
మెదక్ నుంచి ప్రగతి నివేదన సభకు వెళ్తున్న ట్రాక్టర్‌పై పద్మాదేవేందర్‌రెడ్డి
సాక్షి, మెదక్: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ప్రగతి నివేదన’ సభకు భారీగా జనం శనివారం నుంచే తరలివెళ్తున్నారు. ఆదివారం హైదరాబాద్ సమీపంలోని ‘కొంగర కలాన్’లో ఈ సభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ శ్రేణులు, జనాలు తరలివెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇరువై మండలాల నుంచి లక్షకుపైగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు తరలివెళ్లనున్నారని అంచనా. మెదక్, నర్సాపూర్ ఈ రెండు నియోజకవర్గాల నుంచి దాదాపుగా 60వేల పైచిలుకు జనాన్ని తరలించేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. మెదక్ నియోజకవర్గం నుంచి శనివారమే దాదాపుగా వంద ట్రాక్టర్లలో కార్యకర్తలు, ప్రజలు కొంగర కలాన్‌కు బయలుదేరారు.
మెదక్ పట్టణంలో డిప్యూటీస్పీకర్ జెండా ఊపి ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ట్రాక్టర్ నడిపి టీఆర్‌ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాం నింపారు. అలాగే నర్సాపూర్ నుంచి శనివారం సాయంత్రం 20 ట్రాక్టర్లు బయలుదేరాయి. జిల్లాలో ఉన్న గజ్వేల్, దుబ్బాక, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు సంబంధించిన మండలాల నుంచి కూడా భారీగా తరలివెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మండల కేంద్రాలు, గ్రామాల నుంచి వాహనాలను ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి రికార్డు స్థాయిలో జనసమీకరణ జరగుతుందని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు చెబుతున్నా రు. ఈ సభను విజయవంతం చేయాలని డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు పార్టీ కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రతి మండలం నుంచి ఐదు వేల మంది..
మెదక్ పట్టణంలో జనసమీకరణపై పద్మాదేవేందర్‌రెడ్డి శనివారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ సూచించిన లక్ష్యానికి అనుగుణంగా సభకు జనాలను తరలించాలన్నారు. గ్రామాల వారీగా వాహనాలను సమకూర్చడం, భోజన వ్యవస్థ గురించి ఆరా తీసి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను తరలించేందుకు 400 వాహనాలను సిద్ధం చేశారు. ఆర్టీసీతోపాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన మొత్తం 150 బస్సులను అద్దెకు తీసుకున్నారు. అలాగే 180 డీసీఎం వాహనాలు, 120 ట్రాక్టర్లు, 100 టాటాఏస్ వాహనాల్లో జనాలను తరలించనున్నారు. ప్రతి మండలం నుంచి 5వేల మంది కార్యకర్తలు, ప్రజలను తరలించేందుకు ఏర్పాటు చేశారు. అలాగే 120 ట్రాక్టర్లు వెళ్తున్నాయి.
ఇందులో వంద ట్రాక్టర్లు శనివారమే బయల్దేరాయి. మిగితా వాహనాలు ఆదివారం బయలుదేరనున్నాయి. మెదక్ పట్టణం టీఆర్‌ఎస్ జెండాలు, బ్యానర్లతో గులాబీమయంగా మారింది. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 30వేల మందిని తరలిస్తున్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడి నుంచి 300 బస్సులు, 100 డీసీఎంలు, 200 ఆటోలు, 100 ట్రాక్టర్లతో పాటు బైక్‌లు ప్రైవేటు వాహనాల్లో తరలించెందుక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పర్యటించి నాయకులను కార్యకర్తలను కలిసి సభకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
చారిత్రాత్మక సభ
ఈ సభ చారిత్రాత్మకమైనదని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆమె మెదక్‌లో మాట్లాడారు. నియోజకవర్గం నుంచి 30వేల మందిని తరలిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా సభకు హాజరయ్యేందుకు ముందసుకు వస్తున్నట్లు తెలిపారు. సభలో పాల్గొనేందుకు కార్యకర్తల్లో ఉత్సాహం ఉన్నట్లు తెలిపారు. ఈ సభ విజయవంతం కావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు.
విజయవంతం చేయండి
కొంగర కలాన్‌లో జరిగే ప్రగతి నివేదన సభకు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రగతి నివేదన సభకు నర్సాపూర్ నుంచి 25వేల నుంచి 30 వేల మందిని తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రగతి నివేదన సభ నిర్వహణ చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌పై రోజురోజుకు ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని తెలిపారు.

మెదక్ నుంచి ప్రగతి నివేదన సభకు తరలివెళ్తున్న ట్రాక్టర్లు
Comments
Please login to add a commentAdd a comment