేల మందిని తరలించాలని భావించారు. ఈ మేరకు జన సమీకరణ జరిపినప్పటికీ వాహనాల కొరత వల్ల టార్గెట్ నిండలేదని నాయకులు చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి 106 ఆర్టీసీ బస్సులతోపాటు టవేరా, తుపాన్, జీప్ వంటì 180 వాహనాల ద్వారా 10వేలకు పైగా జనం తరలినట్లు చెబుతున్నారు. నిర్మల్‌లో 88 ఆర్టీసీ బస్సులతోపాటు 80 స్కూలు బస్సులు, 180 జీపులు, కార్ల ద్వారా 10 వేల మంది వరకు తరలినట్లు నియోజకవర్గం నాయకులు చెబుతున్నారు.
సిర్పూరు నియోజకవర్గంలో 50 ఆర్టీసీ బస్సులతోపాటు 100 కార్లు, ఇతర వాహనాల ద్వారా వెళ్లిన జనంతోపాటు దక్షిణ్, నాగపూర్ ఎక్స్‌ప్రెస్, భాగ్యనగర్, ఇంటర్‌సిటీ రైళ్ల ద్వారా 12వేల మంది వరకు జనం తరలివెళ్లినట్లు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుయాయులు స్పష్టం చేస్తున్నారు. బోథ్ నుంచి 8 ఆర్టీసీ బస్సులు, 25 స్కూలు బస్సులు, ఇతర వాహనాలు 511 కలిపి 544 వాహనాలు వెళ్లినట్లు అధికారికంగా లెక్కలున్నాయి. బెల్లంపల్లి, ఆసిఫాబాద్, చెన్నూరుల నుంచి కూడా ఒక్కో నియోకజవర్గానికి 7వేలకు తగ్గకుండా జనాన్ని సమీకరించి పంపించినట్లు వారి వర్గీయులు లెక్కలు చెబుతున్నారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్‌రావుతోపాటు టిక్కెట్లు ఆశిస్తున్న ఒకరిద్దరు ముఖ్య నాయకులు సొంత ఖర్చుతో వాహనాలు ఏర్పాటు చేశారు.
అన్ని స్థాయిల నాయకులదీ ఒకటే లక్ష్యం
జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ఇతర నాయకులు సైతం జన సమీకరణలో పోటీ పడ్డారు. ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశిస్తున్న ఎంపీలతోపాటు ఇతర నాయకులు కూడా వాహనాలు ఏర్పాటు చేసి జనాన్ని తరలించారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్‌రావుతోపాటు టిక్కెట్టు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే గోనె హన్మంతరావు తనయుడు గోనె విజయ్‌కుమార్, చలనచిత్ర అభివృద్ధి మండలి చైర్మన్ పుస్కూరి రామ్మోహన్‌రావు, బీసీ నాయకుడు బేర సత్యనారాయణ, మునిసిపల్ చైర్‌పర్సన్ ఎం.వసుంధర తదితరులు జన సమీకరణలో పాలు పంచుకున్నారు.
చెన్నూరులో ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ నల్లాల ఓదెలుతోపాటు ఈ నియోజకవర్గం టికెట్టు ఆశిస్తున్న ఎంపీ బాల్క సుమన్ కూడా భారీగానే జన సమీకరణ జరిపారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు పోటీగా టిక్కెట్టు ఆశిస్తున్న ప్రవీణ్‌కుమార్ తన వర్గీయుల కోసం వాహనాలు ఏర్పాటు చేశారు. బోథ్‌లో ఎమ్మెల్యే బాపూరావుకు పోటీగా ఎంపీ గోడెం నగేష్, ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్‌కు పోటీగా రాథోడ్ రమేష్ జన సమీకరణ జరిపారు. వీరికి తోడు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, రైతు సమన్వయ సమితి నాయకులు, జిల్లా, మండల పరిషత్ సభ్యులు సొంత కార్లలో హైదరాబాద్‌కు తరలి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment