విద్యుత్ కాంతుల మధ్య సభ ప్రధాన వేదిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాజకీయాల్లో ఓ చారిత్రక ఘట్టానికి తెరలేవబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే ‘కీలక’ నిర్ణయానికి కొంగర కలాన్ వేదిక కానుంది. 25 లక్షల మంది ఆశేష జనవాహిని సాక్షిగా సీఎం చేసే ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెల కొంది. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్‌లో జరిగే ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధమైంది. నభూతో నభవిష్యత్‌గా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభ రాజకీయ చరిత్రలో ఓ మైలు రాయిగా నిలువనుందని టీఆర్‌ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. వచ్చే ఎన్నికలకు నాంది పలికే ఈ సభపై భారీ ఆశలు పెట్టుకుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ ప్రారంభమయ్యే ఈ సభ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంతో ముగియనుంది.
ఎటు చూసినా గులాబీమయం అన్ని దారులు కొంగర కలాన్ వైపే సాగుతున్నాయి. ప్రగతి నివేదన సభ ప్రాంగణమంతా గులాబీ వర్ణ శోభితం కాగా.. సభాస్థలికి వెళ్లే మార్గాలు పార్టీ జెండాల రెపరెపలాడుతున్నాయి. 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు తరలివచ్చే లక్షలాది మంది కార్యకర్తలకు పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి జనం రాక ప్రారంభమైంది. మంత్రుల తాకిడి.. ముఖ్యనేతల సందడితో సభా ప్రాంతంలో కోలాహలం నెలకొంది.
20 వేల మంది పోలీసుల పహారా
బహిరంగ సభకు పోలీసుశాఖ కట్టుదిట్టమైన భ ద్రతా ఏర్పాట్లను చేసింది. 20వేల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్న ఆ శాఖ.. స భా ప్రాంగణంపై సీసీ కెమెరాలతో డేగ కన్ను పె ట్టింది. లక్షలాదిగా వచ్చే వాహనాలను క్రమబద్ధీకరించేందుకు పార్కింగ్ ఏరియాల్లో పోలీసులను మోహరించింది. ఒక్కో బాధ్యతను ఐపీఎస్ స్థాయి అధికారికి కట్టబెట్టడమేకాకుండా తొలిసారి పీటీజెడ్ కెమెరాల సహాయంతో డీజీపీ మహేందర్‌రెడ్డి నేరుగా బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
రూట్లు క్లియర్!
వివిధ జిల్లాల నుంచి ప్రగతి సభకు వచ్చే ప్రజల కోసం ఏడు రూట్లను ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశం నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు పైకి నేరుగా ఎక్కేందుకు.. దిగేందుకు వీలుగా రేలింగ్‌ను కట్ చేసి.. మట్టితో చదును చేశారు. ఇలా తుక్కుగూడ, బొంగ్లూరు జంక్షన్‌ల మధ్య ఇరువైపులా 20 చోట్ల ఔటర్ మీదకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలపై సభకు వచ్చిన వారి కోసం బస ఏర్పాట్లు చేశారు. గుఢారాలు, ఇతర సౌకర్యాలు కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment