మెతుకు సీమలో.. నువ్వా నేనా! | Sakshi ground report in joint Medak district | Sakshi
Sakshi News home page

మెతుకు సీమలో.. నువ్వా నేనా!

Published Mon, Nov 20 2023 4:54 AM | Last Updated on Mon, Nov 20 2023 4:54 AM

Sakshi ground report in joint Medak district

మెతుకుసీమ ఉమ్మడి మెదక్‌ జిల్లాలో  అత్యధిక శాసనసభ స్థానాల్లో నెగ్గి రాజకీయ  ఆధిపత్యం నిలుపుకునేందుకు అధికార బీఆర్‌ఎస్‌ చెమటోడ్చుతుండగా, మళ్లీ పూర్వ  వైభవాన్ని సంతరించుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంతజిల్లా ఉమ్మడి మెదక్‌లో  బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీ  రెండు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీ బంధు, కల్యాణలక్ష్మి వంటి ప్రజాకర్షక సంక్షేమ పథకాలే ప్రధాన అండగా బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో  10 శాసనసభ నియోజకవర్గాలుండగా,  సిద్దిపేట, గజ్వేల్‌ మినహా మిగిలిన 8 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి.  అధికార బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సర్వశక్తులూఒడ్డి పార్టీని గట్టెక్కించడానికి  విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో  ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్‌  పాత కేడర్‌ మళ్లీ సంఘటితమై ఆ పార్టీ  గెలుపుకోసం పావులు కదుపుతోంది.  ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రజానాడిని  పట్టేందుకు ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో  అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి  అందిస్తున్న ప్రత్యేక గ్రౌండ్‌ రిపోర్టు.

సిద్దిపేట   మెజారిటీపైనే లెక్కలు 
సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌ తరఫున మంత్రి తన్నీరు హరీశ్‌రావు, కాంగ్రెస్‌ తరఫున పూజల హరికృష్ణ పోటీ చేస్తున్నారు. 2004, 2008, 2010 ఉప ఎన్నికలు, 2009, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి వరుసగా ఆరు పర్యాయాలు గెలుపొందిన హరీశ్‌రావుకు ఈ ఎన్నికలు కూడా నల్లేరు మీద నడక లాంటివేనని తెలుస్తోంది. 2018లో 1.18లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి ఆయన రికార్డు సృష్టించారు. ఆయనకు పెద్దగా పోటీ లేదనే చెప్పాలి.  

సంగారెడ్డి  ఆ ఇద్దరి మధ్యే  
కాంగ్రెస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ మధ్య సంగారెడ్డిలో ద్విముఖ పోటీ నెలకొని ఉంది. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి బలమైన నాయకుడిగా పేరు పొందడం జగ్గారెడ్డికి కలిసివచ్చే అంశం. ఆయన స్థానికంగా ఉండడం లేదని విమర్శ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన ఆలస్యంగా ప్రచారాన్ని ప్రారంభించగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ రెండు నెలలుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. 2014లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన చింతా ప్రభాకర్‌ ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పథకాలు, పార్టీ బలగంపై ఆశలు పెట్టుకున్నారు. 

మెదక్‌  మెరిసేదెవరో..
మెదక్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌ మధ్య గట్టిపోటీ నెలకొని ఉంది. పద్మాదేవేందర్‌ రెడ్డి 2004లో రామాయంపేట(2009లో రద్దైంది), 2014, 2018 లో మెదక్‌ నుంచి గెలుపొందారు. నియోజకవర్గ వ్యవహారాల్లో ఆమె భర్త దేవేందర్‌రెడ్డి జోక్యంపై కొంత ప్రతికూల ప్రచారం ఉంది. బీఆర్‌ఎస్‌ పథకాలే ఆమెకు బలం. మల్కాజ్‌గిరి ఎంపీ మైనంపల్లి హన్మంతరావు కుమారుడైన మైనంపల్లి రోహిత్‌ తొలిసారిగా మెదక్‌ నుంచి పోటీచేస్తున్నారు. హన్మంతరావు 2009లో టీడీపీ తరఫున ఇక్కడి నుంచి గెలుపొందారు. స్థానికంగా మైనంపల్లి కుటుంబానికి గట్టి పట్టు ఉండడం రోహిత్‌కు కలిసి వచ్చే అంశం.  

జహీరాబాద్‌ ఎవరికి జై కొట్టేనో.. 
జహీరాబాద్‌ ఎస్సీ రిజర్వ్‌ స్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొన్నింటి మా­ణిక్‌రావు, కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌ మ«­ద్య ద్విముఖ పోటీ నెలకొని ఉంది. మాణిక్‌రావు స్థానికుడిగా మూడోసారి పోటీ చేస్తున్న అభ్యర్థిగా ఓటర్లతో కలియతిరుగుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి నరోత్తమ్‌ బీఆర్‌ఎస్‌లో చేర­డం ఆయనకు కలిసి వచ్చే అంశమే. ఇక చంద్రశేఖర్‌ స్థానికుడైనా,  ఈ ప్రాంత ప్ర­జలకు కొత్త అభ్యర్థి. అయితే కాంగ్రెస్‌ పార్టీకి జహీరాబాద్‌ కంచుకోటగా పేరుంది. ఇప్పటి వరకు ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్‌ పార్టీ 12 సార్లు గెలుపొందింది. స్థానికంగా పార్టీకి బలమైన కేడర్, ఓటు బ్యాంకు ఉండడం కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశాలు.   

పటాన్‌చెరు  పోటాపోటీ 
పటాన్‌చెరులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి కాటా శ్రీనివాస్‌గౌడ్‌ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. 2014, 2018లో ఇక్కడి నుంచి గెలిచిన మహిపాల్‌రెడ్డి స్థానికంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2018లో ఓడిన శ్రీనివాస్‌గౌడ్‌ పట్ల సానుభూతి ఉంది. శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి దర్శన్‌ గౌడ్‌ అమీన్‌పూర్‌ సర్పంచ్‌గా, భార్య అమీన్‌పూర్‌ ఎంపీటీసీగా పనిచేశారు. కాంగ్రెస్‌ నుంచి తొలుత టికెట్‌ పొంది ఆ తర్వాత రద్దు కావడంతో బీఎస్పీ తరఫున అభ్యర్థి బరిలో దిగిన సర్పంచ్‌ నీలం మధు సైతం గట్టిపోనిస్తుండడంతో ఆయన చీల్చే ఓట్లు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. 

దుబ్బాక  ఆ ముగ్గురి మధ్యనే.. 
దుబ్బాకలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉంది. ముగ్గురు హోరాహోరీగా తలపడుతున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డికి ప్రభుత్వ పథకాలు, అధికార పార్టీ బలం వచ్చే అంశాలు. శ్రీనివాస్‌రెడ్డి తండ్రి దివంగత ముత్యంరెడ్డి 1989, 1994, 1999లో వరుసగా మూడు పర్యాయాలు టీడీపీ తరఫున దొమ్మాట (2009లో రద్దైంది) నుంచి, 2009లో కాంగ్రెస్‌ తరఫున దుబ్బాక నుంచి గెలుపొందారు.

ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతో ప్రజల్లో ఇంకా ఆదరణ ఉండడం శ్రీనివాస్‌రెడ్డికి కలిసివచ్చే అంశం. 2020 ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి 1,079 ఓట్ల స్వల్ప మెజారిటీతో బీజేపీ తరఫున గెలిచిన రఘునందన్‌ రావు సైతం మరోసారి గెలిచేందుకు గట్టిగా కృషిచేస్తున్నారు. యువతలో బీజేపీ పట్ల ఉన్న ఆదరణ కలిసి వచ్చే అంశం.  

గజ్వేల్‌  సీఎం కేసీఆర్‌తో ఈటల ఢీ  
గజ్వేల్‌ నుంచి సీఎం కేసీఆర్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ బరిలో ఉన్నారు. కేసీఆర్‌ ఆధిక్యతతో ముందంజలో ఉన్నా, ఈటల రాజేందర్‌ నుంచి కొంత పోటీ ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు పర్యాయాలు సీఎం కావడం, గజ్వేల్‌ను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడం కేసీఆర్‌కు ఎన్నికల్లో కలిసివచ్చే అంశాలు. గజ్వేల్‌లో ముదిరాజ్‌ సామాజికవర్గ ఓటర్లు గణనీయంగా ఉండడంతో ఈటల రాజేందర్‌కు కొంత మద్దతు లభిస్తోంది. 

నారాయణఖేడ్‌  ద్విముఖ పోటీ 
నారాయణఖేడ్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మారెడ్డి భూపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి పటోళ్ల సంజీవరెడ్డి మధ్య గట్టిపోటీ నెలకొని ఉంది. భూపాల్‌రెడ్డి 2016 ఉపఎన్నిక, 2018 సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచి రెండు పర్యాయాలూ 50వేలకు పై చీలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సీఎం కేసీఆర్‌  ఎన్నికల ప్రచార సభ నిర్వహించడం కలిసి వచ్చే అంశం.

కాంగ్రెస్‌ టికెట్‌ తొలుత మాజీ ఎమ్మెల్యే సురేశ్‌షెట్కార్‌కు కేటాయించగా, ఆయన తప్పుకుని పటోళ్ల సంజీవరెడ్డికి అవకాశం కల్పించారు. సంజీవరెడ్డి తండ్రి పి.కిష్టారెడ్డి ఇక్కడి నుంచి గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేయడంతో వారి కుటుంబానికి స్థానికంగా మంచి పట్టు ఉంది. సురేశ్‌షెట్కార్‌ మద్దతు ఉండడం సంజీవరెడ్డికి కలిసి వచ్చే అంశం.  

అందోల్‌ ఎవరికి అండనో.. 
అందోల్‌ ఎస్సీ రిజర్వుడ్‌ స్థానంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మధ్య ద్విముఖ పోటీ నెలకొని ఉంది. దామోదర రాజనర్సింహ 1989, 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచారు.

చంటి క్రాంతి కిరణ్‌ తొలిసారిగా 2018 ఎన్నికల్లో రాజనర్సింహపై 16వేలపై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ బలగంపై క్రాంతి కిరణ్‌ ఆశపెట్టుకోగా, తన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రభుత్వ వ్యతిరేకతపై రాజనర్సింహ ఆశలు పెట్టుకున్నారు. గతంలో వరుసగా రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి ఆయనకు ఉంది. 

నర్సాపూర్‌  నువ్వానేనా  
నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి వి.సునీతాలక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి మధ్య ద్విముఖ పోటీ నెలకొని ఉంది. సునీతా లక్ష్మారెడ్డి 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున వరుసగా మూడు పర్యాయాలు ఇక్కడి నుంచి గెలుపొందగా, రాజీరెడ్డి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు పెరగడం సునీతారెడ్డికి కలిసొచ్చే అంశం. 20014, 2019లో ఇక్కడి నుంచి గెలుపొందిన సిట్టింగ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సీహెచ్‌ మదన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించినా, ఆయన మాత్రం సునీతారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత నాలుగైదు ఏళ్ల నుంచి రాజిరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తుండడం ఆయనకు కలిసివచ్చే అంశం. 

మద్యానికి బానిసగా యువతను మార్చుతున్నారు
ఎన్నికలొస్తే చిన్న వయస్సు పిల్లలను కూడా బాగా తాపించి కరాబ్‌ చేస్తున్రు. ఫంక్షన్‌ హాళ్లలో చికెన్‌ బిర్యానీ వండి పెడ్తున్రు. ఓటర్ల స్థాయిని బట్టి బ్రాండ్ల లిక్కర్‌ పంచుతున్రు. వాళ్లు బీరు, బిర్యానీ, 500 నోటు ఇవ్వుడు.. పోరగాళ్లు  తాగి కింద పడుడు. నాలుగు రోజులు(ఎన్నికలు) పోయాక మద్యానికి డబ్బులు కావాలని ఇంట్లో పెళ్లాలను కొడుతున్నరు. ఆడవాళ్లతోనే ధర్నా చేయించాలనుకుంటున్నాం.      – గొండి మల్లయ్య, సిర్పూరు, హత్నూర 

మున్సిపాలిటీతో ఉపాధి బంద్‌
అల్లాపూర్‌ను మున్సిపాలిటీలో కలపడంతో 2018 నుంచి ఉపాధి హామీ పథకం కట్‌ అయ్యింది. మా ఊర్లో 370 కుటుంబాలుంటాయి. ఇంట్లో ఇద్దరు కూలీకి పోతే ఒక్కొక్కరికి రోజుకి రూ.250 కూలీ వచ్చేది. ఇప్పుడు మొత్తం బంద్‌ అయింది. 2014లో గజ్వేల్‌ మున్సి­పాలిటీ అయితే 2018 వరకు అక్కడ ఉపాధి హామీ పని నడిచింది. మా దగ్గర వెంటనే బంద్‌ చేశారు.  – మన్నే భాస్కర్‌ ఎల్లాపూర్, గజ్వేల్‌   

రైతుబంధుకు కటాఫ్‌ పెట్టాలి 
మా ఊర్లో 20 ఎకరాలున్న వారికి కూడా  రైతుబంధు వస్తుంది. మినిమం కటాఫ్‌  పెట్టాలి. తుమ్మ చెట్లు మొలిచిన భూములకు, ఫారెస్ట్‌లాగా ఉన్న భూములకూ ఇస్తున్నరు. ఐదెకరాలు ఉన్నోడికి అదే ఇస్తున్రు. 200 ఎకరాలున్నోడికి అదే ఇస్తున్రు. వడగండ్లు పడి పోయిన పంట ఖరాబ్‌ అయింది.  ఎకరాకు రూ.10వేలు ఇస్తామన్నరు. ఇప్పటి వరకు ఒక రూపాయి  రాలేదు.    –కిష్టయ్య, పైతరా, కొల్చారం  

-ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి ముహమ్మద్‌ ఫసియుద్దీన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement