ముందస్తు ఎన్నికలకు సమర శంఖం పూరించిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జహీరాబాద్ మినహా మిగతా అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సుమారు అరడజను నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను నిర్ణయించిన తీరుపై టీఆర్‌ఎస్ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కొన్నిచోట్ల పార్టీ నిర్ణయంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొన్ని నియోజకవర్గాల్లో బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగ రాజుకుంటోంది. నారాయణఖేడ్, జనగామ, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరు నేతలు ప్రెస్‌మీట్లు, దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలతో తమ నిరసన తెలియజేస్తున్నారు. పార్టీ అభ్యర్థులపై అసంతృప్తిని వెల్లగక్కుతున్న నేతలెవరూ ఇప్పటి వరకు పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించలేదు. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు కొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులే స్వయంగా రంగంలోకి దిగారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పార్టీ అభ్యర్థులతో పాటు, ముఖ్య నేతలు ఆపధర్మ మంత్రి హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ తదితరులు ఆదివారం హరీశ్‌రావును కలిసిన జిల్లా నేతల జాబితాలో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా అసమ్మతి నేతలు, క్రియాశీల కార్యకర్తల వివరాలను సేకరించే పనిని జిల్లాకు చెందిన ఒకరిద్దరు ముఖ్య నేతలకు హరీశ్ అప్పగించినట్లు తెలిసింది. త్వరలో నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలు, అసమ్మతి నేతలతో ఆయన స్వయంగా భేటీ అయ్యే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, హరీశ్‌రావు పోటీ చేసే సిద్దిపేటతో పాటు దుబ్బాక, హుస్నాబాద్, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతి బెడద లేకపోవడంతో త్వరలో ప్రచార పర్వం ప్రారంభించేందుకు నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
హరీశ్‌ను కలిసిన ఆర్‌ఎస్
సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ఆదివారం హరీశ్‌రావును కలిసి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసి ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసినా గుర్తింపు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసి నట్లు తెలిసింది. క్లిష్ట సమయంలో పార్టీ పూర్వపు మెదక్ జిల్లా అధ్యక్షుడిగా తాను చేసిన కృషిని గుర్తు చేయడంతో పాటు, ప్రస్తుత అభ్యర్థిపై వివిధ వర్గాల్లో అసంతృప్తి ఉందనే అంశాన్ని హరీశ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు సంగారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ శనివారం రాత్రి హరీశ్‌రావును కలిసి నియోజకవర్గంలోని పరిస్థితిని వివరించినట్లు తెలిసింది.
పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్ శని, ఆదివారాల్లో తన సన్నిహితంగా ఉండే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న తనకు అవకాశం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉంటానని తెగేసి చెబుతున్నారు. మరోవైపు అసంతృప్తితో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న నేతలతో పార్టీ అభ్యర్థి, తాజా,మాజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మంతనాలు సాగిస్తున్నారు. స్వయంగా కొందరు నేతల ఇళ్లకు వెళ్లి ఎన్నికల్లో సహకరించాల్సిందిగా కోరుతున్నారు. 2009, 2014 ఎన్నికల్లో పటాన్‌చెరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన సపాన్‌దేవ్ ఆదివారం హరీశ్‌రావును కలిశారు. మహిపాల్‌రెడ్డికి టికెట్ ఇస్తున్నట్లు కేసీఆర్ స్వయంగా సపాన్‌దేవ్‌కు రెండు రోజుల ముందే సమాచారం ఇవ్వడంతో పాటు, పార్టీ అభ్యర్థికి సహకరించాల్సిందిగా సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో సపాన్‌దేవ్ తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి వైఖరిని ప్రకటించే అవకాశముంది.
నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో తాజా, మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలు రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఆదివారం జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు మల్‌శెట్టి యాదవ్, కంగ్టి ఎంపీపీ రామారావు రాథోడ్, జెడ్పీటీసీ సభ్యుడు రవి తదితరులు నారాయణఖేడ్‌లో ర్యాలీ తీసి భూపాల్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ‘భూపాల్‌రెడ్డి హఠావో.. నారాయణఖేడ్ బచావో’ పేరిట జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రోత్సాహం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో అంతర్భాంగా ఉన్న సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఆదివారం తాజా, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నేతలు కొందరు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, రామగళ్ల పరమేశ్వర్, కొండం మధుసూదన్‌రెడ్డి తదితరులు ముత్తిరెడ్డికి అవకాశం ఇవ్వొద్దని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.
అందోలు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు టికెట్ నిరాకరించిన కేసీఆర్.. జర్నలిస్ట్ చంటి క్రాంతి కిరణ్‌కు అవకాశం ఇచ్చారు.
దీంతో బాబూమోహన్‌కు సన్నిహితంగా ఉండే నేతలు కొందరు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. తాను కేసీఆర్‌తో మాట్లాడతానని, మీ భవిష్యత్తు మీరే చూసుకోండని తన అనుచరులకు బాబూమోహన్ చెప్పినట్లు తెలిసింది. దీంతో శనివారం మండలాల వారీగా టీఆర్‌ఎస్ నేతలు, క్రియాశీల కార్యకర్తలు సమావేశమై.. అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నట్లు సమాచారం. మరోవైపు క్రాంతి కిరణ్ మండలాల వారీగా పార్టీ నేతలను కలుస్తూ.. మద్దతు కోరుతున్నారు. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్ తొలుత అసంతృప్తి వ్యక్తం చేసినా, తిరిగి పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని అసంతృప్త నేతలు, కార్యకర్తల వివరాలు సేకరించే బాధ్యతను హరీశ్‌రావు ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది.
అసమ్మతి జ్వాల
Published Mon, Sep 10 2018 12:07 PM | Last Updated on Tue, Oct 16 2018 3:19 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment