కొంగరకలాన్‌కు తరలివెళ్లిన వాహనాలెన్ని, జనమెంత.. తక్కువ వెళ్లడానికి కారణాలేమిటీ? క్షేత్రస్థాయిలో నాయకులు జన సమీకరణ చేయలేదా..మరేమైనా కారణాలున్నాయా..? ప్రగతి నివేదన సభ జనసమీకరణపై నిఘా పెట్టిన ఇంటటిజెన్స్ వర్గాలు నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ పార్టీ నేతల్లోనూ అంతర్మథనం మొదలైంది. అనుకున్న మేర జనం రాకపోవడంపై కారణాలు విశ్లేషించే పనిలో పడ్డారు.
సాక్షి, యాదాద్రి : టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొంగరకలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభపై పోస్టుమార్టం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. జన సమీకరణ, తరలివెళ్లిన వాహనాల వివరాలపై నియోజకవర్గాల వారీగా ఇంటలిజెన్స్ వర్గాలు వివరాలు సేకరించాయి. ప్రగతి నివేదన సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 20నుంచి 25వేల మందిని తరలించాలని టీఆర్‌ఎస్ అధినా యకత్వం నిర్ణయించింది. ఈ మేరకు సభకు పది రోజుల ముందు నుంచే పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎక్కడికక్కడ తిష్ట వేసి విస్త్రృత ప్రచారం చేశారు. ప్రతి గ్రామానికి వాహనాలు పంపించారు. కానీ, కొన్ని మం డలాల నుంచి జనం ఆశించిన స్థాయిలో రాకపోవడంపై నేతల్లో అంతర్మథనం మొదలైంది. జన సమీకరణలో క్షేత్రస్థాయి నాయకులు ఆసక్తి చూపలేకపోయారా..? మరే కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో అధ్యయనం చేస్తున్నారు.
లెక్కల్లో తేడా..
ప్రగతి నివేదన సభకు జరిగిన జన సమీకరణకు సంబంధించి ఇంటలిజెన్స్ , టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు చెబుతున్న లెక్కలకు తేడా ఉన్నట్లు వెల్లడైంది. ఆదివారం జరిగిన సభకు వెళ్లిన జన సమీకరణపై ఇంటలిజెన్స్ వర్గాలు ప్రధాన రహదారులపై తిష్ట వేసి నిఘా పెట్టాయి. జిల్లాలోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల నుంచి వాహనాల్లో తరలిన జనాన్ని లెక్కించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 15వేల వరకు వెళ్లి నట్లు గుర్తించారు. బీబీనగర్, చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్‌ల వద్ద వెళ్తున్న వాహనాల్లో జనాల సంఖ్యను లెక్కించడంతోపాటు మండల కేంద్రాలనుంచి స మాచారాన్ని రాబట్టారు.
కదిలిన జనం ఇలా..
భువనగిరి నియోజకవర్గంలో బీబీనగర్, భువనగిరి రూరల్ మండలాల నుంచి ఆశించిన స్థాయిలో జనం రాలేదని ఇంటలిజెన్స్ వర్గాలు తేల్చాయి. పోచంపల్లి మండలం నుంచి ఆశించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం రావడం, చివరి నిమిషంలో వాహనాలు లేక కొందరు వెనుదిరగినట్లు గుర్తించారు. ఆలేరు నియోజకవర్గంలో పరిస్థితి మరోల గుర్తించారు. రాజాపేట, ఆలేరు, బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల నుంచి ఆశించిన స్థాయిలో జనం సభకు తరలిపోగా గుండాల, ఆత్మకూరు(ఎం) మండలాల నుంచి తక్కువగా వచ్చినట్లు గుర్తించారు. అయితే ఈ మండలాల్లో జిల్లాల, మండలాల పునర్విభజన ప్రభావం అధికంగా కనిపించింది.
క్షేత్రస్థాయిలో సమీక్షలు..
ప్రగతి నివేదన సభ జనసమీకరణపై ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అంచనా వేసిన దానికంటే అధికంగా జన సమీకరణ చేసినట్లు ప్రకటించినప్పటికీ ఇంటలిజెన్స్ నివేదికలు అం దుకు విరుద్ధంగా ఉండటంతో కారణాలు ఏమిటన్న విషయంపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. మండలాలు, గ్రామాల వారీగా జన సమీకరణ హెచ్చుతగ్గులపై పోస్టుమార్టం చేస్తున్నారు. సభకోసం జన సమీకరణకు పెద్ద ఎత్తున వాహనాలు గ్రామాలకు పంపించినప్పటికీ జనం అన్నిచోట్ల ఎందుకు రాలేకపోయారని చర్చ జరుగుతోంది. అయితే బోనాల పండుగ ఎఫెక్ట్ కూడా కొంత మేరకు ఉందని ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’తో చెప్పారు.
నేతల్లో గుబులు
ప్రగతి నివేదిక సభకు అనుకున్న మేరకు జిల్లా నుంచి జనం వెళ్లకపోవడంతో పార్టీ నేతల్లో గుబులు నెలకొంది. పార్టీ అధిష్టానం కూడా ఈ విషయమై అన్ని జిల్లాల నుంచి ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటుండడం, ఇప్పటికే నిఘా వర్గాలు నివేదిక సిద్ధం చేయడంతో ఏం జరగనుందోనన్న ఆందోళనలో గులాబీ నేతలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment